ఇప్పుడంటే పెద్దగా వినిపించడం లేదు గానీ… కొద్దిరోజుల క్రితం వరకూ బ్రహ్మానందం పేరు వింటేనే నవ్వొచ్చేది… తెలుగు కామెడీతో అంతగా మమేకం అయ్యాడు… ఆయన అదృష్టం, కృషి కారణంగా మంచి పాత్రలు దక్కాయి… పేరు, డబ్బు, ఆస్తులు అన్నీ సంపాదించుకున్నాడు… సన్ స్ట్రోక్తో కొంత పోగొట్టుకున్నాడు… అదంతా వేరే కథ… అసలు బ్రహ్మానందం లేకుండా సినిమా వచ్చేది కాదు ఒకప్పుడు… అంతటి కమెడియన్ కూడా మాటీవీలో ఏదో కామెడీ షో చేసి ఫ్లాప్ అయ్యాడు… అది ఇంకో కథ… అన్నీ హిట్ కావాలని లేదు కదా… అంతటి మెగా స్టారుడే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను రక్తికట్టించలేకపోయాడు… ఐనా ఇండస్ట్రీకి ఒకసారి నచ్చకపోవడం అనేది స్టార్టయితే ఇక ఖతం… అంతటి పాటగాడు బాలసుబ్రహ్మణ్యాన్నే పక్కనపెట్టింది… బ్రహ్మానందం తనకన్నా ఎక్కువేమీ కాదుగా…
అయితే బ్రహ్మానందం మంచి కామెడీ టైమింగు ఉన్న ఆర్టిస్టే కాదు… తనలో మరో ఆర్ట్ కూడా ఉంది… బొమ్మలు బాగా గీయగలడు… కొంత తాత్వికత, ఆధ్యాత్మికత, భాష తదితర అంశాలపైనా మంచి పట్టుంది… అదంతా ఇంకో కథ… తను మంచి మూడ్లో ఉన్నప్పుడు బొమ్మలు గీస్తాడు… చూశారు కదా, తను పెన్సిల్తో వేస్తున్న స్కెచ్…
Ads
పంచె కట్టుకుని, నిష్టగా కూర్చుని, బొమ్మ గీయడం మొదలుపెడితే… అది పూర్తయ్యేదాకా లేవడు… శ్రద్ధగా గీస్తాడు… కాన్వాస్ ‘కళ’ సంతరించుకున్నాకే ముగిస్తాడు… సేమ్, అలాగే తను గీసిన ఆ బొమ్మ ఫైనల్ లుక్ కూడా చూడండి… వెంకటేశ్వరస్వామి… మరో బొమ్మ దగ్గరకు వెళ్దాం…
కింద ఉన్న రాముడు, ఆంజనేయుడు ఫోటో కూడా తను గీసిందే… రాముడి మొహంలో అంతగా దయ, వాత్సల్యం గట్రా కనిపించడం లేదు గానీ ఆంజనేయుడి కళ్లల్లో అశ్రువులు స్పష్టంగా ఉన్నయ్… సరే, ఆయనేమైనా ఫేమస్ చిత్రకారుడా, కాదు కదా, ఏదో తనలోని చిత్రకారుడిని అప్పుడప్పుడూ నిద్రలేపి, ఇలా బొమ్మ గీయించి, మళ్లీ పడుకోబెడతాడు… ఈమాత్రం గీయడమే గొప్ప…
ఆమధ్య ఎవరో తన మిత్రుడు ‘ఫలానా వెబ్సైటులో నువ్వు గీసిన అయిదారు బొమ్మలూ బాగున్నయ్’ అని మెచ్చుకుంటే… బ్రహ్మికి కోపం వచ్చింది… అదేమిటి మెచ్చుకుంటే సంబరపడాలి కదా… ‘నో, నో, ఈ సోషల్ మీడియా ఇలాగైందేమిటోయ్… నేను గీసినవే రెండు బొమ్మలు, ఒకటి వెంకటేశ్వరస్వామి, రెండు రామాంజనేయులు, మిగతావి నావి కావు, ఎవరు గీశారో తెలియదు… అవి కూడా నా ఖాతాలో వేస్తున్నారు’ అని తెగ బాధపడిపోయాడు… అలా బ్రహ్మానందం గీసినట్టుగా ప్రచారంలోకి వచ్చిన బొమ్మలు ఇవీ…
సారు గారికి, సోషల్ మీడియాకు, వెబ్ మీడియాకు, ట్యూబ్ మీడియాకు తేడా తెలియదు కాబట్టి వోకే అనుకుందాం… ఎవరి బొమ్మల్నో తన ఖాతాలో వేసినందుకు మరీ అంత చింతించాల్సిన పనికూడా లేదు… కానీ నేను గీసింది రెండు బొమ్మలే అంటాడు… మరి ఇదేమిటి బ్రహ్మీ… అప్పట్లో శ్రీశ్రీ బొమ్మ గీశావని నీ కొడుకే చెప్పాడు అందరికీ… ఓహ్… ఇది కూడా నేను గీయలేదు అంటావా..? సరే, నీ ఇష్టం కానివ్వు… అన్నట్టూ, కొత్తగా ఏం బొమ్మ గీస్తున్నావు సారూ..? మొన్న ఏదో సైటులో ఎంఎఫ్ హుస్సేన్ బొమ్మను కూడా పెట్టి, నువ్వే గీసినట్టు రాసేశాడు ఎవరో… నువ్వంటే లవ్వు బాసూ…
Apart from making you laugh till your stomach hurts, #Brahmanandam has a whole other side to him too. He uses time in #quarantine to sketch a portrait of the famous writer #SriSri. pic.twitter.com/l6ABn6XuEW
— Hyderabad Times (@HydTimes) April 19, 2020
Share this Article