నాకు అప్పటికి ఎనిమిదేళ్లు… పెళ్లిళ్లలో నీళ్లు పంచేదాన్ని… వచ్చిన ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లి నీళ్ల గ్లాసు అందించాలి… రోజుకు 40 రూపాయలు సంపాదించేదాన్ని… ఓ పెళ్లి సందర్భంగా ఒకాయన పరిచయమయ్యాడు… ఒక సినిమా కోసం నాకు జూనియర్ ఆర్టిస్టులు కావాలి, వస్తారా అనడిగాడు… పెళ్లిళ్లలో రకరకాల పనులు చేసే టీం అంతా వోకే అన్నాం… అలా పరిచయం అయ్యాను నేను ఇండస్ట్రీకి…
డబ్బు బాగానే వస్తోంది… సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టును… పెళ్లిళ్లలో వర్క్ మాత్రం మానేయలేదు… అటూఇటూ షటిల్ సర్వీసు నాది… ఒకరోజు నేను ఓ టీవీ సీరియల్ కోసం సెట్‌లో ఉన్నాను… ఒక నటి ఏడవడం ప్రారంభించింది హఠాత్తుగా… ఒక సీన్ కోసం ఆమె ఓ కాలువ దాటాలి… నీరు చాలా లోతుగా ఉంది, ఆమె భయపడుతోంది… నాకేమో నవ్వొస్తోంది… ఆపుకోలేకపోయాను… ఓసోస్, ఇదెంత పని అన్నాను బయటికి… అసిస్టెంట్ డైరెక్టర్ ఒకాయన ఏదీ చేసి చూపించు అన్నాడు… అలవోకగా చేశాను… అందరూ ఆశ్చర్యపోయారు… నా జీవితం ఓ మలుపు తిరిగింది…
డూప్‌ను నేను… అంటే బాడీ డబుల్ అంటారు… హాయిగా జీవితం గడిచిపోతోంది… ఆర్టిస్టు కమ్ స్టంట్ వుమన్… రెండేళ్ల తరువాత నేను ఓ వ్యక్తిని ప్రేమించాను… అలా అనుకున్నాను… నా తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాను… చాలా ప్రేమకథల్లాగే ఇదీ… నేను వర్క్ చేయడం మానేశాను… సంవత్సరంలోపు నాకు పాప… నన్ను తను మోసం చేస్తున్నాడనే సంగతి అర్థమవుతోంది కొన్నాళ్లుగా… అయిదేళ్లలో మరో సంతానం… నా పొదుపు డబ్బంతా తీసుకుని, నన్ను నా పిల్లలను మా మానాన మమ్మల్ని విడిచిపెట్టి మాయమైపోెయాడు… ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అట… నా చేతులు కాలాక చెబుతున్నారు అందరూ…
Ads
చేతిలో పైసా డబ్బు లేదు… పిల్లలు చిన్నవాళ్లు… వాళ్ల ఆకలి తీర్చాలంటే నాకు పని కావాలి… మళ్లీ పనిలో అడుగుపెట్టాల్సి వచ్చింది… నా యాక్షన్ స్కిల్స్ నాకు పని చూపించాయి… యాక్షన్ అంటే నటన మాత్రమే కాదు, స్టంట్స్ కూడా… సాహసాలు, రిస్క్… నేను 2013లో మళ్లీ పనిలో చేరాను… అప్పటి నుండి 9 సంవత్సరాలు అయ్యింది… నేను ఒకసారి నిప్పంటించుకుని 15-అంతస్తుల భవనం నుండి దూకి, గోడకు విసిరివేయబడ్డాను…
అలాంటి రిస్కులు ఎన్నో… ఓ మంచి విషయం ఏమిటంటే… స్టంట్ పీపుల్‌కు ఇండస్ట్రీలో కాస్త గౌరవం లభిస్తుంది… నటీనటులు, టీం బాగా ఉంటారు మనతో… కోహినూర్, వజ్రం అంటూ ప్రశంసిస్తారు… అసలు మనం లేకుండా వాళ్ల సినిమాలు లేవు కదా… మనం స్టంట్స్ చేసినప్పుడల్లా ప్రధాన నటీనటులు మన దగ్గరకు వచ్చి అంతా వోకే కదా అనడుగుతారు… గాయపడిన ప్రతిసారీ మంచి వైద్యసాయం లభిస్తుంది కూడా…
కానీ ఎప్పుడో ఓసారి జీవితం బాగా దెబ్బకొడుతుందనే భయం ఉండనే ఉంటుంది… ఓసారి నిప్పు అంటించుకుని భవనం మీద నుంచి దూకినప్పుడు గాయపడ్డాను… తీవ్రంగా… 2 నెలలు హాస్పిటల్‌లోనే ఉన్నాను… బెడ్ రెస్ట్… మరొకసారి పక్కటెముకలు విరిగిపోయాయి… భయపెడుతున్నాయి ఇవన్నీ… ఇంకా గాయపడి, అసలు పనే చేయలేని స్థితి వస్తే ఎలా..? నా పిల్లల చదువు.., నా పిల్లల తిండి మాటేమిటి..? ఆ ప్రశ్న మరింత బాగా భయపెడుతూ ఉంటుంది…
అందుకని స్టంట్స్ చేస్తూనే ఉంటాను… నా పిల్లలిప్పుడు యుక్త వయస్సులో ఉన్నారు… వాళ్లే కొన్నిసార్లు భయంతో ‘‘అమ్మీ అప్నా ఖాయల్ రఖో’ అని చెబుతారు… కానీ మెరుగైన జీవితాన్ని గడపడానికి నేను ఏదైనా చేస్తాననీ, ఎవరి మాటా వినననీ నాకు తెలుసు. వాళ్లకూ తెలుసు… ఒంట్లో సత్తువ ఉన్నంతకాలమే ఈ పని… తరువాత..? అందుకే పిల్లల చదువులు త్వరగా పూర్తయిపోతే బాగుండు… అప్పటివరకూ ఈ స్టంట్స్ చేస్తూనే ఉంటాను… తప్పదు కదా…!! ఈ నిప్పులు, గాయాలు, దూకుళ్లు, వైద్యాలు… వస్తే రానీ… వస్తే రానీ…!!
Share this Article