రైతుల మరణాల గురించి వార్త లేని రోజు లేదు… మా హయాంలో రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయ్ అని కేసీయార్ వేదికలెక్కి ఎంత చెప్పుకున్నా… అవి ఆగడం లేదు… నిజానికి ఆగవు… ప్రతి దశలోనూ రైతు దోపిడీకి గురవుతున్నాడు… అన్ని రిస్కులూ తనవే… నమ్మిన ఎవుసం తన ఖర్చుల నుంచి, అవసరాల నుంచి గట్టెక్కించడం లేదు… దీనికితోడు ప్రభుత్వ విధానాల్లో లోపాలు సరేసరి… ఉదాహరణకు వ్యవసాయంలో అందరికన్నా ఎక్కువ రిస్క్ తీసుకునేది, ప్రాణాలను పణంగా పెట్టేది కౌలు రైతు…
కానీ తెలంగాణలో కౌలు రైతు పదం వినిపించదు… వ్యవసాయం చేయనివాడికీ అప్పనంగా ఏటా వేలు, లక్షలు ఇచ్చే ప్రభుత్వం కౌలు రైతును పట్టించుకోదు… కొంతలోకొంత నయం, రైతుబీమా పథకం… అంతకుముందు ఎవరైనా రైతు మరణిస్తే పంచనామాలు, నిర్ధారణ నివేదికలు, ఎంక్వయిరీలు, బ్రోెకర్ల దందాలు, అధికారుల కమీషన్లు పోను రైతు కుటుంబానికి మిగిలేది కాసింతే… ఈ బీమా పథకంతో మరణానంతరం 5 లక్షలు వస్తాయి, ఎంతోకొంత ఆ రైతుకుటుంబానికి ఆసరా… అసలు పనిచేసి సంపాదించే రైతు పోతే ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయగలరు అనే ప్రశ్నకు జవాబు లేదు ప్రస్తుతానికి…
అసలు ఏ కారణం చేత రైతులు ఎక్కువగా మరణిస్తున్నారు..? ఒకసారి రైతుస్వరాజ్య వేదిక మిత్రుడు Kondal Reddy వాల్ మీదకు వెళ్తే ఓ ఆసక్తికరమైన పోస్టు కనిపించింది… అదేమిటో మీరే చదవండి ఓసారి…
Ads
నెల కింద రైతు బీమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక జాతీయ పత్రిక విలేఖరి అడిగారు, అసలు 59 సంవత్సరాలు అనేది మరీ పెద్ద వయసు కాదు కదా, ఆ వయసు లోపు రైతులు ఇంతమంది ఎలా చనిపోతుంటారు అని… (రైతు బీమా ఆ వయస్సులోపున్న వారికి మాత్రమే)… అసలు 59 సంవత్సరాల లోపు చనిపోయే వారిలో మద్యపానం పాత్ర ఎంత వరకు ఉంటుందో అని మా రవన్నకు ఎప్పటి నుండో ఒక డౌట్… సరే, RTI ద్వారా తెలుసుకుందామని అనుకున్నాము…
రైతు బీమా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యుత్తమ పథకాలలో ఒకటి. నిజమే, 19 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండి భూమి ఉన్న ఏ రైతు ఏ విధంగా చనిపోయినా ఆ కుటుంబానికి 5 లక్షలు పరిహారం వస్తుంది. 2018 ఆగస్టు 15 నుండి ఇప్పటికి అది దాదాపు లక్ష మందికి చేరువయ్యింది, అది ఆ కుటుంబానికి పెద్ద అండగా ఉంటుంది. కానీ అసలు 59 సంవత్సరాలు అంటే మరీ పెద్ద వయసు కాదు, అయినా సరే ఏ కారణాలతో రైతులు చనిపోతున్నారు అని హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న ఒక జిల్లాలో ఒక సంవత్సర కాలంలో చనిపోయిన 782 మంది మరణాలను పరిశీలిస్తే మన ఆరోగ్య – వైద్య విధానం చాలా మెరుగు పర్చుకోవాల్సింది ఉంది అనిపిస్తుంది …
ఆ 782 మంది రైతుల మరణాలకు కారణాలు ఇలా ఉన్నాయి. ఇంకా 59 సంవత్సరాల లోపు వాళ్ళు ‘‘సహజ మరణం- అనారోగ్యం కారణాలు’’ అని పేర్కొనడంకన్నా, పూర్తిగా ఏ కారణంగా అనేది తెలిసి ఉంటే విశ్లేషణకు బాగా ఉపయోగపడేది. అయినప్పటికీ వైద్యం- ఆరోగ్యం, మద్యపానం పాత్ర తదితర విషయాల గురించి అధ్యయనం చేయాలని అనుకునే వారికి ఈ డేటా ఉపయోగ పడుతుంది అనిపిస్తుంది..
(ఇది RTI ఆధారంగా సేకరించిన డేటా)
ఒక జిల్లాలో ఒక ఏడాది 782 మరణాలు నమోదు కాగా… 442 వైద్య సంబంధమే… నిజానికి రైతులే కాదు, పల్లె కుటుంబాలన్నింటికీ వైద్యమే ప్రాణాల మీదకు తెస్తోంది… వేలు, లక్షల బిల్లులు కట్టలేరు, ప్రైవేటు ఆసుపత్రులే వారిని చంపేస్తున్నాయి… కుటుంబాలు బజార్న పడుతున్నాయి… ఇంకా మారుమూల జిల్లాల్లో ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది… ప్రస్తుతం జాతికి పెద్ద రోగం ప్రైవేటు, కార్పొరేటు హాస్పిటల్…
ఈ మరణాల్లో 88 కరోనా కేసులు… వాటిని తీసేసి లెక్కించినా సరే 354 కరోనాయేతర వైద్య మరణాలే… 205 అనారోగ్య మరణాలు అంటున్నారు కానీ ఏ కారణాల చేత ఈ అనారోగ్యం అనేదీ తెలిస్తే… రైతుల్ని పొట్టన పెట్టుకుంటున్న అసలు భూతం ఏమిటో తెలిసిపోయేది… ఈ లెక్కల మాటెలా ఉన్నా… వ్యవసాయం పండుగైంది అనే మాటల్లోని డొల్లతనాన్ని ఈ లెక్కలే బయటపెడుతున్నాయి..!!
Share this Article