మొన్న ఎవరో కామెంట్ చేశారు… టాలీవుడ్ పెద్దలు, అందులోనూ తెలుగు సినిమాకు గౌరవాన్ని, ఖ్యాతిని తెచ్చిపెట్టిన వాళ్లు ఒక్కొక్కరే ఏదో పని ఉందన్నట్టుగా ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నారు… రోజులు బాగా లేవు… జాగ్రత్తగా ఉండాలి సుమా అని..! ఇప్పుడు మరో శిఖరం నేలకూలింది… శిఖరం అని చెప్పడానికి సందేహించడం లేదు… అశ్లీలం, అసభ్యత ఏమీ లేకుండా, కళాత్మకంగా తెలుగు సినిమాల్ని రూపొందించి, తెలుగు సినిమాకు గౌరవాన్ని సంపాదించి పెట్టిన ఆ దర్శక శిఖరం కె.విశ్వనాథ్ కూడా కన్నుమూశాడు… కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన అపోలోలో చికిత్స పొందుతూ మరణించాడు…
వయస్సు 92 సంవత్సరాలు… ఈయన పూర్తిపేరు కాశీనాథుని విశ్వనాథ్… తెనాలిలో పుట్టిన ఈయన మొదట్లో సౌండ్ రికార్డిస్టు… రచయిత, నటుడు, దర్శకుడయ్యాడు తరువాత… ఎక్కడా తెలుగు సినిమా బాపతు వాసనగొట్టే అవలక్షణాలకు తన సినిమాల్లో చాన్స్ ఇవ్వలేదు… అలాగని తను తీసినవి సమాంతర సినిమాలు, అవార్డు సినిమాలు కాదు… సూపర్, బంపర్ హిట్లు… మంచి సినిమాలకు ఇప్పుడు రోజులు బాగాలేవని గ్రహించి, ఆ ప్రయాసను తట్టుకోలేననే భావనతో చాన్నాళ్ల క్రితమే దర్శకత్వం మానేశాడు… కొన్నాళ్లు పూర్తిగా నటనకే అంకితమయ్యాడు…
Ads
దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని, రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని, పద్మశ్రీని అందుకున్న ఆయన్ని నిజానికి బిరుదులు, పురస్కారాలు కొలవలేవు… ఒక స్టూడియోలో ఒక మామూలు సౌండ్ రికార్డిస్టుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టిన ఆయన దర్శకుడు ఆదుర్తి వద్ద కొన్నాళ్లు అసిస్టెంటుగా, తరువాత సహాయ దర్శకుడిగా పనిచేశాడు… అక్కినేని నాయకుడిగా ఆత్మగౌరవం సినిమాకు తన తొలి సినిమా దర్శకత్వం… దీనికి నంది బహుమతి… తరువాత తీసిన సిరిసిరిమువ్వ సినిమా విశ్వనాథ్‌ను ఎన్నో మెట్లు ఎక్కించింది… ఇక ఆ తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు…
అలాగని ఎక్కడా రాజీపడలేదు… తన సినిమాల్లో ఎమోషన్స్‌కు, సంగీతానికి, సాహిత్యానికి, నాట్యానికి, ప్రత్యేకించి సంప్రదాయ జీవనానికి పెద్దపీట వేసేవాడు… తను 60 సినిమాలు తీస్తే, వాటిల్లో శంకరాభరణం ఓ మరుపురాని క్లాసిక్… దీనికి జాతీయ పురస్కారం కూడా లభించింది… ఇదేకాదు, తన అన్ని సినిమాల్లోనూ సంగీతం, సాహిత్యం ఒకదాంతో ఒకటి పోటీపడేవి… స్వర్ణకమలం, స్వాతికిరణం, సాగరసంగమం, స్వయంకృషి, సప్తపది, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం, సిరివెన్నెల, శృతిలయలు వంటి సినిమాలు మళ్లీ తెలుగులో వస్తాయా..? రావు… విశ్వనాథ్ వంటి దర్శకుడు మళ్లీ పుడతాడా..? పుట్టడు… విశ్వనాథ్‌ను కన్న టాలీవుడ్ ధన్యమైంది… ఇలా రాస్తుంటే ఒడవదు… ఎంత రాసినా ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది… వీడ్కోలు మహత్ దర్శకా…
Share this Article