రుమ… ఈ పేరు విన్నారా..? రామాయణంలోని ఓ కీలకపాత్ర… కానీ ఇతర పాత్రలపై జరిగినంతగా ఈమె పాత్ర మీద చర్చ జరగదు… నిజానికి ఆమె చేసేది ఏమీ ఉండదు… కానీ ఆమె కారణంగా కొన్ని పరిణామాలుంటాయి… అసలు ఆమెను మనిషిగానే గుర్తించదు ఆమె కథ… నిజమే, మనిషి ఎలాగూ కాదు… వానర మహిళ ఆమె… కిష్కింధ వానరసమూహంలో అందగత్తె… ఆమె అంటే సుగ్రీవుడికి ప్రేమ…
సుగ్రీవుడి మీద ఆమెకూ ప్రేమ… సుగ్రీవుడి అన్న వాలికీ ఆమె మీద ప్రేమ ఉంది, అప్పటికే రుమ అక్క తారతో వాలికి పెళ్లయింది… ఇద్దరూ అందగత్తెలే… వాలి ఆసక్తిని గమనించిన తార తండ్రి సుషేనుడు రుమను కూడా వాలికే ఇచ్చి, ఇద్దరు బిడ్డలనూ కిష్కింధ రాణులుగా చూడాలని అనుకుంటాడు… సుగ్రీవుడికి రుమను ఇచ్చి పెళ్లిచేయడానికి విముఖుడు…
దీంతో తమ ప్రేమను సార్థకం చేసుకోవడానికి హనుమంతుడి సహకారంతో సుగ్రీవుడు రుమను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు… ఆ తరువాత కొన్నాళ్లు ఇక వాలి సైలెంటు… రుమ తండ్రీ సైలెంటు… తరువాత కథలో సుగ్రీవుడు, వాలి ఓ రాక్షసుడిని వెంటాడుతూ ఓ గుహ దగ్గరకు చేరుకుంటారు… ఆ రాక్షసుడు గుహలోకి వెళ్లి దాక్కుంటాడు… అందులోకి వెళ్తూ వారి సుగ్రీవుడికి చెబుతాడు… ఒకవేళ ఫలానా టైమ్‌కు నేను గుహ నుంచి బయటికి రాకపోతే ఇక నేను సదరు రాక్షసుడి చేతిలో మరణించినట్టే, అప్పుడు నువ్వు వెళ్లిపో అంటాడు… గుహలోకి ప్రవేశిస్తాడు…
Ads
అందులో దీర్ఘకాలం యుద్ధం జరుగుతుంది… ఈలోపు వాలి పెట్టిన గడువు పూర్తయి, ఇక సుగ్రీవుడు తన అన్న మరణించాడనే అనుకుని, వెనక్కి వెళ్లిపోతాడు… వాలి లేడు కాబట్టి తనే రాజు అవుతాడు… అన్నలు చనిపోతే, వాళ్ల భార్యలు మరుదులను పెళ్లి చేసుకోవడం ఆ సమూహంలో పరిపాటే… కాబట్టి వాలి భార్య తారను కూడా సుగ్రీవుడే చేపడతాడు… గుహలో రాక్షసుడిని హతమార్చి విజయగర్వంతో బయటికి వచ్చిన వాలి సుగ్రీవుడి అధికారాన్ని చూసి రగిలిపోతాడు… తన భార్య తార, తాను కావాలని కోరుకున్న రుమలతో సుగ్రీవుడు ఆనందంగా ఉన్న తీరు వాలిలో కోపాన్ని పెంచుతుంది… సుగ్రీవుడి వివరణ కూడా వినకుండానే తన్ని తరిమేస్తాడు…
అంతేకాదు, సుగ్రీవుడి భార్య రుమను కూడా తనతోనే ఉంచేసుకుంటాడు… అది సుగ్రీవుడిలో కోపాన్ని పెంచుతుంది… కానీ వాలిని జయించలేడు… ఏం చేయాలో అర్థం కాదు… వాలి ఓ శాపవశాత్తూ మాతంగ పర్వతం మీదకు రాడు… అదుగో ఆ పర్వతం మీద సుగ్రీవుడు, తోడుగా హనుమంతుడు తలదాచుకుంటారు… తరువాత సీతాన్వేషణలో వెళ్తున్న రాముడు ఆ ప్రాంతాలకు రావడం, హనుమంతుడు రామ సుగ్రీవుల మధ్య మైత్రి పొసిగేలా మధ్యవర్తిత్వం వహించడం, వాలి వధకు రాముడు సమ్మతించడం, సీతాన్వేషణకు సహకరించడానికి సుగ్రీవుడు సమ్మతించడం చకచకా జరిగిపోతాయి…
వాలి, సుగ్రీవులు ద్వంద్వ యుద్ధంలో ఉన్నప్పుడు రాముడు చెట్ల చాటు నుంచి బాణాలు వేసి వాలిని వధిస్తాడు… రాజ్యంతోపాటు కోల్పోయిన రుమ కూడా సుగ్రీవుడి పాలవుతుంది… కొడుకు అంగదుడితో సహా వాలి భార్య తార కూడా… అంగదుడిని యువరాజుగా కూడా ప్రకటిస్తాడు… ఈ కథలో ఎక్కడా తార, రుమల ఇష్టాలతో పనిలేదు… కేవలం ప్రాణమున్న భౌతిక వస్తువులుగా పరిగణిస్తారు వాలి గానీ, సుగ్రీవుడు గానీ… ప్రత్యేకించి రుమ… ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా, తమ్ముడి మీద కోపంతో ఆమెను బలాత్కారంగా తను ఉంచేసుకుంటాడు… అదే కిష్కింధ కథలో కీలకం… ఆ కిష్కింధ లేకపోతే సీతాన్వేషణే కథలో లేదు కదా… ఇలా రుమ పాత్ర రామాయణంలో కీలకమే… కానీ కథాపారాయణంలో ఎప్పుడూ ఆమె పేరు చెప్పుకోబడదు…!!
Share this Article