అవున్నిజమే… ఓ మిత్రుడు చెప్పినట్టు… జమునను సాదరంగా పంపించామా..? లేదు…! ఎందుకు లేదు..? ఎందుకంటే… ఆమెది ఎన్‌లైటెన్ కులం కాదు కాబట్టి… ఇండస్ట్రీని ఏలే కులం కాదు కాబట్టి… కొడుకులో కూతుళ్లో స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోలు కాదు కాబట్టి… వాళ్లు ఫీల్డ్‌లో ఉండి ఉంటే కథ వేరే ఉండేది… ఇండస్ట్రీ పెద్దలు, ముఖ్యులు ఆమె అంత్యక్రియలకు వచ్చేవాళ్లు, నివాళి అర్పించేవాళ్లు… ఆమె మరణించిందీ అనే వార్త చూసి ఆమె కులం ఏమిటీ అని గూగుల్‌లో సెర్చ్ చేశారు… ఆమెకు ఆ మూడు కులాలతో సంబంధం లేదు పాపం… ఆ తరువాత ఆమె చావును కూడా ఎవరూ పట్టించుకోలేదు…
ఫాఫం, పోరాడినన్ని రోజులు ఆ ఇండస్ట్రీ బురదలోనే పొర్లాడింది… అందరిలా పెద్ద తలలకు దాసోహం అనలేదు… ఆ తలలు ఆమెపై బ్యాన్ పెడితే ఎహెపో అని తలెగరేసింది… అంతేతప్ప ఎవరి కాళ్లనూ కన్నీళ్లతో కడిగి తలపై చల్లుకోలేదు… అసలు తలవంచితే కదా… రిటైరయ్యాక తన బతుకేదో తను బతికింది… ఇండస్ట్రీ రాజకీయాల్లో వేలు పెట్టలేదు… గతంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా సరే, ఆమె మళ్లీ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల జోలికి కూడా పోలేదు… అందుకేనా ఈ మర్యాద..?!
పోనీ, ఆమెకు ఏం తక్కువ..? గతంలో ఎవరెవరికో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు… తమ వ్యక్తిత్వాల విషయంలో గానీ, జనానికి ఉపయోగపడే విషయంలో గానీ… పైసాకు పనికిరాని కేరక్టర్లను కూడా తుపాకులు కాల్చి సాగనంపారు… మరి జమునకు ఏం తక్కువైంది..? ఆమె తరఫున ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేవాళ్లు లేకపోవడం వల్లా..? ఆమె బతుకును సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లా..?
Ads
ఆమె బతుకుతోంది తెలంగాణలోనే కదా… ఆమెకంటూ ఓ చరిత్ర ఉంది కదా తెలుగు ఇండస్ట్రీలో… మరెందుకు ఆమె కొరగాకుండా పోయింది ఈ ప్రభుత్వానికి..? ముఖ్యమంత్రి రావాలని, ఓ పుష్పగుచ్ఛం ఆమె శవం మీద ఉంచాలని కూడా ఆమె తరఫు వాళ్లు ఏమీ కోరుకోలేదు కదా… ఆమె సావిత్రి తదితరుల సమకాలీనురాలు… వాళ్లతో దీటుగా… కాదు, కాదు, వాళ్లకన్నా మంచి ఆత్మాభిమానంతో బతికింది… టాలీవుడ్ బురదలో అలా బతకడమే గొప్పదనం… దాన్నెందుకు గుర్తించలేదు ఈ ప్రభుత్వం..?
ఆమె తండ్రి మధ్వ బ్రాహ్మణుడు, తల్లి వైశ్య… కులాంతర వివాహం… అయితేనేం, ఆ రెండు కులాలూ ఆమెను ఓన్ చేసుకోలేదు… 198 సినిమాలు ఆమె ఖాతాలో… ఒకప్పుడు తెలుగు ప్రేక్షకుల దిల్‌కాదడ్‌ఖన్… తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టి 25 ఏళ్లుగా సేవాకార్యక్రమాలు చేస్తోంది… ఆమె గతంలో కాంగ్రెస్, తరువాత కొన్నాళ్లు బీజేపీ… ఐనా సరే, ఆ రెండు పార్టీలకూ అక్కరకు రాని మనిషైపోయింది ఆమె…
హిందీ, తమిళం, కన్నడం, తెలుగు సినిమాల్లో నటించిన జమున అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్… ఫాఫం, అంత్యక్రియల నాటికి ఎవరికీ పట్టకుండా ఆ తార రాలిపోయింది… ఒకరకంగా దక్కాల్సిన గౌరవం దక్కకుండానే అనామకంగా సాగిపోయింది… ఎవరో మిత్రురాలు అన్నట్టు… ఆమె మహిళ కదా, మగ స్టార్ అయితే కొంత గౌరవమర్యాదలు టాలీవుడ్ పెద్దల నుంచి దక్కేవేమో…!!
Share this Article