ప్రేమికుల దినం… కానుకలు ఇచ్చుకుంటారు… పూలు, ఉత్తరాలు, గ్రీటింగ్స్, డిన్నర్లు తదిరాలతో ప్రేమను వ్యక్తీకరించుకుంటారు ప్రేమికులు… ప్రపంచమంతా ఇదే వరుస… చాలా ప్రేమలు పెళ్లికి ముందే వాడిపోతాయి… కొన్ని పెళ్లి దాకా సాగుతాయి, పెళ్లయ్యాక కొన్నాళ్లకు మాడిపోతాయి… కొన్నిమాత్రమే అలాగే కొనసాగుతాయి… ఇది ప్రేమ గురించి…
మరి పెళ్లి తరువాత ప్రేమ..? అది ముఖ్యమైంది… పెళ్లయ్యాక దంపతుల మధ్య ప్రేమలు కూడా కుటుంబ సమస్యలు, ఇతరత్రా వెతలతో మసకబారిపోతాయి… మరి దంపతుల్లో ఒకరి మరణం తరువాత..? కొందరు త్వరగా మరిచిపోతారు, కొందరు మళ్లీ పెళ్లిచేసుకుని పాత జ్ఞాపకాల్ని పాతరేస్తారు… రకరకాలు… ఇప్పుడు నేను చెప్పబోయేది అజరామరం… మనం వినిఉండం… అందుకే చదువుదాం ఓసారి… ఎందుకంటే..? ప్రేమ అంటే కేవలం రొమాన్స్, శృంగారం మాత్రమే కాదు… అదొక అనిర్వచనీయ, అద్వితీయ భావన కాబట్టి…
బీహార్‌కు చెందిన భోలానాథ్, పద్మారాణిల ప్రేమ కథ ఇది… ఆమె 1990, మే 25న మరణించింది… ఇది 32 ఏళ్ల క్రితం… భోలానాథ్ ఏం చేశాడంటే..? భార్య అస్థికల్ని ఓ కలశంలో పెట్టి, సిపాహి తోలాలోని తన ఇంట్లో ఉన్న మామిడిచెట్టుకు వేలాడదీశాడు… అక్కడ ఆమె ఉనికి, తన జ్ఞాపకం… ప్రతిరోజూ ఆ కలశం దగ్గరకు వెళ్లేవాడు… ఒక గులాబీ పువ్వును అక్కడ పెట్టేవాడు… అగర్‌బత్తీలు వెలిగించేవాడు… వంగి దండం పెట్టేవాడు… ఆమెను తలుచుకునేవాడు… ఆ తరువాతే తన నిత్య వ్యవహారాల్లోకి వెళ్లిపోయేవాడు…
Ads
తరచూ చెప్పేవాడు… తను మరణించాక తన చితిపై ఆమె అస్థికలను ఉంచాలనీ, తద్వారా ఒక్కటిగా కలిసి పరలోకాలకు ప్రయాణిస్తామని తన నమ్మకం… ఆయన అల్లుడు అశోక్ సింగ్ తన కోరిక తీర్చాడు… 2022, జూన్ 24న భోలానాథ్ మరణించాడు… ఆమె అస్థికలను ఆయన చితిపై ఉంచి దహనం చేయడమే కాదు… ఆ ఇద్దరి అస్థికలను కలిపి మళ్లీ ఓ కలశంలో నింపి, అదే మామడిచెట్టుకు వేలాడదీశాడు…
‘‘మామ గారి కోరిక భవిష్యత్ తరాలకు ప్రేమ అంటే ఎంత గాఢమైందో చెప్పడానికి ఓ ఉదాహరణ… తన ప్రేమ, భార్య పట్ల కనబరిచిన అంకితభావం నిజంగా ఓ ముఖ్యమైన పాఠం చెబుతున్నట్టుగా ఉంటుంది మాకు… వాళ్లు ఇప్పుడు ఈ లోకంలో లేకపోవచ్చు… కానీ ఆ కలశాన్ని చూసినప్పుడల్లా వాళ్లిద్దరూ మా ఎదుట నిలబడి ఏదో చెబుతున్నట్టే ఉంటుంది… అందుకే మామ గారి కోరికను మేం మరింత విస్తృతం చేశాం, రోజూ చూసుకుంటున్నాం’’ అంటున్నాడు అశోక్ సింగ్… అవును, ఆ కుటుంబసభ్యులు ఇంట్లోకి వెళ్లేటప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఆ కలశానికి ఓ నమస్కారం చేస్తారు… ఆ ప్రేమకథకు గౌరవసూచకంగా…!!
Share this Article