సూర్యకాంతం… ఈ మాట వినగానే తెలుగువాడు మొహం చిట్లిస్తాడు… తిట్టిపోస్తాడు… ఎవరూ ఆ పేరును పిల్లలకు పెట్టుకోరు… సగటు లేడీ విలన్‌కు ప్రతీక… ప్రతి సినిమాలోనూ ఆమెకు అలాంటి పాత్రలే చేసీ చేసీ ఆమె ఓ క్రూరురాలు అయిపోయింది… కోడళ్లను రాసిరంపాన పెట్టే ధూర్త అత్తగారు అయిపోయింది… ఆ పాత్రల్నీ ఇరగ్గొట్టి ఆమె అఖండమైన పేరు సంపాదించుకుంది, అది వేరే కథ…
సేమ్, రామాయణం అనగానే రావణుడికన్నా జనం అందరూ తిట్టిపోసేది కైకేయిని… సీతమ్మ కష్టాలు చూస్తూ, చదువుతూ, వింటూ కైకేయిని తమకు వచ్చిన తిట్లన్నీ తిట్టేస్తారు… ఒకరిద్దరి స్టోరీ రీటెల్లింగ్ పుస్తకాలు చదివితే ఆమె అసలు కేరక్టర్ అర్థమవుతుంది… నిజానికి కైకేయి గొప్ప అందగత్తె, మంచి ప్రేమమయి… సమర్థులైన యోధురాలు… సాహసి… అయోధ్య పాలన, రాజనిర్ణయాలపైనా ఆమెకు పట్టు… అందుకే దశరథుడికి ఆమె అంటే అంత పిచ్చి… ఆమెకు తన కొడుకు భరతుడే కాదు, నిజానికి నలుగురూ తన కొడుకులే…
మరి ఆమె రాముడిని వనవాసం ఎందుకు పంపించింది..? భరతుడికి పట్టాభిషేకం కావాలని ఎందుకు అభిలషించింది…? అవి కథాకథనంలో విలనీ అనే నిరూపిస్తాయి కదా… మరీ అంత క్రూరురాలు అయితే రాముడిని హతమార్చే కుట్రలు పన్నేది కదా, కేవలం బయటికి ఎందుకు పంపించింది..? ఎందుకంటే… ఒకసారి భరతుడు కుర్చీ ఎక్కితే సరి, ఆ 14 ఏళ్లలో రాముడు, సీత వనవాసంలో ఏమవుతారనేది తనకు అనవసరం… తిరిగి వచ్చినా రాముడికి జనాభిమానం, సామంతుల మద్దతు ఉండవని ఆమె అంచనా… పైగా అప్పటి ఆనవాయితీలు, అయోధ్య చట్టాల ప్రకారం 14 ఏళ్లపాటు ఎవరైతే ఏ ఆస్తిపైన అధికారాన్ని అనుభవిస్తారో ఇక వారికే యాజమాన్య హక్కు దఖలు పడుతుంది.., అదీ ఆమె ఆ గడువు పెట్టడానికి కారణం…
Ads
మళ్లీ అయోధ్యకు వచ్చాక సీత ఒకవేళ పిల్లల్ని కంటే… తన మనమలు వారసులు గాకుండా పోతారు, అందుకని సీత అయోధ్యలోనే ఉంటే కైకేయి ఏమైనా చేసే ప్రమాదముంది… అందుకే రాముడు తనతోపాటు తీసుకువెళ్తాడు… ఈ ప్రమాదం ఊర్మిళకు లేదు కాబట్టి ఆమెను అయోధ్యలోనే ఉంచేస్తారు… లక్ష్మణసంతానానికి వారసత్వ అర్హతలు ఉండవు కదా ఎలాగూ… నిజానికి కైకేయి అంత ప్రేమమయి అయితే రాముడి మీద ఇంత కక్షను ఎందుకు ప్రదర్శించింది… అది కక్ష కాదు, ఆమె గతానుభవాలతో ఆమెలో నెలకొన్న ఓ భద్రతారాహిత్యపు భయం… ఓహ్, అదేమిటి..?
కైకేయి కేకయ రాజ్యానికి చెందినది… తండ్రి పేరు అశ్వపతి… మన్నిక కలిగిన యుద్దాశ్వాలకు ఆ రాజ్యం పెట్టింది పేరు… కైకేయి ఒక్కతే కూతురు… ఏడుగురు కొడుకులు… అశ్వపతికి ఓ నైపుణ్యం, వరం ఉండేది… పక్షుల భాష తెలుసు తనకు… కానీ తను ఏ పక్షి మాటలు విన్నా సరే, అవి పరులకు చెప్పకూడదు, చెబితే చచ్చిపోతాడు… ఈ విషయం తన భార్యకు కూడా తెలుసు…
ఓసారి ఉద్యానవనంలో విహరిస్తుంటే ఓ జంటహంసల సంభాషణ వింటాడు, బయటికి నవ్వేస్తాడు… కైకేయి తల్లి అశ్వపతి తనను చూసే నవ్వాడని అలుగుతుంది… అసలు విషయం చెబితే నమ్మదు, ఆ జంటహంసల సంభాషణ ఏమిటో చెప్పి తీరాల్సిందేనని పట్టుబడుతుంది… అశ్వపతికి వైరాగ్యం ఆవరిస్తుంది… తన ప్రాణాలు పోయినా సరే, తుచ్ఛమైన ఒక సంభాషణ వినడానికి పట్టుబడుతున్న ఆమె గుణం తనకు చిరాకు పుట్టిస్తుంది… ఆమెను దేశం నుంచి బహిష్కరిస్తాడు… పుట్టింటికి తరిమేస్తాడు…
రాజ్యమేమో బలహీనం… ఆర్యావర్తంలో తన పట్టు పెంచుకోవడానికి, ఓ రాజవ్యూహంలో భాగంగా దశరథుడు కైకేయిని తనకిచ్చి పెళ్లి చేయాల్సిందిగా అశ్వపతిని కోరతాడు… అప్పటికే కైకేయి అందం, సాహసం, గుణాలు విని ఆమె పట్ల మోహాన్ని పెంచుకుంటాడు… దశరథుడి కోరిక కాదంటే రాజ్యాన్ని కోల్పోవాలి… ఏ రాజు కూడా కుర్చీని కోల్పోవడాన్ని కోరుకోడు కదా… అశ్వపతి తప్పనిసరై ఆమెను దశరథుడికిచ్చి పెళ్లిచేస్తాడు… ఒకవేళ రాముడు రాజయితే, భరతుడి పరిస్థితేమిటి..? రాముడికి ఏ విషయంలో ఏ కోపం వచ్చినా సరే తమ భవిష్యత్తు ఏమిటి..? ఈ భయం ఆమెను వెన్నాడుతూ ఉంటుంది… ఆమె తల్లి వేదన, తండ్రి విధించిన శిక్ష, తల్లి పరిస్థితి ఆమెను అలా మారుస్తాయి…
అందుకే రాజ్యాధికారం తన చేతుల్లో ఉండాలని కోరుకుంది… కానీ ఆమె పట్టమహిషి కాదు… అందుకని భరతుడికి పట్టాభిషేకం కావాలని కోరుకుంది… అంతేతప్ప రాముడిని అంతం చేయాలని అనుకోలేదు… అప్పటి చట్టాల ప్రకారం భరతుడికి అధికారం శాశ్వతం కావాలంటే రాముడిని 14 ఏళ్లు కుర్చీకి దూరంగా ఉంచితే చాలు… అంతే ఆలోచించింది ఆమె… కానీ భరతుడు అధికారాన్ని రాముడి పేరిటే ఉంచి, రాజభోగాలను సైతం త్యజించడంతో ఆమెకు రోజూ శోెకమే మిగిలింది… అది ఆమె తలరాత… రామాయణ ప్రస్థానానికి ఆ పాత్ర ఒక పావు… అంతే…!!
Share this Article