మహాభారతం, రామాయణం రెండు పురాణ గ్రంథాల్లోనూ కనిపించే పాత్రలు చాలానే ఉన్నయ్… వాటిల్లో చాలామందికి తెలియని పేర్లు మయిందా, ద్వివిధ… వీళ్లు వానరులు… కిష్కింధవాసులు… మహాభారతంలో అశ్వినీదేవతల వల్ల జన్మించిన నకుల సహాదేవుల్లాగే వీళ్లు కూడా ఆ దేవతల వరప్రసాదాలు… జాంబవ వద్ద విద్యతోపాటు యుద్ధ మెళకువలను కూడా నేర్చుకుంటారు మయిందా, ద్వివిధ…
ఈ ఇద్దరూ సుగ్రీవుడి సైన్యానికి జంట కమాండర్లుగా వ్యవహరించేవాళ్లు… సీతను వెతకడానికి వెళ్లిన ఒక కీలక వానర బృందానికి అంగదుడు నాయకుడు… అందులో వీళ్లిద్దరూ ఉన్నారు… అంతేకాదు, రామసేతు నిర్మాణానికి పర్యవేక్షకులు వీళ్లే… నలుడు ఇంజనీర్… తరువాత ఇద్దరూ రామరావణ యుద్ధంలో కూడా పాల్గొన్నారు…
यौ तौ पश्यसि तिष्टन्तौ कुमारौ देवरूपिणौ । मैन्दश्च द्विविधश्चैव ताभ्यां नास्ति समो युधि ॥ ब्रह्मणा समनुज्ञातावमृत प्राशिनावुभौ । आशंसेते यथा लन्कामेतौ मर्दितुमोजसा ॥ శుకుడు, శరవణుడు అనే రావణుడి గూఢచారులు వానర సైన్యం వివరాలను రావణుడికి అందిస్తూ చెప్పిన మాటలివి… అంటే మయిందా, ద్వివిధులనే ఇద్దరు చాలు లంకను తుడిచిపెట్టడానికి… ఇద్దరూ యుద్ధంలో ఆరితేరిన రావణుడి సైనికాధికారులు వజ్రముష్టి, ఆశనీప్రభలను వధిస్తారు… తరువాత అయోధ్యను చేరి చాన్నాళ్లు రాముడి సేవలోనే గడుపుతారు…
Ads
తన అవతారాన్ని చాలించేముందు రాముడు వాళ్లిద్దరి ఆయుష్షు ఇంకా కొనసాగే వరమిచ్చి, నేను మళ్లీ అవతరించేదాకా కిష్కింధలోనే ఉంటూ జాంబవ దగ్గర గడపాల్సిందిగా ఆదేశిస్తాడు… కాలం గడుస్తూ ద్వాపరయుగం ప్రవేశిస్తుంది… ఒకసారి పాండవులు అశ్వమేధ యాగం తలపెడతారు… అది కిష్కింధ పరిసరాల్లో చేరగానే పాండవులు, కృష్ణుడి బాంధవ్యం గానీ, కృష్ణుడి అవతారం గురించి గానీ తెలియని మయిందా, ద్వివిధ యాగాశ్వాన్ని బంధిస్తారు…
నకులు, సహదేవుడు, అర్జునుడు కూడా అశ్వాన్ని విడిపించలేక కృష్ణుడిని వేడుకుంటారు… కృష్ణుడు అక్కడికి స్వయంగా వస్తాడు… తనే రాముడి అవతారాన్ని అని చెప్పినా మయిందా, ద్వివిధ పోల్చుకోలేకపోతారు… కోపమొచ్చిన కృష్ణుడు అర్జునుడి గాండీవాన్ని తీసుకుని ఎక్కుపెడతాడు… అప్పుడు రాముడిని ఈ రూపంలో పోల్చుకున్న ఈ ఇద్దరు వానరముఖ్యులు తన కాళ్లపై పడిపోతారు… స్వామీ, ఇక ఈ జీవితం చాలు, చాలిస్తాం అంటారు… కృష్ణుడు తథాస్తు అంటాడు… ఆ ఇద్దరూ అస్త్రసన్యాసం చేస్తారు వెంటనే నకులసహదేవుల బాణాలు వాళ్లను ఇహలోకం నుంచి విముక్తం చేస్తాయి… ఐరనీ ఏమిటంటే… అశ్వినీదేవతల త్రేతాయుగపు బిడ్దల్ని ద్వాపరయుగపు బిడ్డలు హతమార్చడం..!!
అయితే వీరిద్దరి కథ ఒరిజినల్ రామాయణం, భారతాల్లో ఉంటుందా..? ఉండకపోవచ్చు… ఉండని వేల కథలు తరువాత పుట్టుకొచ్చాయి… ఇదీ వాటిల్లో ఒకటి కావచ్చుగాక… కానీ ఆసక్తికరం… రెండు గ్రంథాల్లోనూ ఈ కథ ప్రక్షిప్తం కావడం..! తెలుగులో తక్కువే కానీ ఇతర దక్షిణ భాషల్లో యక్షగానాలు, కథాకాలక్షేపాల్లో వీళ్ల కథ కూడా పాపులరే…! చెప్పనేలేదు కదూ… మయిందా బిడ్డను అంగదుడు పెళ్లిచేసుకుంటాడు… కొడుకు పేరు ధ్రువుడు..!!
Share this Article