హైదరాబాదులో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేసీయార్ సర్కారు చెప్పేదొకటి, చేసేదొకటి… 18 ఏళ్ల పోరాటం, ప్రభుత్వం చెప్పిన ధరకు కొనుగోలు… సుప్రీం నుంచి స్పష్టత… ఐనా సరే, ఈ సర్కారు కదలదు… ఈ సొసైటీతో సంబంధం లేనివి ఇరికించి, అదో చిక్కు సమస్యగా చూపే ప్రయత్నం… ఇప్పట్లో కేసీయార్ ఆ ఇంటిస్థలాల సంగతి తేల్చే సూచనలు లేవు… అసలు కృతజ్ఞతలు చెప్పడానికి సైతం సొసైటీ ముఖ్యులకు టైం ఇవ్వడం లేదంటే తన ఉద్దేశం ఏమిటో అర్థమవుతూనే ఉంది… ఊదు కాలొద్దు, పీరు లేవొద్దు…
ఇన్నేళ్ల పోరాటం కేసీయార్ కారణంగా నిరర్థకం అవుతున్నదనే బాధ అందరిలోనూ ఉంది… సొసైటీది దిక్కుతోచని స్థితి… సుప్రీంలో కేసు గెలవడానికి తనే సహకరించి, ఇప్పుడు తనే ఆ స్థలాలకు అడ్డుగా పడుకున్నాడు కేసీయార్… ఇదే అందరిలోనూ భావన… ఆంధ్రాలో రాజకీయాలు కావాలి బీఆర్ఎస్‌కు, ఆంధ్రాలో సీట్లు కావాలి… తెలంగాణలో సెటిలర్స్ వోట్లు కావాలి… దేశమంతా విస్తరించాలి… కానీ హైదరాబాద్ జర్నలిస్టుల్లో మాత్రం ఆంధ్ర, తెలంగాణ తేడాను చూడాలి… ఇదేం ధోరణి పాలకా..? తమరే కదా, తెలంగాణలో పొట్టకూటి కోసం వచ్చినవాళ్లంతా మావాళ్లే అని చెప్పింది… మరి ఇప్పుడేం జరుగుతోంది..?
జర్నలిస్టు సర్కిళ్లలో వాదోపవాదాలు… అసలు ఈ సొసైటీ వ్యవహారాలకు, ఇతర జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ముడిపెట్టడం దేనికి..? కేసీయార్ మనసును కలుషితం చేసినవారెవరో గానీ, కేసీయార్ సమర్థనీయం గాని ఓ మంకుపట్టులో ఉండిపోయాడు… ఈ సొసైటీలో తనకు ఇష్టులైన జర్నలిస్టులు కూడా ఉన్నారు… పోనీ, వాళ్లను అడిగి ఓ పరిష్కార ఆదేశం జారీ చేయవచ్చుకదా… అదీ చేయడు… సుప్రీం తీర్పు వచ్చి నెలలు గడిచిపోతున్నాయి… ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్టు జకీర్ సోషల్ మీడియాలో రాసిన ఓ కథనం ఇది… యథాతథంగా…
Ads
తెలంగాణకు ముందు – తెలంగాణ తర్వాత !
మిత్రులారా !
> దాదాపు 15 సంవత్సరాలుగా ఇంటి స్థలం కోసం నిరీక్షిస్తున్న జర్నలిస్టుల పట్ల సానుభూతి చూపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.
> జవహర్ లాల్ నెహ్రూ హౌజింగ్ సొసైటీలో సభ్యులు కాని మిత్ర జర్నలిస్టుల అంశాన్ని సొసైటీతో ముడిపెట్టడం సమంజసం కాదు.
> సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఆరు నెలలు గడచిపోయాయి. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిజాంపేట్, పేట్ బషీరాబాద్ భూములను JNJHS స్వాధీనపరచే ప్రక్రియను వేగవంతం చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు అమలుకు గాను ఇంతకాలం ఎందుకు జాప్యం జరుగుతోందో ప్రభుత్వానికే తెలియాలి.
> JNJHS వెలుపల ఉన్న మిత్ర జర్నలిస్టులకు ఇండ్ల స్థలం కేటాయింపు వ్యవహారాన్ని సొసైటీ కానీ,సొసైటీలోని ఏ ఒక్క సభ్యుడు కానీ వ్యతిరేకించడం లేదు. మాకు ఎవరికీ ఏ అభ్యంతరమూ లేదు. పైగా వారందరి పట్ల మాకు సానుభూతి ఉన్నది. వారికి మద్దతూ ఉంటుంది.
> సొసైటీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కానీ, సొసైటీ పట్ల అసూయ ఉన్న వాళ్ళు కానీ, అర్హులైన జర్నలిస్టులంతా తక్షణం ఒక కొత్త హౌజింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవాలి.
> సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన ఆరు నెలలకు కూడా ఇలాంటి ప్రయత్నం జరగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
> కొత్త సొసైటీ సభ్యుల నమోదు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తే, వాళ్లకు అవసరమైన 50 ఎకరాలు లేదా 100 ఎకరాలు జర్నలిస్టులు కోరుతున్న చోటే కేటాయించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి ఉంది.
> JNJHS సొసైటీ, నాన్ JNJHS మిత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకొని, జర్నలిస్టులందరికీ ఇంటి స్థలం ఎట్లా పంపిణీ చేయాలో రోడ్ మ్యాపు తయారు చేసుకొని రావలసిందిగా మంత్రి కేటీఆర్ సులువుగా చెప్పేశారు.
> JNJHS లో సభ్యులు కాని వారి పట్ల ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్ తదితరులకు మమకారం ఉండవచ్చు కానీ JNJHS కు లింకు పెట్టడం న్యాయ సమ్మతం ఎలా అవుతుంది?
> ఏది న్యాయమో, ఏది న్యాయం కాదో ముఖ్యమంత్రి కేసీఆర్ కు,కేటీఆర్ కు తెలియజేయాలని మేమెవరమూ అనుకోవడం లేదు. ఎందుకంటే వాండ్లకు తెలుసు.
> జవహర్ లాల్ నెహ్రూ సొసైటీ ఏర్పాటు సమయంలో సభ్యత్వ నమోదు కోసం 5 సంవత్సరాల హైదరాబాద్ సీనియారిటీని ప్రాతిపదికగా పెట్టుకున్నాం. ఇప్పుడు కొత్తగా సొసైటీ ఏర్పాటు చేసే సందర్భంలో అర్హత ప్రాతిపదికను వాళ్ళే నిర్ణయించుకోవాలి. మిగతా విధివిధానాలు వాళ్ళే ఖరారు చేసుకోవాలి.
> సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నాటి నుంచి కొన్ని అవాంఛనీయ పరిణామాలు జరుగుతున్నవి.
- JNJHS లో ఆంధ్రా జర్నలిస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం.
2. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన జర్నలిస్టులు JNJHS లో లేరు అనే ప్రచారం.
3. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పడిన సొసైటీ కనుక కేసీఆర్ కు క్రెడిట్ రాదంటూ ప్రచారం.
4. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా JNJHS నాయకులు మాట్లాడుతున్నారంటూ ప్రచారం.
> ఇలాంటి ప్రచారమంతా కొందరు జర్నలిస్టులు, కొన్ని శక్తులు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదే.J NJHS కు, ప్రభుత్వానికి మధ్య అంతరం సృష్టించడం వాండ్ల లక్ష్యం. కొత్త సమస్యలు పుట్టించడం ద్వారా JNJHS కు భూముల అప్పగింత మరింత ఆలస్యం జరిగేలా చూడడం వాండ్ల ఎజండా.
> ప్రభుత్వం అందరు జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న విషయంలో మాకు భిన్నాభిప్రాయాలు లేవు. ‘పొట్టకూటి కోసం తెలంగాణకు వచ్చిన వాళ్ళతో పేచీ లేద’ని 2001 లో తాను చెప్పిన మాటకు కేసీఆర్ ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు.
> ”ఒకవర్గం జర్నలిస్టులకో లేదా మరో సంఘం సభ్యులకో స్థలం కేటాయిస్తే సమస్య పరిష్కారం కాకపోగా, అది మరింత జటిలం అయ్యే అవకాశమే ఉంటుందనేది కేటీఆర్ తో పాటు, ముఖ్యమంత్రి ఆలోచన కూడా అయి ఉంటుంద”ని మిత్రుడు సూరజ్ వాదన.
> ఇక్కడ ‘వర్గం’ ఎవరు? ‘సంఘం’ ఎవరు? JNJHS సొసైటీ ఎట్లా ఏర్పడిందో, పదిహేనేళ్లుగా 1100 మంది జర్నలిస్టుల కుటుంబాలు ఇంటి స్థలం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నాయో అందరికీ తెలుసు.
> ‘కలిసికట్టుగా వెళ్తేనే, ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తార’ని అంటున్నారు.’కలిసికట్టుగా’ అంటే? ఇదివరకే ఉన్న సొసైటీ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై ప్రభుత్వాన్ని ఎట్లా ఒప్పించాలని ఈ ‘ఐక్యతా సాధకులు’ సూచించడం లేదు?
> జర్నలిస్టు అంటే జర్నలిస్టే. ఆంధ్ర, తెలంగాణ అనే వివక్ష చూపాలని ప్రభుత్వం ఎన్నటికీ ఒప్పుకోదు. ‘సెటిలర్స్ ఫ్రెండ్లి’ ప్రభుత్వంగా తెలంగాణేతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ జనమంతా అనుకుంటున్నారు. పైగా ఇప్పుడు బిఆర్ఎస్ గా జాతీయ స్థాయిలో కేసీఆర్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించ బోతున్నారు. కొందరు జర్నలిస్టులు, ముఖ్యంగా ‘బిఆర్ఎస్ కారిడార్’లలో రెగ్యులర్ గా తిరిగేవాళ్లు సంకుచిత మనస్తత్వంతో దుష్ప్రచారానికి ఒడిగట్టారు.
> తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్నప్పుడు జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళకే ‘ప్రాధాన్యం’ ఇస్తామనే ధోరణిలో ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు మాట్లాడడం ఆందోళన కలిగిస్తోంది.
> JNJHS లోని చాలామంది తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళే. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి ఆ ఉద్యమంతో మమేకమైన వాళ్ళే.
> JNJHS లోని సభ్యుల్లో 50 మందికి పైగా చనిపోయారు. చాలామందికి 60 ఏండ్లు దాటాయి. మరి కొందరు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సొసైటీ సభ్యుల్లో నాలుగు దశాబ్దాలుగా మీడియాలో పనిచేస్తూ కూడా కిరాయి ఇండ్లలో ఉన్నవాళ్ళున్నారు. ప్రభుత్వం ఇస్తుందనుకుంటున్న ‘స్థలం’ లభిస్తే, అక్కడో గూడు కట్టుకోవాలని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు.
> జనరల్ బాడీ ఆమోదంతో JNJHS సభ్యత్వం సంఖ్య పెంచాలంటూ వస్తున్న ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కానివి. లేదా కొత్త చిక్కులు ఎదురుకానున్నవి. సమస్య మరింత జటిలం కావడమే తప్ప పరిష్కారం కాదు.
> JNJHS సొసైటీ ఏర్పడే నాటికే అర్హతలు ఉండి సభ్యత్వం విషయమై 35 మందికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడం JNJHS బాధ్యత.
> కేసీఆర్ ను, కేటీఆర్ ను తప్పుదోవ పట్టించే వాళ్ళు, తప్పుడు సమాచారం అందించే వాళ్ళు పుష్కలంగా ఉన్నారు. వాండ్ల కారణంగానే JNJHS సభ్యులకు సుప్రీంకోర్టు తీర్పు అమలు జరగడం లేదు.
> మంత్రి కేటీఆర్ ‘మిగతా వాళ్ళ సంగతి’ ? అంటూ శుక్రవారం మాట్లాడిన తీరుతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల వ్యవహారం ఇప్పుడప్పుడే కొలిక్కిరాదని JNJHS సభ్యులంతా భావిస్తున్నారు.
> తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర అవతరణ, 2009,2014 వంటి విషయాలతో JNJHS కు ఏమి సంబంధం?
> 2009 నుంచో, 2014 నుంచో జర్నలిజంలోకి వచ్చిన వాండ్లే ‘అసలు జర్నలిస్టు’లు అనే నిర్వచనమే వక్రీకరణ.లేదా ‘వాళ్ళకు’ ఇచ్చాకే JNJHS కు కేటాయింపు జరుగుతుందని అనడమూ సబబుగా లేదు.
> జర్నలిస్టులందరికీ ఇండ్ల స్తలాలు రావలసిందే, ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఇవ్వవలసిందేనని ప్రాధేయపడడం మినహా JNJHS చేయగలిగిందేమీ లేదు.
zakeer, MEMBER,JNJHS.
Share this Article