అసలు భారతం ఎంత పెద్ద గ్రంథం అయితేనేం… భారతం లేకుండా దేశం లేదు, నేను లేక భారతం లేదు… నేనే ప్రథమ పాత్ర… ప్చ్, కానీ నన్నెవరూ పట్టించుకోరు… ఆ కాలమాన సంప్రదాయాల్ని, కట్టుబాట్లను ఛేదించాను, తిరగబడ్డాను, అలాగే బతికాను… అయితేనేం, ప్రతిచోటా నాకు నిరాశే మిగిలింది… నేను అనుకున్నట్టు జరిగి ఉంటే భారత కథ వేరే ఉండేది… అసలు ఆ కథే ఉండేది కాదేమో…
తప్పేమీ అనిపించలేదు… మా కులంలో సమ్మతమే అంటారు… ఓరోజు నా పడవలో ఓ యోగిపుంగవుడు ఎక్కాడు… పరాశరుడట… నన్ను చూస్తే మోహంలో పడిపోయాడు… పడిపోనివారెవ్వరు..? అదుపు తప్పాడు… నేనూ రాబోయే పరిణామాలను ఆలోచించలేదు… అక్కడే కలిశాం… తరువాత నన్ను విడిచిపెట్టి, తన దారిలో తను వెళ్లిపోయాడు… ఫలితం గర్భం… నా కడుపున దేశం గర్వించదగిన మహా జ్ఞాని పుడతాడని నేనూ అనుకోలేదు… అవును, వ్యాసుడు స్థితప్రజ్ఞుడు… కానీ నా మాట కాదనడు… పెళ్లికాకుండానే, కన్యగా ఉన్నప్పుడే కడుపు… ఏమని పిలుస్తారో, కానీ ఈ కథలో మాత్రం నాతోనే మొదలు… ఆ తరువాతే కుంతి…
శంతన మహారాజుకూ నామీద మోహం కలిగింది… పెళ్లి చేసుకుంటానంటాడు… వెళ్లి మా తల్లిదండ్రులను అడగండి రాజా అన్నాను… అప్పటికే భావి చక్రవర్తి అయ్యే కొడుకున్నాడు తనకు… మరి మాకు కలిగే పిల్లల మాటేమిటి..? అదే అడిగారు… కాదంటే పెళ్లి మాటే లేదన్నాను నేను కూడా… శంతనుడు మాట్లాడలేదు, కానీ తన కొడుకు దేవవ్రతుడు తండ్రి కోసం… నాకు అధికారం అక్కర్లేదు అన్నాడు… మాటతప్పనంటూ ప్రతిజ్ఞ చేశాడు… అంతేకాదు, బ్రహ్మచారిగానే బతుకుతానన్నాడు… నాకు అలాంటి కొడుకు ఉంటే ఎంత బాగుండు..!!
Ads
కళ్లెదుట రాజ్యం కనిపిస్తోంది… నా కొడుకుల్లో ఒకరు సింహాసనం ఎక్కుతున్న దృశ్యం కనిపిస్తోంది… కానీ ఏం సుఖం… ఒకడు పుట్టాడు, చిత్రాంగదుడు… మరొకడు పుట్టాడు విచిత్రవీర్యుడు… చిత్రాంగదుడికి పొగరెక్కువ… సింహాసనం ఎక్కిస్తే బాధ్యత తెలుసుకోవాలి గానీ మరింత చెలరేగిపోయాడు… ఓసారి ఒక గంధర్వరాజుతో ద్వంద్వయుద్ధం చేసి, అతని చేతిలో మరణించాడు, మొదటి కడుపుకోత నాకు…
పాపం, భీష్ముడు, అన్నమాటకు కట్టుబడి, విచిత్రవీర్యుడిని పట్టాభిషిక్తుడిని చేశాడు… వాడికి అనారోగ్యం… పేరులోనే మర్మం తెలుస్తోంది కదా… భీష్ముడు వారణాసి రాజకుమార్తెలు అంబ, అంబిక, అంబాలికల్ని తీసుకొచ్చాడు… అంబ నేను విచిత్రవీర్యుడిని పెళ్లి చేసుకోను అని పట్టుపట్టింది… ఆమెను వదిలేశాడు భీష్ముడు… అంబిక, అంబాలికలను ఇచ్చి పెళ్లి చేశాం, సుఖమేముంది..? పిల్లల్లేరు, వాడు అలాగే నిస్సంతుగా మరణించాడు… నాకు మరో కడుపుకోత… మరి సింహాసనం ఎక్కేది ఎవరు..? శంతనరాజు అప్పటికే మరణించాడు… నియోగపద్ధతిలో పిల్లల్ని కనే ఓపిక కూడా లేదు… వ్యాసుడు గుర్తొచ్చాడు… తలుచుకున్నాను, వచ్చాడు…
‘‘నాయనా, నా కోడళ్లకు రాజ్యానికి వారసుల్లేరు… నియోగ పద్దతిలో సంతానం కలిగించు’’ అని కోరింది… వ్యాసుడు అంబిక, అంబాలికతో సంభోగం జరిపి, తన దారిన తను వెళ్లిపోయాడు… మళ్లీ నాకు నిరాశే… ఒక మనమడు పుట్టు గుడ్డి… పేరు ధృతరాష్ట్రుడు… మరొక మనమడు పాండురాజు… వాడికీ పలు రోగాలు… అంతా నా దురదృష్టం… పాండురాజుకు పిల్లల్లేరు సరికదా పెళ్లాంతో కలిస్తే చచ్చిపోతావనే శాపం పొందాడు ఎవరి వల్లో… మరెలా..? వాడికి వారసుల్లేకపోతే ఎలా..?
వాడి పెళ్లాలు కుంతికి, మాద్రికి మళ్లీ నియోగ పద్ధతిలో అయిదుగురు కొడుకులు పుట్టారు… అందరూ ముక్కున వేలేసుకున్నారు… అప్పటికే మా వంశంలో అది ప్రవేశించింది కదా… మాకు ఆశ్చర్యమేమీ లేదు… వ్యాసుడి పుట్టుక తరువాత, శంతనుడితో పెళ్లి తరువాత… రాజ్యాధికారం దక్కుతోంది, జారిపోతోంది… నేనెప్పుడూ సంతోషంగా లేను… వయస్సు మీద పడుతోంది… పాండురాజు కూడా మరణించాడు… కౌరవులు, పాండవులకు నిత్యం కీచులాటలే… ఇక నాకూ ఈ జీవితం మీద వైరాగ్యం వస్తోంది…
ఆదిపర్వం దాటక ముందే హతమారిపోయిన నా కథలో అన్నీ విషాదాలే… కానీ ఎవరేమనుకున్నా సరే… ఈ సత్యవతి అనుకున్నది చేస్తూ పోయింది… సాధించాను అనుకుంది, కానీ చివరికి వెనక్కి తిరిగి చూస్తే నేను సాధించిందేమీ లేదు… పెళ్లి గాకుండా సంతానం దగ్గర నుంచి కోడళ్లకు నియోగ సంతానం, కుంతి-మాద్రిలకు కూడా అదే పద్ధతిలో సంతానం దాకా… విధి చేసే వింతలన్నీ నా మనస్సు విరిచేశాయి… హస్తినను వదిలేయాని నిర్ణయించాను… కోడళ్లు అంబిక, అంబాలిక కూడా వస్తామన్నారు… అడవుల్లోకి వెళ్లిపోయాం… అక్కడే చివరకు కళ్లు మూశాను… అదుగో పరాశరుడు, అదుగో శంతనుడు… రమ్మని పిలుస్తున్నారు… సెలవు…!!
Share this Article