మురిపెంతో కట్టించుకున్న కొత్త సచివాలయం ప్రారంభానికి ముందే… తన జన్మదినాన అందులోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నవేళ… గ్రాండ్ మాన్యుమెంట్‌గా నిలిచిపోవాలని భావిస్తున్న వేళ… అకస్మాత్తుగా అగ్నిప్రమాదం..! అపశకునం… ఇదొక దురదృష్ట సంకేతం… కేసీయార్‌కు రాబోయే రోజులు చిక్కులే… ఇన్నాళ్లు వేరు, ఇక వేరు… తన జాతకరీత్యా కూడా మంచిరోజులు ముగిశాయి……. ఇలాంటి ప్రచారం ఒకటి సాగుతోంది…
కేసీయార్‌ను కార్నర్ చేయబోతున్న కేంద్రం, క్షేత్రంలో వ్యతిరేకత, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఈడీ చార్జిషీటులో కూతురు కవిత పేరు, అప్పుల ఊబిలో రాష్ట్రం, అడుగు కదలని జాతీయ రాజకీయాలు… ఇవన్నీ రాబోయే దుర్దినాల సంకేతాలే అని కొందరు తేల్చేస్తున్నారు… ప్రత్యేకించి సచివాలయం కథ ఓ విషాదం… వాస్తు బాగోలేదని, ఫైర్ సేఫ్టీ బాగా లేదని సచివాలయ భవనాలు మొత్తం కూల్చేశారు… అప్పటికప్పుడు సచివాలయన్నా అనేక భవనాల్లో సర్దారు, ఏ భవనమూ దిక్కులేకపోతే బీఆర్కేఆర్ భవనంలో అడ్జస్ట్ చేశారు…
కొత్తగా కట్టిన భవనాలను కూడా కూల్చేశారు… ఏ ఫైర్ సేఫ్టీ, ఏ వాస్తుదోషాన్ని సాకులుగా చూపారో.., మళ్లీ ప్రారంభానికి ముందే కొత్త సచివాలయంలో అవే ప్రత్యక్షం… మరెందుకు కూల్చివేతలు, ఈ కొత్త భారీ నిర్మాణాలు..? ఎందుకిలా వందల కోట్ల ప్రజాధనవ్యయం..? ఇదీ ప్రచార సారాంశం… ఇదే కాదు… కేసీయార్ ఏ భారీ ప్రాజెక్టు కట్టినా ఇదే తంతు… విస్మయకర పరిణామాలు…
Ads
కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పూర్తే కాలేదు… అసలు ఆ ప్రాజెక్టు లాభదాయకతే ప్రశ్నార్థకంగా ఉండగా, ఇంకా మూడో టీఎంసీ పేరిట నిధుల కేటాయింపులు… వీలయితే నాలుగో టీఎంసీ అని కూడా చేరుస్తారు… ప్రశ్నించే వ్యవస్థలు లేవు కదా… తీరా భారీ వర్షాలకు ఏకంగా ప్రాజెక్టు పంపు హౌజులు మునిగిపోయి కోట్ల నష్టం… ప్రాజెక్టు నాణ్యతపై సందేహాల ముసురు… అదీ అపశకుమనమే…
యాదాద్రిని వందల కోట్లతో కట్టారు… అపురూపం, అబ్బురం… పేద భక్తుడికి దూరమైపోయిన నరసింహుడు ఇప్పుడు పెద్దల దేవుడు… ఆ పనుల నాణ్యతపైనా బోలెడు విమర్శలు… ప్రారంభానికి ముందే ఈ గుడి పునర్నిర్మాణానికి బీజకర్త చినజియ్యరుడు సైతం కేసీయార్ కనుసన్నల నుంచి, యాదాద్రి పర్యవేక్షణల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది… తీరా ఓ భారీ వర్షం కురిస్తే నీళ్లు, కుంగిపోయిన రోడ్లు… అనేకసార్లు ముఖ్యమంత్రే స్వయంగా వెళ్లి పర్యవేక్షిస్తే ఇదీ దుస్థితి… అపశకునం…
అయితే… ఈ అపశకున ప్రభావం నిజంగానే ఉండబోతోందా..? కేసీయార్ మహర్జాతక కాలం అయిపోయినట్టేనా..? ఇక గడ్డురోజులోనా..? నిజానికి గ్రహస్థితి బాగున్నన్ని రోజులు ఈ అపశకునాలూ చెల్లవు… కొట్టుకుపోతాయి… కేసీయార్ మహర్దశ ఎనిమిదేళ్లుగా బాగుంది… పార్టీని నడపలేను, కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తాను అన్న రోజుల నుంచి… ఎనిమిదేళ్లుగా రాష్ట్రాన్నే పాలించే తన సుదినాల దాకా… తనను ఏ అపశకునమూ ఏ నష్టాన్నీ కలిగించలేదు…
జాగ్రత్తగా పరిశీలిస్తే… ఈ అపశకునాలు, జాతక సూచికలు అబ్సర్డ్ అనిపిస్తుంది… పెద్ద ఉదాహరణ, అయుత చండీయాగం సమయంలో హోమప్రాంగణం తాటాకుల పైకప్పు హఠాత్తుగా మంటలు అంటుకోవడం… భారీగా మంటలు… ఆ మంటలు, ఆ పొగలు చూసిన రాష్ట్రపతి హెలికాప్టర్ అట్నుంచి అటే, గాలిలోనే వాపస్… అయ్యో అయ్యో అని మౌనంగా కొందరు పండితులు పైకి వినబడకుండా గుండెలు బాదుకున్నారు… అయిపోయింది, కేసీయార్ పని అయిపోయింది, ఇదే ప్రబలమైన సూచిక, అమ్మవారే పరోక్షంగా చెబుతున్నారు అని ప్రచారం…
ఏమీ కాలేదు, ఇన్నేళ్లయింది, ఏమైంది..? కేసీయార్‌కు అప్పట్నుంచీ వచ్చిన ఇక్కట్లేమీ లేవు… అన్నీ సంపాదించుకున్నాడు… ఏ అడ్డంకీ లేదు… చివరకు పొరుగు రాష్ట్రాల ఎన్నికలకు కూడా డబ్బు సమకూర్చే సాధనసంపత్తి వచ్చి సమకూరింది… కాకపోతే సాకులతో ఆ అపశకునాల ప్రచారం ఖండించడమే కాస్త చికాకు… అయుత చండీయాగ తాత్కాలిక మంటపాన్ని అమ్మవారే కాల్చేసుకుందని ఓ పిచ్చి సమర్థన… ఎలాగూ యాగస్థలి పైకప్పును కాల్చేస్తారనీ, ఆ పని అమ్మవారే చేసుకుందని చెప్పారు… అలాగే సచివాలయ అగ్నిప్రమాదం ఒక మాక్ డ్రిల్ అని జనం చెవుల్లో పువ్వు పెట్టబోయారు… పంపుహౌజులు మునిగిపోవడం సహజమే అని ఇంజినీర్లతో, సలహాదార్లతో చెప్పించారు… యాదాద్రిపై మాత్రం నిశ్శబ్దం… సో, సచివాలయ అగ్నిప్రమాదం అపశకునమేమీ కాదు… గడ్డురోజుల సూచికా కాదు… అపసవ్యపు అడ్డదిడ్డం నిర్ణయానికి, నిర్మాణానికి సూచిక..!!
Share this Article