నేనయితే నమ్మడం లేదు… ఉగ్ర భీకరమైన ఎల్‌టీటీఈ స్థాపించి, కొన్నేళ్లపాటు ప్రత్యేక దేశం కోసం శ్రీలంకను అల్లకల్లోలం చేసిన ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడంటే ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ నాయకుడు నెడుమారన్ తాజాగా చేసిన ప్రకటన కలకలం సృష్టిస్తోంది… అంతేకాదు, త్వరలోనే ఆయన బయటికి వచ్చి ఈలం తమిళల కోసం ఓ కీలక ప్రకటన చేయబోతున్నాడనీ చెప్పాడు… తంజావూరులోని ముల్లివెక్కల్ మెమోరియల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాల్ని వెల్లడించాడు… తను కూడా కేఏపాల్ టైపా, లేకపోతే ఏమైనా క్రెడిబులిటీ ఉందా..?
కన్నడ రాజకుమార్‌ను వీరప్పన్ కిడ్నాప్ చేసినప్పుడు… సంప్రదింపుల కోసం ఇద్దరు సీఎంల కోరిక మేరకు ఒక టీం అడవుల్లోకి వెళ్లింది, అందులో నెడుమారన్ కూడా ఉన్నాడు… మొదటి నుంచీ తమిళ ఈలం సపోర్టర్, జాఫ్నాలో తమిళల కోసం విరాళాలు, ఆహారం, దుస్తులు, మందులు సేకరించాడు… వాటిని తీసుకుపోవడానికి రెడ్‌క్రాస్ కూడా సిద్ధమైంది… కానీ భారత ప్రభుత్వం నో అని చెప్పింది… 1985లోనే ఈలం ప్రాంతాల్లో రహస్యంగా పర్యటించి, శ్రీలంక సైనికుల అకృత్యాలను వీడియో తీశాడు… ప్రపంచమంతా వాటిని చూపిస్తూ పర్యటించాడు… హార్డ్ కోర్ సపోర్టర్…
ఈయన వయస్సు ఇప్పుడు 89… మొదట్లో కాంగ్రెస్‌లో ఉండేవాడు, చాలాకాలం క్రితమే ఆ పార్టీని విడిచిపెట్టాడు… అటువైపు ఓసారి చూద్దాం… శ్రీలంక సమైక్యతకు ఓ పెద్ద థ్రెట్‌లా మారిన ప్రభాకరన్‌ను హతమార్చడానికి ఆ ప్రభుత్వం కోవర్ట్ ఆపరేషన్లు ఎన్నో నిర్వహించింది… ఒకసారి ఫలించింది, తరువాత టైగర్లను ఏరిపారేసింది… ఒక్కొక్కరినీ వెతికి, వేటాడి మరీ హతమార్చింది… అంతేనా..? ప్రభాకరన్ కొడుకు దొరికితే కూడా ప్రభాకరన్ ఆనవాళ్లు కూడా ఉండొద్దనే కసితో పాపం ఆ పిల్లాడినీ తుపాకిగుళ్లకు బలిచేసింది శ్రీలంక ప్రభుత్వం…
Ads
మరోవైపు రాజీవ్‌గాంధీ హత్య తరువాత… టైగర్లకు సేఫ్ డెన్‌గా ఉంటూే వస్తున్న ఇండియా కూడా వాళ్లకు వ్యతిరేకమైపోయింది… డీఎంకే సపోర్టు ఉన్నా సరే, టైగర్ల సానుభూతిపరులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది… శ్రీలంకలో కూడా టైగర్ల నెట్‌వర్క్ మొత్తాన్ని తుడిచిపెట్టేశారు… ఈలంలో శ్రీలంక సైనికులు తమిళ మహిళలతో పండుగ చేసుకున్నారు… ఈ స్థితిలో ప్రభాకరన్ గనుక వేరే దేశం పారిపోయి ఉంటే బతికి ఉండే చాన్స్ ఉంది… నాన్సెన్స్ అని కొట్టిపారేయలేం… ప్రభాకరన్‌కు పారిపోయే అవకాశాలు కూడా అప్పట్లో తక్కువే… యుద్ధక్షేత్రం విడిచి పారిపోయే పిరికిరక్తం కూడా కాదు తనది…
ఇదంతా జరిగి 14 ఏళ్లయింది, బతికే ఉంటే ప్రభాకర్ వయస్సు కూడా 68 దాటి ఉంటుంది… ఈ వయస్సులో కేడర్ మొత్తం హతమైన స్థితిలో తిరిగి ఈలం ఉద్యమపతాక ఎగరేయడం కష్టం… ఇప్పుడు ఇండియా సపోర్ట్ ఉండదు, ఉగ్రవాద నిర్మూలన పేరిట అంతర్జాతీయ సమాజం కూడా సహకరించదు… శ్రీలంక కూడా ఈసారి ఉపేక్షించదు, మొదట్లోనే మళ్లీ అణిచివేస్తుంది… కానీ నెడుమారన్ అనేదేమిటంటే… తీవ్ర సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రభుత్వం బలంగా లేదనీ, ప్రభాకరన్ ఇదే అదునైన సమయమంటూ రాబోతున్నాడు, కుటుంబసభ్యులతో కూడా టచ్‌లో ఉన్నాడు అని..!
‘‘ప్రభాకరన్‌కు ఈలం తమిళులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులు సంపూర్ణ మద్దతు పలకాలి… తమిళనాడు ప్రభుత్వం, తమిళ రాజకీయ పార్టీలు, తమిళనాడు ప్రజలు తోడుగా నిలవాలి…’’ అంటున్నాడు నెడుమారన్… మరి ప్రభాకరన్ ముళ్లైతీవు ప్రాంతంలో మరణించినట్టు శ్రీలంక ప్రభుత్వం 2009 మే నెలలో విడుదల చేసిన ఫోటో ఎవరిది..? ఇంతకీ ప్రభాకరన్ ఎక్కడున్నాడు..? ఈ నెడుమారన్ మీద ఇప్పుడిక కేంద్ర ప్రభుత్వ నిఘా, ఆరా పెరుగుతుంది… ఎక్కడెక్కడో ఉన్న ప్రభాకరన్ కుటుంబసభ్యులనూ కార్నర్ చేయడం ఖాయం… అసలే ఖలిస్థాన్ భూతం భయపెడుతున్న నేపథ్యంలో ప్రభాకరన్ అనే దెయ్యం పునరుజ్జీవాన్ని కేంద్ర ప్రభుత్వం సహించే స్థితి లేదు…!!
Share this Article