Hampi- Pampa Virupaksha:
“పంపా విరూపాక్ష బహు జటాజూటి కా
రగ్వధ ప్రసవ సౌరభ్యములకు
తుంగభద్రా సముత్తుంగ వీచీ ఘటా
గంభీర ఘుమఘుమారంభములకు
కళసాపుర ప్రాంత కదళీ వనాంతర
ద్రాక్షా లతా ఫల స్తబకములకు
కర్ణాట కామినీ కర్ణ హాటక రత్న
తాటంక యుగ ధాళధళ్యములకు
నిర్నిబంధ నిబంధమై నెనయు కవిత
తెలుగునను సంస్కృతంబున పలుకనేర్తు
ప్రౌఢదేవేంద్ర రాయ భూపాలవరుని
సమ్ముఖమ్మున దయ చూడు ముమ్మసుకవి”
“నిగనిగలాడు సోయగము నాదేకాని
నీలిమబ్బులకు రానేర దనుచు;
గబగబ నడచు లాఘవము నాదేకాని
తెలిమబ్బులకు వట్టిదే యటంచు;
తళతళలాడెడు తళ్కు నాదేకాని
మబ్బు దివ్వెల నుత్తమాట యనుచు;
జిలు జిల్లు మనిపించు చలువ నాదేకాని
వర్షాభ్రముల రిత్తవాక్య మనుచు;
సొగసులో పారుదలలోన చుట్టుపట్ల
చిందు శిఖరములలోన జీవనములలోన పంపాస్రవంతిక సానువులను
వ్రేలు మేఘప్రవాహాల నేలుకొనును”
మొదటి పద్యం శ్రీనాథుడి చాటువు. తుంగభద్ర ఒడ్డున పంపా విరూపాక్షుడి జటాజూటం స్పర్శతో పులకించి పూచే పూలతో, తుంగభద్ర అలల గలగలల గాంభీర్యంతో, కళసాపుర ప్రాంతంలో పండే అరటి, ద్రాక్ష మాధుర్యంతో, కర్ణాటక పడుచు చెవి కమ్మల నిగనిగలతో పోటీపడి నేను తెలుగు, సంస్కృతంలో కవిత్వం చెప్తాను. ప్రౌఢ దేవరాయలుకు నా విషయం కాస్త చెప్పి ఆయన అపాయింట్ మెంట్ ఇప్పించు నాయనా! ముమ్మకవీ!
Ads
రెండోది కొడాలి వెంకటసుబ్బారావు హంపీ క్షేత్రం ప్రారంభంలోనిది. తుంగభద్ర తన గురించి తానే చెప్పుకుంటోంది. నిగనిగలాడే నా నీటి అందం నీలి మబ్బులకు వస్తుందా? గబగబా నడిచే నా నడకల హొయలు తెలిమబ్బులకు వస్తుందా? తళతళలాడే నా తళుకు నింగిలో నక్షత్రాలకు ఉంటుందా? జిల్లుమనిపించే నా చల్లదనం మేఘాలకు ఉత్తమాటే కదా? నా సొగసు, పరుగు, నేను చల్లే చిరు జల్లులతో పంపా తీరం కొండాకోనలు మురిసిపోతూ ఉంటాయి. మేఘ ప్రవాహాల గొడుగు నీడలో నేను ప్రవహించే రారాజును.
విజయనగర సామ్రాజ్యం అంకురార్పణకు, దాని సుస్థిరతకు ప్రత్యక్షంగా తెలుగువారి పౌరోహిత్యం, మార్గదర్శనం, నాయకత్వం, తెగింపు ఉన్నాయి. వేటకుక్కల వెంటపడి తరుముతున్న కుందేళ్ల తెగువను చూసి ఆ నేల మీద- ప్రస్తుత హంపిలో 1336లో విజయనగర సామ్రాజ్యానికి ముహూర్తం పెట్టిన విద్యారణ్యస్వామి మన వరంగల్ ప్రాంతవాసి. “కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య” అని విద్యారణ్యుడికి బిరుదు.
ఢిల్లీ సుల్తానుల బందీ నుండి బయటపడి దక్షిణాపథంలో మూడు, నాలుగు శతాబ్దాల పాటు నిలిచి వెలిగిన విజయనగర మహా సామ్రాజ్యానికి శ్రీకారం చుట్టిన హరి హర, బుక్కరాయలు కూడా వరంగల్ వారే. “మా గురువు విద్యారణ్యుడు నాలుగు ముఖాలు లేని బ్రహ్మ; మూడు కన్నులు లేని శివుడు; నాలుగు చేతులు లేని విష్ణువు” అని హరిహర బుక్కరాయలు పొంగిపోయి చెప్పుకునేవారట.
తుంగ- భద్ర రెండు వేరు వేరు నదులు. కొంత దూరం విడి విడిగా ప్రయాణించి ఒక చోట కలిసి తుంగభద్ర ఒకటిగా మారిపోతాయి. ఆపై మరికొంత దూరం ప్రయాణించి తెలంగాణ ఒడిలో కృష్ణలో కలిసిపోతుంది తుంగభద్ర. కృష్ణలో కలవడానికి ముందు దాదాపు వంద చిన్న చిన్న పాయలు తుంగ, భద్రలో కలుస్తాయి. రామాయణ కాలంలో ప్రస్తుత హంపీ తుంగభద్ర తీరం పేరు పంపా అని ఇక్కడివారి నిర్ణయం. అందుకు రుజువుగా ఇప్పటికీ ఇక్కడ కిష్కింధ, హనుమ జన్మస్థలం అంజనాద్రి(హనుమంతహళ్లి), వాలి గుహ, ఋష్యమూక పర్వతం, మాల్యవంత పర్వతం, మాతంగ మహర్షి పర్వతం, రాముడికి శబరి పళ్ళిచ్చిన చోట్లు దర్శనీయ స్థలాలు. ఆయా ప్రాంతాల్లో విడివిడిగా గుడిగోపురాలు కూడా ఉన్నాయి.
పంపా మాట కాలప్రవాహంలో హంపా అయ్యింది. తెలుగు ‘ప’ కన్నడలో ‘హ’ అవుతుంది. పాలు- హాలు; పాడు- హాడు. ఆ హంపా కాస్త హంపీ అయ్యింది. విజయనగరం, హంపీ, హొస్పేట ఇప్పుడు అంతా ఒకటే. అయిదారు వందల ఏళ్ల తెలుగు, కన్నడ, సంస్కృత సాహిత్యంలో పంపా అన్న మాటను ఇక్కడి తుంగభద్ర తీరానికి పర్యాయపదంగానే వాడారు కాబట్టి తుంగభద్ర- పంపా ఒకటే. ఈ ప్రాంతంలో తుంగభద్ర జలాలతో ఏర్పడిన పెద్ద సరోవరాన్ని పంపా సరోవరమని అనాదిగా పేర్కొనడాన్ని గాడిచర్ల హరిసర్వోత్తమ రావు కూడా ప్రస్తావించారు. పంపా సరోవరం పక్కన వెలిశాడు కాబట్టి పంపా విరుపాక్షుడు అయ్యాడు.
త్రేతాయుగం నాటినుండే ఇది తీర్థం, క్షేత్రం. కాబట్టే విద్యారణ్యుడు ఈ ప్రాంతాన్ని కొత్త రాజ్యం ఏర్పాటుకు ఎంపిక చేసుకున్నాడు. ఆ రాజధాని విస్తరణలో విద్యారణ్యుడికి గుర్తుగా “విద్యానగరం” అయ్యింది. వేట కుక్కల వెంటపడి తరిమిన కుందేళ్లకు కూడా ఎప్పుడో ఒకప్పుడు అలసట రాక తప్పదు.
తుంగభద్రలో విజయనగర రాజులు కత్తి కడిగితే…చేత్తో బిగించి తిప్పకుండానే కత్తి తనకు తానే శత్రువు కుత్తుక తెగగొట్టి రక్తం తాగుతుంది. తుంగభద్రలో మొసళ్లు పట్టుకుంటే గజేంద్రుడికి మోక్షమిచ్చిన శ్రీ మహా విష్ణువు దిగిరావాల్సిందే. తుంగభద్ర నీళ్లు తాగితే మూగవాడు కూడా కవిత్వం చెప్పాల్సిందే. తుంగభద్ర నీరు తగిలితే రాళ్లు నోళ్లు విప్పి పాటలు పాడాల్సిందే. తుంగభద్ర గాలి తగిలితే రాతి స్తంభాలు గజ్జెకట్టి ఒళ్లు మరిచి నాట్యమాడాల్సిందే.
మన రాతిగుండెలు విప్పి చూస్తే…
తుంగభద్ర ఉత్తుంగ తరంగాల్లో భద్రంగా ఎదిగి పూచిన విజయనగర ప్రభను దాచుకున్న అలనాటి అందాల రాతి గుండెలు కనిపిస్తాయి.
రేపు:-
హంపీ వైభవం-4
“రాయలనాటి రసికత”
-పమిడికాల్వ మధుసూదన్ [ 99890 90018 ]
Share this Article