కొత్తగా చాట్‌జీపీటీ వచ్చింది కదా… అంతకుముందు నుంచే గూగుల్ ట్రాన్స్‌లేషన్స్ తరీఖ చూస్తున్నాం కదా… మరీ కొత్తగా బాడ్ రాబోతోంది కదా… ఇవి గాకుండా మైక్రోసాఫ్ట్ అనువాదం వంటివీ ఉన్నాయి… నిజానికి ఏదీ సరైన అనువాదం కాదు, పైగా నవ్వు పుట్టించే అనువాదాలు… అన్నీ ఈనాడు అనువాదాల తరహాయే… ఈనాడులో వచ్చే అనువాద పదాలను చదివి మనం ఎన్నిసార్లు పకపకా నవ్వుకున్నామో కదా…
అప్పుడప్పుడూ ఈనాడును చూసి సాక్షి, ఆంధ్రజ్యోతి, కొన్ని ప్రభుత్వ శాఖలు కూడా వాతలు పెట్టుకుంటున్నయ్, అది వేరే కథ… కానీ క్షుద్ర అనువాదాలు ఎక్కడ కనిపించినా ఈనాడే గుర్తొస్తుంది… అది ఈనాడు సాధించిన విజయం… చివరకు పేర్లను కూడా అనువదించే స్థితికి కొన్నిసార్లు ఈనాడు దిగజారిపోతోంది… ఉదాహరణకు ఆర్టీసీ… అంటే రోడ్డు రవాణా సంస్థ అని రాస్తాం… కానీ దాని పేరే ఆర్టీసీ… ఏడుకొండలు అనే పదాన్ని సెవెన్ హిల్స్ అని ఇంగ్లిషులోకి అనువదించడం ఎంత హాస్యాస్పదమో ఇవీ అంతే…
ఇవన్నీ ఎందుకు గుర్తొచ్చాయీ అంటే… గీతం డీమ్డ్ వర్శిటీ ప్రెస్‌నోట్‌ను దురదృష్టవశాత్తూ చదవాల్సి రావడంతో..! సదరు యూనివర్శిటీ ఒక నోట్ పంపించింది… క్షుద్ర అనువాదాలు కాదు, ఇవి మరీ కాష్మోరా టైపు… ఉదాహరణకు ఆ నోట్ హెడింగ్ ఏమిటో తెలుసా..? ‘గతంలో విజయవంతంగా ముగిసిన కార్యశాల’… ఈ కార్యశాల పదం ఓసారి ఈనాడులో చదివినట్టు గుర్తు… జుత్తు పీక్కోకండి… వర్క్ షాపుకు వచ్చిన అవస్థ ఇది…
Ads
మిగతాచోట్ల ఏమిటో తెలియదు కానీ… తెలంగాణలో కార్యం అంటే శోభనం… కార్యశాల అని రాస్తే శోభనం జరిగే గది అనుకోవాలా..? మీ దుంపతెగ, ఇవెక్కడి అనువాదాలురా భయ్… పోనీ, తెలుగులో మంచి పత్రికా ప్రకటన (ప్రెస్ నోట్) పంపిస్తే మంచిదే అనుకుంటే… ఆ నోట్‌లో కనీసం నూటాయాభై ఇంగ్లిష్ పదాలున్నయ్… సో, అన్నింటీకీ తెలుగీకరణ సాధ్యం కాదు, వాటిని అలాగే సంబోధించాలి… వర్క్ షాపు అంటే వర్క్ షాపే… దానికి కార్యశాల అని గానీ, కార్యస్థలం అని గానీ… మరీ కార్య దుకాణం అని గానీ రాయడం సరైనది కాదు…
అసలు డీమ్డ్ వర్శిటీని తెలుగీకరించాకే, మిగతా పదాల అనువాదం స్టార్ట్ చేస్తే బాగుండేది… ప్రెస్ రిలీజ్ అని ఇంగ్లిషు లిపిలోనే స్టార్ట్ చేసిన ఈ నోట్ మొదటి మూడునాలుగు వాక్యాల చిన్నపేరాలోనే… వర్క్ షాపు,… డీమ్డ్ విశ్వవిద్యాలయం, ప్రెస్ రిలీజ్, ఆర్ ప్రోగ్రామింగ్ అండ్ పైథాన్ షిషన్ ల్యాబ్స్, సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్, కంప్యూటర్స్ అండ్ సైన్స్ ఇంజనీరింగ్, డ్యాష్ బోర్డు భావన, ఆర్ ప్రోగ్రామింగ్ వంటి పదాలు బోలెడు… ఈ డ్యాష్ బోర్డు భావన అంటే ఏమిటో అస్సలు అర్థం కాలేదు… పైగా రియల్ టైమ్ అంటే వాస్తవ ప్రాజెక్టు అట… యోగ్యతాభివృద్ధి విభాగం అంటే ఏమిటో తెలియదు… రాస్తే మొత్తం తెలుగులో రాయాలి, అది సాధ్యం కాదు కాబట్టి అలవాటైన ఇంగ్లిషు పదాల్ని అలాగే ఉంచేయాలి… రైలును రైలు అనే రాయాలి, ధూమశకటం అని ఊపిరాడని పొగ భాష వాడొద్దు… ఐనా అవన్నీ తెలిస్తే అది గీతం ఎందుకవుతుంది..?!
Share this Article