Abdul Rajahussain ….. *ఆ ‘ముక్కుమీది కోపం’.. ఆ ‘బుంగమూతి చందం’… అభినవ “సత్యభామ” ఇక లేదు..!! *జనహృదయాలను దోచుకున్న” జమున “! *నట యమున..ఈ జమున మాతృభాష కన్నడం అంటే మీరు నమ్మగలరా!
* జమున బుర్రకథ నాజర్ శిష్యురాలు..!!
* పగలే వెన్నెల.. ఆమె నటన..!!
Ads
* ఆమె అందం గోదారి గట్టు…
* నటన… ఆమె చిరునామా..!!
* కుక్కలంటే…ఆమె కెంతో ఇష్టం..!!
* పుంభావ చిత్రరంగంలో ఆత్మాభిమాన అభినేత్రి, సత్య ధిక్కారం రూపెత్తిన జమున నిత్య అగ్నిగాత్రి” (షుకూర్)
జమున తెలుగమ్మాయి కాకపోయినా తెలుగు వారి కోడలిగా తెలుగు నేలపై స్థిరపడ్డారు. తెలుగు సినిమాల్లో నటించారు.. తెలుగు మాతృభాష
కాకపోయినా.. తెలుగుపై గట్టిపట్టు సాధించారు. ఆమె డైలాగ్ డిక్షన్ సమ్ థింగ్ స్పెషల్. ఆమెనోటి నుంచి వెలువడే సంభాషణలు తెలుగు భాష
మాధుర్యాన్ని మరింత పరిమళింపజేసేవి.
జమున 1936 ఆగష్టు 30న హంపీలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు సమీపంలోని మోరంపూడి ఆమెది. జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేది. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో
శిక్షణ ఇప్పించింది. జగ్గయ్యది కూడా అదే వూరు. తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ‘ఖిల్జీ రాజ్య పతనం’ అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమునను ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు.
ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా నటించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించారు..! నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం. బుర్రకథ బ్రహ్మ నాజర్ దగ్గర శిక్షణ తీసుకోవటమే తన నట జీవితానికి పట్టం కట్టిందని జమున చెప్పేది..కేవలం తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.
1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు పొందింది… తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు. పండంటి కాపురంలోని రాణీ హేమమాలిని పాత్ర ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది.. నాటితరం ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, హరనాథ్, కృష్ణ తదితర అగ్ర నటులతో ఆమె నటించింది.
*సామాజిక సేవ..!
తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నదామె. ముఖ్యంగా సీనియర్ సినీనటులకు పెన్షన్ ఇప్పించిన ఘనత జమునదే..
*అపర సత్యభామ..!
“మీర జాలగలడా నా యానతి..”అంటూ సత్యభామ తెరపై కనిపించిందంటే.ఖచ్చితంగా మనకు ముందుగా గుర్తొచ్చేది జమునే. వినాయకచవితి చిత్రంలో మొదటి సారి సత్యభామలో కనిపించింది జమున. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో మళ్ళీ సత్యభామగా మెరిసింది. ప్రేక్షకులను మురిపించింది. సాంఘిక చిత్రాల్లో మూగమనసుల్లోని “గౌరి” పాత్రలో చూపించిన ముక్కుమీది కోపం, చిలిపిదనం, బుంగమూతి విన్యాసాలు న భూతో న భవిష్యతి.
*ఇందిరంటే…ప్రాణం.!!
జమున గారికి ఇందిరాగాంధీ అంటే అభిమానం. ప్రాణం.దానివల్లే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.. 1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపీగా ఎన్నికైంది. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా, 1990వ దశకంలో భారతీయ జన
తా పార్టీ తరఫున ప్రచారం చేసింది… కాంగ్రెస్ తరపున మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో కూడా పోటీచేసింది… అయితే ఆమె రాజకీయాల్లో అంతగా రాణించలేకపోయారు.
జమున లైఫ్ స్టయిల్…
ప్రత్యేకంగా వుండేది ఆమె లైఫ్ స్టయిల్… బంజారా హిల్స్ లోని ఆమె ఇంటిని చూస్తే…. ఆమె అభిరుచి ఏమిటో తెలుస్తుంది…. కుక్కలంటే ఆమెకు ఎంతో ఇష్టం.. ఆమె ఇంటికి వెళ్ళి కలుసుకునేవారికి ఈ కుక్కల భయం వుండేది. బయటకు పెళుసుగా కనిపించే జమున నిజానికి భోళా మనిషి అంటారు సినీ నటి వాణిశ్రీ..!! జమునకు కన్నీటి నివాళులు..! –— ఎ.రజాహుస్సేన్…!
Share this Article