అరె భయ్, అనవసరంగా సినిమాల మీద కామెంట్స్ చేయకండి అని ఆమధ్య బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగులో మోడీ హితవు చెప్పాడు తన పార్టీ శ్రేణులకు… ప్రతి సినిమాలో ఏదో ఒక బొక్క వెతికి, బ్యాన్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేస్తున్నారు, నిరసనలకు దిగుతున్నారు, ఏవేవో ముద్రలు వేస్తున్నారు… ఈ నేపథ్యంలో మోడీ పిలుపుకు ప్రాధాన్యం ఉంది… కాకపోతే మోడీ హితవచనాలు ఆ పార్టీ శ్రేణులకే నచ్చలేదు.,.
అంతెందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగికే నచ్చలేదు… శుక్రవారం ఇండియాటుడే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంలో స్పందించాడు… ‘‘యాక్టర్లను, ఆర్టిస్టులను గౌరవిద్దాం… గౌరవించాలి… కానీ అదే సమయంలో యాక్టర్లు, ఆర్టిస్టులు కూడా ప్రజల మనోభావాలను పట్టించుకోవాలి కదా…’’ అని ఎదురు ప్రశ్నించాడు… అంటే, సినిమావాళ్లు ప్రజల మనోభావాల్ని పట్టించుకోని కారణంగానే, అనివార్యంగా ఈ బ్యాన్ కల్చర్ పెరుగుతోందని తను అభిప్రాయపడుతున్నాడు…
నొయిడాలో నిర్మించే ప్రపంచ స్థాయి సినిమా స్టూడియో గురించి చర్చించడానికి ముంబై వెళ్లిన యూపీ సీఎం పలు కాన్ఫరెన్సుల్లో పాల్గొన్నాడు… నటులు, దర్శకులు, నిర్మాతలతో భేటీలు వేస్తున్నాడు… వేల కోట్ల రూపాయలతో నిర్మించబోయే ఈ ఫిలిమ్ సిటీని యోగి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే… ఈ ప్రాజెక్టు గురించి ముంబైలో సునీల్ శెట్టి, మనోజ్ జోషి, కైలాష్ ఖేర్, సోను నిగమ్, బోనీకపూర్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్ తదితరులతో భేటీలు వేశాడు…
Ads
ఫీచర్ ఫిలిమ్స్ అయితే 50 శాతం, వెబ్ ఫిలిమ్స్, వెబ్ కంటెంట్ అయితే 25 శాతం వరకూ సబ్సిడీలను ఏయే అంశాలకు ప్రభుత్వం చెల్లిస్తుందో కూడా యోగి వివరిస్తున్నాడు… టూరిజం ప్రధానంగా ఉండే ఈ సినిమా స్టూడియోలో… ఒక సినిమా నిర్మాణానికి కావల్సిన ప్రతిదీ లభించే ఏర్పాట్లు చేయబోతోంది… అప్పట్లో రామోజీ ఫిలిమ్ సిటీ నినాదం తెలుసు కదా, డబ్బుతో రండి, సినిమా డబ్బాలతో తిరిగి వెళ్లండి అని… సేమ్, యోగి కాన్సెప్టు కూడా అదే…
ఒకేచోట సెట్ల నిర్మాణానికి అనుకూల స్థలాలతో పాటు, సాంగ్ రికార్డింగ్, వాయిస్ ఓవర్ స్టూడియోలు, మిక్సింగ్ స్టూడియోలు, గ్రాఫిక్స్, ఎడిటింగ్ ఫెసిలిటీస్ ఎట్సెట్రా అన్నీ ఉంటాయి… అక్కడే ఉండే స్టార్ హోటళ్లలోనే ‘మార్కెటింగ్ ఒప్పందాల చర్చలకూ’ వీలుంటుంది… ఏదో అల్లాటప్పా కాదు, ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుబాటులోకి తీసుకురావాలనేది ప్లాన్…
ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ ‘‘సొసైటీని ఏకంచేయడానికి సినిమాలు ఓ మంచి మార్గం… అందుకే మేం యూపీని ఫిలిమ్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా పరిగణిస్తాం… ఎవరైనా సరే, స్వేచ్ఛగా, భయరహితంగా షూటింగులు చేసుకోవచ్చు… అంతేకాదు, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టం కూడా ప్రవేశపెడుతున్నాం… ఇదంతా మాకు టూరిజం ప్రమోషన్‌లో భాగం… తద్వారా ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది… ఫిలిమ్ కులానికి చెందిన వాళ్లు మా స్టేట్ నుంచి ఇద్దరు ఎంపీలున్నారు… సినిమా ఇండస్ట్రీ సమస్యలేమిటో ప్రతిదీ సూక్ష్మంగా పట్టించుకుంటాం..’’ అన్నాడాయన… అవును మరి, సినిమా బ్యాన్ కల్చర్‌పై మోడీకి ఉన్న అభిప్రాయాలే మిగతా శ్రేణులకు ఉండాలనేముంది..? పైగా యోగి వంటి నేతలకు అస్సలు ఉండదు…!!
Share this Article