Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పేరులో మాత్రమే వట్టి… రాజకీయంలో గట్టివాడే… చిరంజీవికి దగ్గరి బంధువు…

January 29, 2023 by M S R

Siva Racharla……….   గట్టివాడు వట్టి వసంత్… చిరంజీవితో బంధుత్వం – అల్లు అరవింద్ తో స్నేహం- రాజశేఖర్ రెడ్డితో రాజకీయ ప్రయాణం… దటీజ్ వట్టి……. అవి 2004 ఎన్నికలు… అసలైన రాజకీయ యుద్ధం అంటే ఎలా ఉంటుందో చూసిన ఎన్నికలు.. రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పోరాడుతోంది… వైయస్సార్ వర్గంగా కొందరు, శిష్యులుగా కొందరు పార్టీని దాటి పోరాడారు…

బొత్స, కొణతాల, జక్కంపూడి, వట్టి, ఉదయభాను, కాసు కృష్ణారెడ్డి, ఆనం సోదరులు, సీకే బాబు, రఘువీరా… ఇలా అనేక మంది ఫ్రంట్ లైన్ లో నిలబడి పోరాడారు. ఉభయ గోదావరి జిల్లాలు టీడీపీకి కంచుకోటలాగా ఉండేవి… పశ్చిమ గోదావరి జిల్లాలో కోటగిరి విద్యాధర రావ్, కొత్తపల్లి సుబ్బారాయుడు, అబ్బాయి రాజు, ఇలా టీడీపీలో బలమైన నాయకత్వం ఉండేది. వైయస్సార్ కు వట్టి వసంత్ నమ్మకస్తుడు. పాదయాత్రలో కీలకంగా వ్యవహరించాడు .
వసంత్ తండ్రి పార్థసారధి జిల్లా బ్యాంక్ చైర్మన్ గా పనిచేశారు. 1984 ఎన్నికల్లో ఏలూరు ఎంపీ గా పోటీచేసి ఓడిపోయారు. వసంత్ 2004, 2009 ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి గెలిచారు. వైయస్సార్, రోశయ్య, కిరణ్ మంత్రివర్గంలో పనిచేశారు.
చిరంజీవితో బంధుత్వం – 
వసంత్ తండ్రి వట్టి పార్ధసారధి , వట్టి బంగారయ్య చిన్నాయన, పెదనాన్న పిల్లలు (కజిన్స్)… బంగారయ్య కూడా సొసైటీ చైర్మన్ గా పనిచేశారు . బంగారయ్య గారి చెల్లెలు కొడుకు చిరంజీవి సోదరి విజయను వివాహం చేసుకున్నారు. వీరి పిల్లలే సాయి ధర్మ తేజ్, వైష్ణవ్ తేజ్… అంటే వసంత్ మేన బావకు చిరంజీవి బావ… వసంత్ చిరంజీవి సోదరుల వరుస…
బంధుత్వం కన్నా చిరంజీవి, అరవింద్ లతో వసంత్ కు స్నేహం ఎక్కువ. అరవింద్ వసంత్ ఉమ్మడిగా వ్యాపారం కూడా చేశారు. 2004 ఎన్నికల్లో అప్పట్లో చిరంజీవి సన్నిహితుడిగా గుర్తింపున్న నిర్మాత అశ్వనీదత్ టీడీపీ తరుపున విజయవాడ ఎంపీగా పోటీచేశారు. నామినేషన్ కు , ప్రచారానికి చిరంజీవి వస్తారని అశ్వనీదత్ చెప్పారు. చిరంజీవి కటౌట్ లు, బ్యానర్లు కూడా కట్టారు. నేను కూడా చిరంజీవి అభిమానినే అని కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ పేపర్ ప్రకటన ఇచ్చారు.
చిరంజీవి మాత్రం ప్రచారానికి దూరంగా ఉండి, విజయవాడ లోక్ సభ స్థానం వరకు అశ్వనీదత్ కే నా మద్దతు, మిగిలిన నియోజకవర్గాల్లో న్యూట్రల్ గా ఉంటానని పేపర్ ప్రకటన ఇచ్చారు. కాంగ్రెస్ తరుపున ఒంగోలు ఎంపీ గా పోటీచేసిన మాగుంట కుటుంబానికి 1998 ఎన్నికల వరకు చిరంజీవి ఇలాంటి పత్రిక ప్రకటనే ఇచ్చేవారు.
చిరంజీవి టీడీపీకి మద్దతు ఇస్తున్నాడన్న ప్రచారాన్ని కౌంటర్ చేయటానికి లేక వట్టి వసంత్ తో ఉన్న స్నేహం వలనో కానీ అల్లు అరవింద్ మాత్రం వట్టి వసంత్ ఉంగుటూరు ఎమ్మెల్యే గా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజారాజ్యం – అటు చిరంజీవి ఇటు వైయస్సార్
2008లో చిరంజీవి రాజకీయ రంగప్రవేశం మీద వార్తలు వచ్చిన మొదటి రోజుల్లో వసంత్ చిరంజీవిని కొత్తపార్టీ పెట్టవద్దని, రాజకీయాల్లోకి రావాలనుకుంటే కాంగ్రెస్లో చేరాలని అడిగారు. చిరంజీవి వసంత్ ప్రతిపాదనను అంగీకరించకపోవటంతో, కాంగ్రెస్ తరుపున రోశయ్యను చిరంజీవితో మాట్లాడమని పంపారు. ఆ చర్చలు కూడా సఫలం కాలేదు.
వసంత్ మాత్రం ఒక్కసారి కూడా ప్రజారాజ్యం వైపు ఆలోచించలేదు. ఎన్నికల ప్రచారం సమయంలో చిరంజీవి వసంత్ వాళ్ళ ఇంటికి వెళ్లి పార్థసారధిని కలిశారు. 2009 ఎన్నికల్లో చింతలపూడి యస్సి రిజర్వ్ కావటంతో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోటగిరి విద్యాధర రావు ప్రజారాజ్యం తరుపున ఉంగుటూరులో పోటీచేశారు. వట్టి వసంత్ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అయినా చిరంజీవి కోసం కాపులు ప్రజారాజ్యంకు ఓటు వేస్తారని, కోటగిరికి ఉన్న మంచి సంబంధాలతో ఆయన సులభముగా గెలుస్తారని ప్రచారం జరిగింది కానీ ఆ ఎన్నికల్లో వట్టి వసంత్ టీడీపీ అభ్యర్థి గన్ని లక్ష్మి కాంతం మీద 6500 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కోటగిరి టీడీపీ అభ్యర్ధికన్నా మూడు వేల ఓట్లు తక్కువతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.
ఆ ఓటమి చిరంజీవి, కోటగిరి ఇద్దరికీ పెద్ద షాక్. కోటగిరి చాలా పెద్ద నాయకుడు, అనేక మంత్రి పదవులు నిర్వహించారు. 1989-1994 మధ్య టీడీఎల్పీ ఉప నాయకుడు. 1989 ఎన్నికల్లో ఓటమి తరువాత ఎన్టీఆర్ శాసనసభకు చాలా తక్కువగా హాజరయ్యారు, టీడీఎల్పీ ఉప నాయకుడిగా కోటగిరి విద్యాధర రావ్ కీలకంగా వ్యవహరించారు. కోటగిరి కుమారుడు శ్రీధర్ 2019లో వైసీపీ తరుపున ఏలూరు ఎంపీగా గెలిచారు.
2009 ఎన్నికల తరువాత కూడా వట్టి వసంత్ అసెంబ్లీలో ప్రజారాజ్యం ఆఫీసులో ఎక్కువ సమయం గడిపేవారు. చిరంజీవి, వసంత్ కలిసి వస్తున్న ఫోటోలు మెయిన్ పేజీలో వచ్చేవి. కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనంలో కూడా వసంత్ దే కీలక పాత్ర. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన వట్టి వసంత్ కుమార్ 2014 ఎన్నికల్లో పోటీచేయలేదు, రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయారు.
2018లో పవన్ కళ్యాణ్ ను కలిసినప్పుడు కూడా జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ దాన్ని వసంత్ ఖండించారు, ఆ కుటంబంతో ఉన్న సాన్నిహిత్యం వల్లే పవన్ ను కలిశానని చెప్పారు. 2018 తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవటాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కు రాజీనామా చేసి అప్రకటిత రిటైర్మెంట్ తీసుకున్నారు.

వసంత్ వారసులు ఎవరూ రాజకీయాల్లో లేరు.. బహుశా వట్టి కుటుంబ రాజకీయం ముగిసినట్లే భావించాలి. మంత్రి హోదాలో పాల్గొన్న ఒక సభలో చింతమనేని అయన మీద దాడికి ప్రయత్నించారు .వసంత్ రాజకీయం వివాదరహితం, ఎలాంటి ఆరోపణలు లేవు. 1999-2004 మధ్య పనిచేసిన తరం అంటే నాకు ప్రత్యేక అభిమానం, శాసనసభలోను , కరెంట్ ఉద్యమం సమయంలో గ్రౌండ్లో వాళ్ళ పనితీరు చాలా బాగుండేది. అటు స్నేహాన్ని ఇటు రాజకీయాన్ని బ్యాలెన్స్ చేసుకొని వివాదరహితుడిగా బతికిన వట్టి వసంత్ ఈ ఉదయం మరణించారు… ఆయన మృతికి నివాళి…

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions