ఊళ్లో ఓ పెద్ద మనిషి గారి పెంపుడు కుక్క ఆయుష్షు తీరి చనిపోతే ఊరివాళ్లంతా బారులు తీరతారు… మందలుమందలుగా వెళ్లి ఆ పెద్ద మనిషిని పరామర్శిస్తారు… అబ్బ, మీ కుక్క భలే ఉండేదండీ, పిక్కల్ని తప్ప మరొకటి పీకి ఎరుగదు అని కూడా మెచ్చుకుంటారు… పంచాయతీ ఖర్చులతో డీజే బ్యాండ్, ఊరేగింపుతో వెళ్లి, బాణాసంచా కాల్చి మరీ అంత్యక్రియలు నిర్వర్తించి గౌరవాన్ని చాటుకుంటారు… కానీ ఆ పెద్ద మనిషే చచ్చిపోతే..? కుక్కలు కూడా పట్టించుకోవు..!!
ఇది అందరికీ తెలిసిన లోకసహజం… ఇటీవల మరణించిన సినిమా సెలబ్రిటీల విషయంలో అదే చూశాం మనం… కృష్ణ, కృష్ణంరాజులు మరణిస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు… అదే జమున, విశ్వనాథ్ మరణిస్తే పట్టించుకున్న ప్రభుత్వ పెద్దలు లేరు… వాళ్లు గొప్పవాళ్లే కావచ్చు, కానీ వీళ్ల పట్ల వివక్ష ఎందుకు..? వాళ్లకన్నా వీళ్లేం తక్కువ..? ఆత్మగౌరవంతో బతికారు కదా… ఒకరు పద్మశ్రీ, మరొకరు పద్మభూషణ్… చాలాకాలం ప్రజలకు వినోదాన్ని పంచారు కదా… మిగతా సినిమా పాపులర్ సెలబ్రిటీలు కూడా వెళ్లి తుది నివాళి అనే లాంఛనాన్ని కూడా ప్రదర్శించలేదు… విశ్వనాథ్ నివాసానికి కొందరు వెళ్లారు… పునీత్ రాజకుమార్ మరణిస్తే కన్నడ సమాజం తమ ఇంట్లో మనిషి చనిపోయినట్టు బాధపడింది… అంత్యక్రియలకు ముఖ్యమంత్రి, ఇతర పార్టీల నేతలూ హాజరయ్యారు…
ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం… మరొకటి చెప్పుకుందాం… రజినీకాంత్‌తో విశ్వనాథ్‌కు పెద్ద అనుబంధమేమీ లేదు… కానీ కమల్ హాసన్‌ను దాదాపు తన దత్తపుత్రుడిలాగే ట్రీట్ చేశాడు విశ్వనాథ్… విశ్వనాథ్ తన గురువు అని ఎన్నోసార్లు కమల్ హాసన్ చెబుతూ వచ్చాడు… ఎస్పీ బాలు, విశ్వనాథ్, కమల్… ఇదొక జాన్ జిగ్రీ త్రయం… ప్రత్యేకించి సాగరసంగమం, స్వాతిముత్యం తెలుగులో స్ట్రెయిట్ సూపర్ హిట్స్… విశ్వనాథ్ మనసు పెట్టి కమల్ హాసన్ పాత్రల్ని తీర్చిదిద్దాడు…
Ads
బాలసుబ్రహ్మణ్యం మరో స్వాతిముత్యం కావాలంటూ విశ్వనాథ్‌పై ఒత్తిడి తెచ్చి శుభసంకల్పం తీయించాడు… తనకూ ఓ ప్రధాన పాత్ర ఇచ్చి చేయించాడు… అంత దగ్గర ఆ ముగ్గురూ… బాలు మరణించినప్పుడు తమిళనాడు ప్రభుత్వం, ఆ సమాజం పూర్తిగా తమవాడిగా ఓన్ చేసుకున్నాయి… గౌరవంగా వెళ్లిపోయాడు… అవే వాణీజయరాం మరణించినప్పుడు కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి… హైదరాబాదులో మరణించలేదు నయం…
అంతటి సన్నిహితుడు విశ్వనాథ్ మరణిస్తే కమల్ హాసన్ స్పందన ఏమిటో తెలుసా..? సెల్యూట్ టు మాస్టర్ అని ఓ ట్వీట్ పడేశాడు… అంతే… ఇక విశ్వనాథ్‌తో అవసరం లేదు కదా… తెలుగులో పలు సైట్లు కమల్ హాసన్ అగౌరవ వైఖరి మీద కథనాలు రాశాయి… సరే, తమిళ మీడియా, నెటిజన్ల స్పందన ఎలా ఉంటుందని వెయిట్ చేస్తే, తమిళంలో కమల్ హాసన్ ధోరణిని తప్పుపట్టే ఒక్క స్టోరీ కనిపించలేదు…
అది కమల్ హాసన్ పట్ల అభిమానమా..? లేక విశ్వనాథ్ తెలుగువాడు కాబట్టి డిస్ ఓన్ చేసుకున్నారా..? అంత్యక్రియల రోజు సారు గారు చాలా బీజీ కావచ్చు, కానీ ఆ తరువాత కూడా ఈరోజుకూ హైదరాబాద్ వచ్చి వెళ్లేంత మర్యాద కూడా కరువైంది కమల్ హాసన్‌లో… మనిషి ఎంత గొప్ప నటుడైతేనేం..? తను ఎక్కి వచ్చిన నిచ్చెన మెట్లను గౌరవించలేనివాడు ఎలాంటి మనిషి అనుకోవాలి..?! మనిషి గొప్ప నటుడే కానీ గుణమే గుడిసేటిది..!!
Share this Article