జాతీయ రాజకీయాలు, ప్రధాని పదవి… కేసీయార్ ఆలోచనలన్నీ ఇవే ప్రస్తుతం… అదుగో ఏర్పాట్లు, త్వరలో ప్రధాని పదవీ ప్రమాణస్వీకారం అన్నట్టుగా ప్రచారం సాగుతుంటుంది… కానీ ఇండియాటుడే ప్రధాని పదవికి తగిన ప్రతిపక్ష నేత అనే ప్రశ్నపై జాతీయ స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపినప్పుడు (మూడ్ ఆఫ్ ది నేషన్) కేసీయార్ పేరు అసలు కనిపించనేలేదు… అదేమంటే..? అసలు తనను ఓ కంటెండర్‌గా భావించి, లిస్టులో పెడితే కదా జనం అభిప్రాయం తెలిసేది అనే ఓ అభిప్రాయం, సూచన వ్యక్తమయ్యాయి నిన్న ఓ చిన్న డిస్కషన్లో…
ఇంత హంగామా చేస్తున్నాడు కదా, మరి ఇండియాటుడే కేసీయార్‌ను అసలు సోదిలో లేకుండా తీసిపారేయడం ఏమిటి..? కేజ్రీవాల్, మమతకన్నా ఏం తక్కువ అంటారా..? ఆ మీడియా సంస్థ ఎడిటోరియల్ వింగ్ అలా ఫీలైంది అని మరో అభిప్రాయం… నో, నో, ఇండియాటుడే వాళ్లు అప్పుడప్పుడూ నమస్తే తెలంగాణ పత్రికతోపాటు నమస్తే ప్రభ, నమస్తే సాక్షి కూడా చదవాలి కదా, లేకపోతే కేసీయార్ హల్చల్, జోరు వాళ్లకు ఎలా అర్థమవుతాయని ఓ జోక్…
నిజంగానే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను సూక్ష్మంగా పరిశీలిస్తే అసలు కేసీయార్ పట్ల దేశం అభిప్రాయం ఏమిటో సూచనప్రాయంగానైనా అర్థం అవుతుంది… వాళ్లు మోస్ట్ పాపులర్ సీఎం అనే విభాగంలో సర్వే చేస్తే… టాప్ టెన్‌లో కూడా లేడు కేసీయార్… ఇందులో ఫస్ట్ ప్లేసు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్… అక్షరాలా అర్హుడు… సెకండ్ ప్లేస్ అరవింద్ కేజ్రీవాల్… ఈమధ్య తరచూ వార్తల్లో నిలబడుతున్న అస్సోం సీఎం హిమంత విశ్వ శర్మ మూడో ప్లేసు, తరువాత స్థానాల్లో చత్తీస్‌గఢ సీఎం భూపేష్ బాఘెల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు స్టాలిన్, గుజరాత్ భూపేంద్ర పటేల్… చివరి టాప్ టెన్ ప్లేసులో ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి… ఎక్కడ జాతీయ ముఖ్యమంత్రి కేసీయార్..?!
Ads
ఇవేమో ఆయా రాష్ట్రాల్లో సాగించిన సర్వే ఫలితాలు… మరి మీ దృష్టిలో ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అని జాతీయ స్థాయిలో అందరినీ ప్రశ్నిస్తే డిఫరెంట్ రిజల్ట్ కనిపించింది… ఫస్ట్ ప్లేస్‌లో యోగి, సెకండ్ కేజ్రీవాల్ నిలిచారు… తరువాత వరుసగా మమత బెనర్జీ, స్టాలిన్, నవీన్ పట్నాయక్, హిమంత విశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఏకనాథ్ షిండే, జగన్మోహన్రెడ్డి, భూపేష్ బాఘెల్ ఉన్నారు… ఇక్కడా కేసీయార్ జాడ లేదు… యోగి అందర్నీ స్పష్టంగా డామినేట్ చేస్తున్నాడు…
ఈ రెండురకాల కేటగిరీల్లోనూ తెలుగు సీఎంలు పూర్… మరీ కేసీయార్ జాడ లేదు… జగన్ కనీసం టాప్ టెన్ జాబితాలో కనిపిస్తున్నాడు… సో, కేసీయార్‌ను ప్రధాని కంటెండర్ జాబితాలో చేర్చకపోవడంలో ఇండియాటుడే తప్పుటడుగు వేసినట్టు ఏమీ కనిపించడం లేదు… కేసీయార్‌పై వాళ్లకున్న అంచనా అది… కాకపోతే వాళ్లు అప్పుడప్పుడూ తెలంగాణ పత్రికల్ని, జాతీయ స్థాయిలో మీడియాకు ఇచ్చే బీఆర్ఎస్ యాడ్స్‌ను చదువుతూ ఉండాలి… మీరే చదవకపోతే ఇక వందల కోట్ల యాడ్స్ డబ్బులు తెలంగాణ జనం ఎందుకు భరిస్తున్నట్టు బ్రదర్స్..?!
Share this Article