ప్చ్… పవన్ కల్యాణ్ మారడు… హిపోక్రటిక్ వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు… జనం ఎడ్డోళ్లు, ఏం చెప్పినా నమ్ముతారు అనే భావన ఎందుకు, ఎలా బలంగా మనసులో నాటుకున్నదో గానీ… ఒక్కసారైనా ఫెయిర్‌గా, స్ట్రెయిట్‌గా మాట్లాడటం లేదు… పైగా బాలకృష్ణ… అసలే బ్లడ్డు అండ్ బ్రీడు బాపతు… నెత్తుటిలో అదే అహం… కాకపోతే మనసులో ఉన్న కోపమైనా, ప్రేమైనా బయటికి రావల్సిందే… పవన్ కల్యాణ్, బాలకృష్ణ ఈ విషయాల్లో క్వయిట్ కంట్రాస్టు…
పొలిటికల్ వేదికగా మార్చేయబడిన ఆహా అన్‌స్టాపబుల్‌లో పవన్ కల్యాణ్, బాలకృష్ణ ఉద్దేశపూర్వక చాటింగ్ మొదటి పార్ట్ ఎట్టకేలకు ప్రసారం చేయబడుతోంది… అసలే తెలుగుదేశం క్యాంపులో కీలకవ్యక్తి ఒకరు, తెలుగుదేశం అల్లుడిలా చూసుకునే కేరక్టర్ మరొకరు… కలిసి పోటీచేస్తారని కూడా ఊహాగానాలు… చంద్రబాబు గుప్పిట్లో మనిషని విమర్శలు… మరిక ఈనాడు ఊరుకుంటుందా..? డప్పు స్టార్ట్ చేసింది…
ఒక టీవీ లేదా ఒక ఓటీటీల్లోని ఒక కార్యక్రమం కంటెంటు గురించి ఈనాడులో నాలుగు కాలాల వార్త అసాధారణం… మరి కావల్సినవాళ్లు కదా, అందంతే… ఈనాడులోని ప్రతి వార్త వెనుక ఓ ‘‘ఉద్దేశం’’ ఉంటుంది… అండర్ ప్లే చేయాలన్నా, ప్రయారిటీ ఇవ్వాలన్నా కొన్ని లెక్కలుంటాయి… సరే, పవన్ కల్యాణ్ తాజా ప్రవచనాల విషయానికి వస్తే… తనకు ఫాఫం, అసలు పెళ్లే చేసుకోవాలని లేదట…
Ads
బ్రహ్మచారిగా ఉంటూ, యోగ మార్గాన్ని అనుసరించాలని అనుకున్నాడట… రచయిత కావాలని, డైరెక్టర్ అవ్వాలని కూడా అనుకున్నాడట… కనీసం కంప్యూటర్ గ్రాఫిక్స్ చదవాలని అనుకున్నాడట… రామ్ మనోహర్ లోహియా, అంబేద్కర్, పూలే, తరిమెళ్ల నాగిరెడ్డి పుస్తకాలు బాగా చదివాడట… ఏదేదో చెబుతూ పోయాడు… ఈ షో ఫస్ట్ పార్ట్ చూశాక అనిపించింది… సినిమావాళ్లు జీవితాన్ని, రాజకీయాలను కూడా సినిమాలాగే చూస్తారని…
ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ అనాలోచితంగా ఓ తిక్క విమర్శ చేశాడు… అది జగన్‌ను పరుషంగా నిందిస్తున్నట్టుగా ఉంది… నిజమే, ఏపీ పాలిటిక్స్ అంటేనే బూతులు, అసభ్య వ్యాఖ్యలు, అశ్లీల విమర్శలు… కానీ మరీ ఈ తిట్లను జగన్ దాకా తీసుకెళ్లాడా బాలకృష్ణ… తనేమంటున్నాడు..? పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు అంటూ ఆయన్ని విమర్శించేవారు ఊరకుక్కలతో సమానం అంటున్నాడు… కానీ ఇకపై విమర్శించేవారు అని ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు… అంటే ఇంతకుముందు అలా విమర్శించాడు సరేగానీ, ఇకపై విమర్శిస్తే మాత్రం అందరితోపాటు జగన్ ఊరకుక్క అవుతాడని అర్థం చేసుకోవాలా..? బాలకృష్ణ స్థాయి విమర్శేనా ఇది..? నోటిపై కంట్రోల్ లేకపోతే ఎలా బాలయ్యా..?
పెళ్లిళ్లపై పవన్ కల్యాణ్ జవాబు కూడా అసంబద్ధంగా, అర్థం లేనిదిగా ఉంది… పెళ్లిళ్లు వ్యామోహంతో చేసుకోలేదు, ఇంట్లో వాళ్లు చూశారని తొలిసారి చేసుకున్నాను, కొన్ని కుదరలేదు, రెండోసారి పెళ్లి తరువాత భిన్నాభిప్రాయాలు, నన్ను విమర్శించేవాళ్ల వ్యక్తిగత జీవితాలు నాకు తెలియవా..? నాకున్న సంస్కారం, విజ్ఞత అవతలివారికి లేకపోవడంతో నన్ను ఏదో విమర్శిస్తారు, నేను అలా అనలేను….. అంటే, జగన్‌కు సంస్కారం, విజ్ఞత లేదని చెబుతున్నాడా పవన్ కల్యాణ్..? మూడు పెళ్లిళ్లపై నాకేమీ గిల్ట్ లేదు అని చెబుతున్నప్పుడు ఇక దానిపై జవాబు చెప్పకుండా ఉండాల్సింది, లేదా అది నా వ్యక్తిగత జీవితం, రాజకీయాలకు ఏం సంబంధం అని ప్రశ్నించి ఉంటే సరిపోయేది… ఏమో… బాలయ్యకు పవన్ కల్యాణ్ భలే శృతి కలిసింది…!!
Share this Article