ఓసారి రామోజీరావును జగన్ కలిశాడు… అంతే… ఆ మధ్యలో కొన్నాళ్లు సైలెన్స్… అంతే, ఇక మళ్లీ మొదలైంది… సాక్షి వర్సెస్ ఈనాడు పంచాయితీ ఈసారి ఏకంగా కోర్టు తలుపులు తట్టింది… సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడానికి జగన్ ప్రత్యేకంగా ఒక జీవో ఇవ్వగా, దాన్ని సవాల్ చేస్తూ ఈనాడు హైకోర్టులో దావా వేసింది… సాక్షి, ఈనాడుల ద్వంద్వ యుద్ధంలో ఇది మరో అధ్యాయం… వివరాల్లోకి వెళ్దాం…
వలంటీర్లు, గ్రామ-వార్డు సెక్రెటేరియట్ స్టాఫ్ దినపత్రికలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జీవో ఇచ్చింది… అది ముఖ్యమంత్రి జగన్ సొంత పత్రిక సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే అనేది ఈనాడు వాదన… ఆ జీవోను రద్దు చేయాలనీ, అంతేకాదు, ఏబీసీ ఆ సర్క్యులేషన్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలనీ ఈనాడు కోరుతోంది…
ఈ పిటిషన్‌పై కోర్టు సాక్షి డైరెక్టర్‌కు, ముఖ్యమంత్రికీ, సాక్షి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన భార్య భారతీరెడ్డికి, సాక్షి ప్రధాన వాటాదారులు సండూర్ పవర్, కార్మిల్ ఏషియా, కీలాన్ టెక్నాలజీస్‌కు నోటీసులు జారీ చేసింది… అంతేకాదు, ఏబీసీ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా… పురపాలక, రెవిన్యూ, పంచాయత్‌రాజ్, విలేజ్ సెక్రెటరీస్, సమాచార శాఖల ముఖ్య కార్యదర్శులకూ నోటీసులు ఇచ్చింది… సాక్షికి ప్రభుత్వ ప్రకటనల్లో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే మరో పిటిషన్‌లో కూడా కోర్టు కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది…
Ads
స్థూలంగా ఇదీ వార్త… తనే కేసు వేసిందిగా, మరి ఈనాడు తను ఈ వార్త రాయొచ్చుగా… ఈనాడులో కనిపించలేదు… ఆంధ్రజ్యోతి రాసింది వివరంగా… తనే కేసు వేసినప్పుడు ఆ కేసు వివరాలేమిటో ఈనాడు ఎందుకు రాయలేదు..? సాక్షి మీద కేసు కాబట్టి ఆంధ్రజ్యోతి సంబరంగా రాసుకుంది… (తనను కూడా ఇంప్లీడ్ చేయాలంటూ అడుగుతుందా రాబోయే రోజుల్లో..?)
దినపత్రికలు కొనుగోలు చేసుకోవచ్చునంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందే తప్ప సాక్షిని కొనుగోలు చేయాలని ప్రత్యేకంగా అందులో చెప్పరు కదా, అందుకని టెక్నికల్‌గా ప్రభుత్వ శాఖలు ఇరుక్కోకపోవచ్చు… కోర్టులో ఏజీ వాదన ఈ కోణంలోనే ఉంది… జీవో ఇచ్చింది ప్రభుత్వం కాబట్టి సాక్షికీ ఇరకాటం ఉండకపోవచ్చు… ఏమని అఫిషియల్ కౌంటర్ ఇస్తారో చూడాలి… అయితే ఆ జీవో సాక్షికి పరోక్షంగా ఉపయోగపడుతుందనే వాదన ఉండనే ఉంది… సాక్షిని కాదని వేరే పత్రికల్ని వాలంటీర్లు, గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు ఎలాగూ కొనుగోలు చేయరు కాబట్టి ఒకరకంగా ఇది అధికార దుర్వినియోగమే అనేది సాక్షి ప్రత్యర్థుల వాదనగా చూడాలి…
ఒకటి మాత్రం నిజం… పాఠకుడు ఒక పత్రిక కొనుగోలు చేయాలనిపించేలా అందులో కంటెంట్ ఉండాలి… దమ్ముండాలి… కొన్ని స్టాండర్డ్స్ మెయింటెయిన్ చేయాలి… అదే అంతిమంగా నిలబడేది… మంచి మార్కెటింగ్ టెక్నిక్స్, సర్వీస్ కూడా ఉండాలి… అది కాదని డొంకతిరుగుడు పద్ధతుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఫాయిదా స్థిరంగా నిలబడేది కాదు… ఇక్కడ ఈనాడు కేసు పరమార్థం సర్క్యులేషన్ గురించే కాదు, తన నంబర్ వన్ స్థానం పోతుందని మాత్రమే కాదు… ఆ పేరిట దక్కుతున్న ప్రైవేటు కంపెనీల యాడ్స్ కూడా పోతాయనే సందేహం… ఒక్క రూపాయి కూడా తగ్గించని ఈనాడు ఇప్పటికే కరోనా తరువాత తన యాడ్ టారిఫ్‌లో అడ్డగోలు తగ్గింపులు ఇస్తున్న సంగతి తెలిసిందే… ఇంకా దెబ్బ పడుతుందేమో అనే భయం… సహజమే… కోర్టుకు వెళ్లడంలో తప్పులేదు..!!
Share this Article