Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శివాయ విష్ణు రూపాయ- శివరూపాయ విష్ణవే..! ఔను, అన్నీ రూపాయల లెక్కలే..!

February 11, 2023 by M S R

Pronunciation:దేవ- ఆదాయ రెండు పదాలు సవర్ణదీర్ఘ సంధిగా కలిస్తే దేవాదాయ అవుతుంది అని అనుకుంటారు. వ్యాకరణంలో సంధి పని ముగిసిన చోట సమాసం పని మొదలవుతుంది. దేవాదాయ అంటే దేవుడికి ఆదాయం అని అనుకుంటారు. దేవుడి వల్ల ఆదాయం, దేవుడి పేరుతో ఆదాయం అని విభక్తులను భక్తి నుండి వేరుచేసి అర్థం చేసుకుంది లోకం.

“శివాయ విష్ణు రూపాయ
శివ రూపాయ విష్ణవే”

అంటే శివుడు- విష్ణువు ఒకటే అని అర్థం. శివుడు డబ్బుకు విలువ ఇవ్వడు కానీ- విష్ణువు రూపాయకు బాగా విలువిస్తాడు అందుకే నయా పైసా లేకపోతే శివాలయం, ధనం సమృద్ధిగా ఉంటే విష్ణ్వాలయం అన్నారని- విష్ణు రూపాయకు లేని అర్థాన్ని ఆవిష్కరించారు. విష్ణువు రూపాయ విష్ణువుకే ; శివుడి రూపాయ కూడా విష్ణువుకే అన్నది దీని అసలు అర్థమని మరి కొందరు వాదించారు. శివుడి రూపాయ అయినా, విష్ణువు రూపాయ అయినా, సకల దేవతల రూపాయలయినా దేవాదాయ శాఖదే అన్నది కలి ధర్మం!

దేవాలయ శాఖ అని పేరు పెట్టకుండా దేవాదాయ శాఖ అని దేవుడి ఆదాయం మీద దృష్టి కేంద్రీకరించి పేరు పెట్టడంలోనే ఆ శాఖ ముందు చూపు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడి పేరిట ఆదాయ మార్గాలు, వాటి స్వరూప స్వభావాల చర్చ ఇక్కడ అనవసరం.

Ads

దేవాదాయం ఏదయినా ధర్మాదాయమే అని లోకం స్థూలంగా అనుకుంటోంది. మన తెలుగు భాషకు పట్టిన తెగులును దేవుడే దిగివచ్చినా బాగు చేయలేడు అనడానికి దేవాదాయ- ధర్మాదాయ మాటలే పెద్ద ఉదాహరణలు. తెలుగులో దాయం అంటే భాగం. రాయలసీమలో పాచికలాటను ఇప్పటికీ దాయాలాట అనే అంటారు.

దేవ దాయం – అంటే దేవుడి భాగం;
ధర్మ దాయం- అంటే ధర్మ భాగం అని అర్థం. ఈ మాట ప్రకారం-
దేవదాయ శాఖ; ధర్మదాయ శాఖ అనే అనాలి తప్ప- దేవాదాయ; ధర్మాదాయ అని అనకూడదు. అసలు అలాంటి మాటలే లేవు.

దాయ అంటే వారసత్వం అనే అర్థం కూడా ఉన్నట్లు చెబుతారు. వ్యుత్పత్తి ప్రకారం అదెలా సాధ్యమో పండితులు తేల్చాలి. ఒకవేళ ఈ అర్థాన్నే ప్రామాణికంగా తీసుకున్నా దేవుడి వారసత్వం, ధర్మం వారసత్వం అన్న కోణంలో దేవ దాయ; ధర్మ దాయ అవుతుందే తప్ప మధ్యలో ఆదాయానికి ఆస్కారమే లేదు.

మన దృష్టి ఎప్పుడూ ఆదాయం మీదే కాబట్టి దేవుడికి, ధర్మానికి ఆదాయం అంటగట్టాము. దేవుడికి లేని అభ్యంతరం మనకెందుకు? ఇంతకంటే భాషాదోషం వల్ల సాక్షాత్తు దేవుడి శాఖకు జరిగిన అన్యాయం, అవమానం గురించి లోతుగా వెళ్లడం సభా మర్యాద కాదు.
-పమిడికాల్వ మధుసూదన్ [ 99890 90018 ]
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions