వినాశ కాలే చైనా బుద్ధి!
———————-
అమెరికా- చైనాల్లో సైనిక శక్తి ఎంత బలంగా ఉన్నా వారి ఆశ తీరదు. ఉన్న శత్రువును ఊహించుకుంటూ, లేని శత్రువు బలం గురించి భ్రమపడుతూ ఇంకా ఇంకా సైనిక బలం, బలగం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తుంటాయి. ప్రయోగాలు చేస్తుంటాయి. కొత్త కొత్త ఆయుధాలను కనిపెడుతుంటాయి.
పచ్చని దేశాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా అగ్గి రాజేయడంలో అమెరికా తరువాతే ఏ దేశమయినా. అమెరికాకు యుద్ధం ఒక మార్కెట్. యుద్ధవాతావరణం, భయం, శత్రువు ఆయుధ బలం గురించి దిగులు సృష్టించగలిగితే ముందు పెద్దరికంగా మధ్యవర్తిత్వం చేయవచ్చు. తరువాత తగువులు పెట్టి తమాషా చూడవచ్చు. ఆపై ఒకరికి తెలియకుండా ఒకరికి పరస్పరం తలపడే రెండు దేశాలకు అమెరికా ఆయుధాలను అమ్ముకోవచ్చు. ఇదో ఆయుధ విషవలయం. గల్ఫ్ లో చమురుబావుల యజమానులు ఆర్థిక స్థితిగతులను శాసించినట్లు- అమెరికాలో ఆయుధ వ్యాపారులు ప్రపంచాన్ని శాసిస్తారు. పైకి అమెరికా ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేనట్లు కనిపిస్తుంది. తరచి చూస్తే ఆయుధ వ్యాపారం అమెరికా ప్రభుత్వమే చేస్తున్నట్లు గుడ్డివాడికి కూడా అర్థమవుతుంది. ఇదో దేవతా వస్త్రం కథ. పేద, నిరుపేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా వేసే ఆయుధాల బిస్కట్ వల.
Ads
అమెరికా కుట్రలు ఏదో ఒక దశలో అమెరికానే బయటపెట్టుకుంటుంది. చైనా అలా కాదు. అక్కడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లీలలు బయటి ప్రపంచానికి తెలియవు. తెలియనివ్వరు. తెలిసిన వారు బతికి బట్టగట్టలేరు. అమెరికాను మించిన సైనిక శక్తితో ప్రపంచం ముందు కండబలంతో నిలబడాలని చైనాకు తహ తహ. అమెరికా కుట్రలను చైనా పసిగట్టగలుగుతుంది. చైనా కుట్రలను అమెరికా కనుక్కోగలుగుతుంది. అది వారి అవసరం. ఆ విషయం మనకనవసరం.
తాజాగా అమెరికా పసిగట్టిన ప్రకారం- చైనాలో సైనికులకు జన్యు మార్పిడి చేసి అపరిమిత శక్తి సంపన్నులయిన కృత్రిమ సైనికులను తయారు చేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయట. ఇప్పటికే కుక్కల మీద విజయవంతంగా ప్రయోగాలు పూర్తయ్యాయట. సులభంగా అర్థం కావడానికి ఇలా అనుకోవచ్చు. మామూలు సైనికుడు యాభై కేజీల బరువు భుజాన మోస్తూ పరుగెత్తగలిగితే- ఈ జన్యు మార్పిడి సైనికుడు రెండు వందల కేజీల బరువు మోస్తూ పరుగెత్తగలడు. మామూలు సైనికుడు నీటిలో రెండు కిలో మీటర్లు ఈదగలిగితే- జన్యు మార్పిడి సైనికుడు ఇరవై కిలో మీటర్లు ఈదగలడు. ఇలా అన్ని పనుల్లో కనీసం నాలుగింతల బలం, శక్తి, సామర్థ్యం పెరుగుతాయట. అంటే ఒక దెబ్బ కొడితే నాలుగు దెబ్బలు తగులుతాయి.
అమెరికా కూడా తక్కువేమీ కాదు. సైనికుల కాలి బూట్లకు కుషన్, స్ప్రింగులు పెడితే కంగారూ జంతువులా ఒక్కో అడుగు నాలుగు మీటర్ల దూరంలో వేస్తూ బుల్లెట్ రైలు కంటే వేగంగా పరుగెత్తే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించబోతోంది. కాకపోతే అమెరికా సాంకేతికంగా అసాధ్యాలను సుసాధ్యం చేయాలనుకుంటోంది. చైనా ఏకంగా బాహుబలిని తలదన్నే మహాబల, అతి బల సైనికులనే కృత్రిమంగా తయారు చేయాలనుకుంటోంది.
చెయ్యండిరా! చెయ్యండి!
బ్రహ్మ దేవుడు సిగ్గుపడి, హర్ట్ అయి, అలిగి… నేను సృష్టి చేయనుగాక చేయను..అనేంతగా ప్రతిసృష్టి చేయండి. వూహాన్ లో మీరు కృత్రిమంగా చేసినట్లు, చేసీ చేయనట్లు, చేయకుండానే అంతా చేసినట్లు ప్రపంచానికి ఇచ్చిన ముళ్ల బంతి బ్రహ్మకే ఊహాతీతంగా ఉంది. నాలుగు తలలు మార్చి మార్చి ఆలోచిస్తున్నా మీరెలా ఏమార్చారో ఆయనకే తెలియక నాలుగు తలలు కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు కృత్రిమ జన్యు మార్పిడి సైనికులట! వినాశ కాలే విపరీత బుద్ధి. సర్వనాశ కాలే చైనా బుద్ధి!…… By…. పమిడికాల్వ మధుసూదన్
Share this Article