సాధారణంగా గుడి అంటే..? దేవుడు ఎవరైతేనేం..? సాధారణంగా గర్భగుడి, మంటపం, ప్రహారీ, ధ్వజస్థంభం, గంటలతోపాటు హుండీలు ఉంటాయి… పెద్ద గుళ్లయితే భక్తులను దోచుకోవడానికి స్పెషల్ టికెట్లు, కాస్త ప్రహారీ పక్కనే రకరకాల ఆర్జిత సేవల టికెట్లు అమ్మే ‘దుకాణాలు’ కనిపిస్తాయి… క్యూలైన్ల నిర్మాణాలు కూడా..! హనుమంతుడి గుళ్లూ అంతే… కాకపోతే హనుమంతుడు పేదవాళ్ల దేవుడు కదా, ఎక్కడైనా సరే వాటిని కట్టేస్తారు… ఎర్రగా చందనం పులిమిన విగ్రహం, రాముడికి దండం పెడుతున్నట్టుగా మూర్తి, ఓ చిన్న స్లాబుతో గుడి ఉంటాయి…
శివుడు కూడా భక్తసులభుడు… లింగం, పానవట్టం, ఓ త్రిశూలం ఉంటే చాలు, దేవదేవుడి గుడి రెడీ… శివుడి గుడిలో అట్టహాసాలు, ఆడంబరాలు ఉండవు… ఉండకూడదు… కాస్త మారేడు పత్రి, విభూతి, నాలుగు పువ్వులు ఉంటే చాలు, అవే పూజకు పదివేలు… ధ్వజస్థంభాలు లేని లింగాన్ని వాయులింగం అంటారు… అఫ్‌కోర్స్, శ్రీశైలంలో స్పర్శదర్శనం గట్రా విపరీతమైన రేట్లను పెట్టేసి, మరో తిరుపతిని చేసేశారు… కనీసం ఉచిత ప్రసాదం కూడా పెట్టే దిక్కుండదు… ఎక్కడైనా సరే, శనీశ్వరుడికి పైకప్పు ఉండదు… ఉండొద్దు… ఓపెన్ టు స్కై…
శుక్రవారం కేసీయార్ బిడ్డ ఏదో పనిమీద చెన్నై వెళ్లి, సినిమా హీరో అర్జున్ ఇటీవల కొత్తగా నిర్మించిన హనుమంతుడి గుడికి వెళ్లింది, దండం పెట్టుకుంది… ఆ ఫోటో చూడగానే కనెక్టయ్యేలా ఉంది… రొటీన్ గుళ్లలాగా లేదు… అర్జున్ అభిరుచి, కొత్తదనం, సృజన కనిపిస్తున్నాయి… గర్భగుడి, మంటపం, చందనం, హుండీలు గట్రా ఏమీ లేవు… ప్లెయిన్‌గా ఓ పెద్ద విగ్రహం, అదీ యోగముద్రలో ఉన్న మూర్తి… చుట్టూ ఓ గార్డెన్ తరహా పరిసరాలు… బాగుంది…
Ads
ఇదే పోస్టు చేసినప్పుడు ఓ మిత్రుడు ఇలా ఓపెన్ టు స్కై గుళ్లలో కర్నాటకలోని ఇంకో ఫేమస్ గుడి కూడా ఒకటని చెప్పాడు… పేరు సౌతాడ్క గణేశుడు… నిజమే… అదీ ఇంప్రెసివ్… ఆసక్తికరంగా ఉంది… కర్నాటకలో ఫేమస్ గుళ్ల ధర్మస్థల, కక్కే సుబ్రహ్మణ్యం… ఈ రెండు క్షేత్రాల నడుమ ఉంటుంది ఈ సౌతాడ్క… నిజానికి ఆ ప్రాంత ప్రజలు చాలా భక్తిశ్రద్ధలతో సేవిస్తారు… కానీ రావల్సినంత ప్రాచుర్యం ఈ గుడికి రాలేదేమో అనిపిస్తుంది… కక్కేలో నిలుచున్న గణేశుడు… ఈ సౌతాడ్కలో ఆరుబయట కొలువై ఉన్న పెద్ద గణేశుడు…
అక్కడ కర్రలతో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద దూలాలకు రకరకాల పరిమాణాల్లో గంటలు కనిపిస్తాయి… అవి భక్తగణం రకరకాల కోరికలతో కట్టే గంటలు… ప్రశాంత వాతావరణం… చుట్టూ ఖాళీస్థలం… అచ్చంగా అడవితల్లి ఒడిలో కొలువైనట్టుగా ఉంటుంది గుడి… ప్రతి ఒక్కరికీ ప్రసాదం పేరిట మధ్యాహ్నభోజనం తప్పనిసరి… ఇదేకాదు, కర్నాటకలోని ప్రతి గుడిలోనూ దాని శక్తిసామర్థ్యాల మేరకు ఉచిత భోజనం ఉంటుంది… డబ్బు సరిపోకపోతే అన్నం ప్లస్ సాంబారుతోనైనా మధ్యాహ్నం భోజనప్రసాదం ఉంటుంది… అవేవీ దిక్కులేనివి తెలుగు గుళ్లు… కనీసం ప్రసాదం కూడా పెట్టరు… ఒక్క అంతర్వేది, తిరుపతి మినహా… అంతర్వేది అయితే టాప్ ప్రసాదభోజనంలో…
ఈ సౌతాడ్క అనే పేరుకు అర్థం దోస పొలం… వంటల్లో దోశ కాదు… దోసకాయ తోట… స్థలపురాణం ఎలా ఉన్నా సరే, పొలాల నడుమ ప్రశాంతంగా కొలువై ఉంటాడు గణేశుడు… ఇక్కడ ప్రసాదాల్లో అవలక్కి పంచకజ్జయ చాలా ఫేమస్… అటుకులు, కొబ్బరి, బెల్లం, నువ్వులు, తేనెతో చేస్తారు… అది యూనిక్, ఈ గుడి స్పెషాలిటీ… ధర్మస్థల, కక్కే సుబ్రహ్మణ్యం గుళ్లకు వచ్చినంత పేరు వచ్చి ఉండాల్సింది నిజానికి ఈ ఓపెన్ గణేశుడికి…!! కర్నాటక టూర్ వెళ్లే మన టూరిస్టులు ఎక్కువగా ధర్మస్థల, మురుడేశ్వర్, కక్కే సుబ్రహ్మణ్యం, ఉడుపి, శృంగేరీ, గోకర్ణం, హంపి సందర్శిస్తారు… ఎలాగూ ధర్మస్థల, కక్కేల మధ్యే కాబట్టి జాబితాలో సౌతాడ్కనూ చేర్చేస్తే సరి..!
Share this Article