మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబులో సినిమా రివ్యూలు రాసేవాళ్లపై మండిపడే సినిమావాళ్లలో వరలక్ష్మీ శరత్‌కుమార్ మొదటిదీ కాదు, చివరి వ్యక్తి కూడా కాబోదు… అసలే పాపులర్ నటికి పుట్టిన బిడ్డ… బార్న్ విత్ గోల్డెన్ స్పూన్… ఓ సెలబ్రిటీ పిల్లగానే పెరిగింది… సినిమాల్లో ఎంట్రీ కూడా శరత్‌కుమార్ బిడ్డగానే సులభంగా దొరికబట్టుకుంది… అఫ్‌కోర్స్, తను కష్టపడి నిలబడింది… కానీ మనిషిలోని అహం, సెలబ్రిటీ పిల్లగా పెరిగిన తాలూకు పొగరు ఇంకా అలాగే ఉన్నట్టున్నయ్…
అందుకే రివ్యూలు రాసేవాడికి కూడా ఓ బ్యాక్ గ్రౌండ్ ఉండాలని రుసరుసలాడుతోంది… అనగనగా ఓ అతిథి అని తెలుగులో ఓ సినిమా అనామకంగా వచ్చిపోయింది… ఎవరికీ గుర్తు కూడా లేదు… దానికి తమిళంలో కొండ్రల్ పావమ్ అంటూ రీమేక్ చేశారు… అందులో ఈమె నటించింది… ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రివ్యూయర్లపై భగ్గుమంది… ఆమె ఏమంటున్నదీ అంటే…
Ads
‘‘రివ్యూలు చెప్పేవాడికి కూడా ఓ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి… అసలు మీరెవరు సినిమాల్ని రివ్యూ చేయడానికి..? సినిమాలో అది బాగాలేదు, ఇది బాగాలేదు, అసలు సందేశమే లేదు… అంటూ ఏదేదో రాసేస్తున్నారు… సినిమా రిలీజ్ కాగానే ఇవన్నీ రెడీ అయిపోతాయి… అసలు మీరు సినిమా నుంచి ఏమాశిస్తున్నారు..? మొదట్లో సినిమాను వినోదం కోసం చూసేవాళ్లు… కానీ ఇప్పుడు ఎంజాయ్ చేయడం మానేసి, ఇష్టం వచ్చినట్టు రాయడం ఏమిటి..? నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు… సోషల్ మీడియా రివ్యూలు మరీ అర్థంపర్థం లేకుండా ఉంటున్నాయి… సినిమా హిట్టో ఫ్లాపో చెప్పడానికి మీరెవరు..? అది బాగుందో లేదో ప్రేక్షకుడినే చెప్పనివ్వండి… కలెక్షన్లపైనా ఎవరెవరో వాగ్వాదాలకు దిగుతున్నారు, ఇవన్నీ దేనికి..? చిన్న జీవితం, ఎంచక్కా ఎంజాయ్ చేయండి’’
అమ్మా తల్లీ, వరలక్ష్మీ… నువ్వు మార్కెట్లోకి ఓ సరుకు రిలీజ్ చేస్తున్నావు… దాన్ని అమ్ముకుని వందల కోట్లు కుమ్మేస్తున్నావు… ఇది ఓ దందా… అంతే తప్ప చారిటీ కాదు… మార్కెట్‌లోకి అమ్మకానికి వచ్చిన ఓ వినోద సరుకు బాగుంటే బాగుందని అంటారు, లేకపోతే లేదని చెబుతారు… పైగా రివ్యూయర్లు కూడా మొదటి ప్రేక్షకులే గానీ సినిమాలు చూడకుండా ఎవరూ రాయడం లేదు… డబ్బిచ్చి ఓ సరుకును కొన్నవాడు బాగుందో లేదో, ఎందుకు బాగుందో ఎందుకు బాగాలేదో చెబుతాడు… తప్పేముంది..?
బ్యాక్ గ్రౌండ్ అంటే ఏమిటి..? రివ్యూ చేసేవాడు సినిమావాడై ఉండాలా..? సినిమా నేపథ్యమున్న కుటుంబంలో పుట్టి ఉండాలా..? ఎస్, ఒక హోటల్‌కు వెళ్లి వందల బిల్లు చెల్లిస్తూ బిర్యానీ ఆర్డరిచ్చి తినేవాడు… చెబుతాడు, మసాలా ఎక్కువైతే చెబుతాడు… ఉప్పు తక్కువై గడ్డిలా ఉంటే గడ్డిపెడతాడు… పెట్టింది తిని, చేతులు మూతులు కడుక్కుని రాడు… బాగుంటే వెయిటర్‌కు కాస్త టిప్ ఎక్కువే ఇస్తాడు… ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టే సినిమా నాణ్యత ఎంతో, దర్శకనిర్మాతల ఇకారాలు ఏమిటో ప్రేక్షకులకు, పాఠకులకు తెలిసిపోతోంది… అందుకేనా ఈ ఉడుకుమోత్తనం… నువ్వింకా మెచ్యూర్డ్ అనుకున్నాం కదా వరలక్ష్మీ…’’
Share this Article