Nancharaiah Merugumala ….. గాంధీజీ హంతకులకున్న అభిమానులు రాజీవ్‌ని చంపినోళ్లకు లేరు…. ఖూనీ చేసినోళ్ల ప్రాంతం, కులం, మతం, రాజకీయ సిద్ధాంతాలే కీలకం….. మోహన్ దాస్ గాంధీ కన్నుమూసి రేపటికి 75 ఏళ్లు. గుజరాతీ మహాత్ముడిని చంపిన మరాఠీ హంతకుడు నాథూరామ్ గోడ్సేను దిల్లీలో గాంధీజీని హత్యచేసిన స్థలంలోనే పట్టుకున్నారు. కోర్టు విచారణ తర్వాత 1949 నవంబర్ 15న అతన్ని ఉరితీశారు. ఇప్పటి హరియాణాలోని అంబాలా జైలులో శిక్ష అమలు చేశారు.
స్వతంత్ర భారతదేశంలో తొలి పెద్ద రాజకీయ హంతకుడిగా గోడ్సే తాను చేసిన నేరానికి 39 సంవత్సరాల వయసులో శిక్ష అనుభవించాడు. దైవభక్తి, పాపభీతి ఉన్న హిందువైన గాంధీని గోడ్సే చంపిన కారణంగా మరాఠీ బ్రాహ్మణులేగాక, దేశంలోని బ్రామ్మలందరూ బాధపడ్డారు. మోహనదాసు హత్యకేసులో మరణశిక్ష పడిన ఇద్దరూ (గోడ్సే, నారాయణ ఆప్టే) మరాఠీ బ్రాహ్మణులు కావడం కూడా ఈ సామాజికవర్గాన్ని కుంగదీసింది.
అయితే, గాంధీ పోకడలు, ఆలోచనల వల్ల యావత్ హిందూ సమాజానికి నష్టమని ఒక్క బ్రాహ్మణులేగాక అగ్రవర్ణ హిందువులు కొందరు అప్పట్లో భయపడ్డారట. ఈ ఇద్దరి మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చాలని గాంధీజీ కొడుకులు మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీలు నాటి నెహ్రూ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి, కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో గోడ్సే, ఆప్టేలను 73 ఏళ్ల క్రితం ఉరితీశారు. ఉరితీసేటప్పుడు ఆప్టే మెడ తెగి వెంటనే అతను మరణించాడని, గోడ్సే మాత్రం ఉరితాడు మెడకు నొక్కుకుపోయి 15 నిమిషాల పాటు నరకయాతనతో కన్నుమూశాడని ‘ఆల్మనాక్ ఆఫ్ వరల్డ్ క్రైమ్’ తెలిపింది.
Ads
ఏడున్నర దశాబ్దాల తర్వాత భారతదేశంలో మారిన పరిస్థితుల వల్ల నాథూరామ్ గోడ్సేను, వినాయక్ సావర్కర్ ను అభిమానించే జనం చెప్పుకోదగ్గ సంఖ్యలో కనిపిస్తున్నారు. హిందుత్వకు ఒక దశలో పెరిగిన ఆదరణే గోడ్సే పేరు ఇంకా దేశంలో జనం తలుచుకోవడానికి కారణం. గాంధీజీ హత్య తర్వాత 42 ఏళ్లకు జరిగిన 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కారకులైన హంతకుల పేర్లు మాత్రం నేడు తలిచేవారు లేరు. రాజీవ్ సర్కారు విధానాల వల్ల, దుందుడుకు పోకడల వల్ల నష్టపోయిన శ్రీలంక తమిళులు ఆయన హంతకులు కావడమే దీనికి కారణం.
రాజీవ్ చావుకు తక్షణ కారణమైన శ్రీలంక తమిళ యువతి థాణు బెల్టు బాంబు పేలుడులో ఆయనతోపాటే కన్నుమూసింది. ఈ హత్యకు కుట్రపనిన్నన తమిళ ఈళం లిబరేషన్ టైగర్స్ (ఎల్టీటీఈ) సూత్రధారి శివరాసన్ శ్రీపెరంబుదూరు స్థలంలో కుర్తా, పైజామా వేసుకుని నిలబడి ఉన్న వీడియో తర్వాత దొరికింది. ఒకే కన్ను ఉన్న శివరాసన్ ను అప్పట్లో భారత మీడియా ‘ఒన్ ఐడ్ జాక్’ (ఒంటి కన్ను ‘రాక్షసుడు) అని వర్ణించేది.
రాజీవ్ హత్య జరిగిన వెంటనే టైగర్లు శ్రీలంక పారిపోవడానికి కుదరకపోవడంతో వారు బెంగళూరు సమీపంలోని ఓ రహస్య ప్రదేశంలో చిక్కుకుపోయారు. కొన్ని వారాలకు పోలీసులు చుట్టుముట్టడంతో వారికి ప్రాణాలతో దొరికిపోవడం ఇష్టంలేక శివరాసన్, ఇతర టైగర్లు తమ వెంట ఉండే సైనేడ్ గుళికలు మింగి ప్రాణాలు తీసుకున్నారు. నిన్న ఈ హత్య కేసు గురించి చదువుతుండగా ఓ వెబ్‌సైట్‌లో– శివరాసన్ భౌతికకాయం, పక్కన మరో ఎల్టీటీఈ మహిళా కార్యకర్త మృతదేహం ఉన్న ఫోటో ఒకటి కనిపించింది.
ఈ హత్య కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ఉన్నతాధికారి డీఆర్ కార్తికేయన్ రాజీవ్ గాంధీని చంపిన ఈ టైగర్ల అంకితభావాన్ని కొనియాడుతూ తర్వాత మాట్లాడారు. తాము రాజీవ్ హంతకులను ప్రాణాలతో పట్టుకోవాలని ప్రయత్నించామని చెబుతూ, ‘భారత పోలీసులకు దొరకకుండా త్వరగా మరణించాలనే ఆతృతతో ఈ టైగర్లు ఉన్నారు. లక్ష్యసాధనకు అంతగా అంకితమైన వ్యక్తులను మేం ఇంత వరకు చూడలేదు,’ అని కార్తికేయన్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. గాంధీజీ హంతకులు గోడ్సే, ఆప్టే వంటి వారిని అభిమానించేవారు, పూజించేవారు దేశంలో ఇప్పటికీ కనిపిస్తున్నారు. కాని, రాజీవ్ హంతకులైన శివరాసన్, థాణు తదితరులను పెద్దగా తలిచేవారే లేరు. హత్య కేసుల్లో దోషుల కులం, మతం, సిద్ధాంతాలు ఈ విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి…
Share this Article