Sankar G………. (మొదటి భాగానికి తరువాయి…) 21. జగన్మోహిని, పున్నమినాగు లాంటి చిత్రాలలో నటించిన నటుడు నరసింహరాజు గారికి కూడా ఒకప్పుడు రాజకీయాలంటే ఆసక్తి. నవదేశం పేరుతో ఒక పార్టీని కూడా పెట్టాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు.
22. నటుడు బ్రహ్మానందం అద్భుతమైన చిత్రకారుడు కూడా. ముఖ్యంగా దైవ చిత్రాలను గీయడంలో ఆయనది అందె వేసిన చేయి.
23. నటుడు ఆలీ (పెద్దవాడయ్యాక) సినీ ప్రవేశానికి ముందు ప్రముఖ గాయకులు శ్రీపాద జిత్ మోహన్ మిత్రా గారి బృందంలో మిమిక్రీ కళాకారుడిగా ప్రదర్శనలిచ్చేవాడు
Ads
24. నటుడు గోపీచంద్ తండ్రి ప్రముఖ దర్శకులు టి. కృష్ణ. ఆయనకు విప్లవ భావాలు ఎక్కువ. ఆ భావాలతోనే శాస్త్రీయతతో కూడిన సైంటిఫిక్ విద్యను నేర్పించడం కోసం నిల్ డెస్పరాండం అనే పాఠశాలను ఆయన ప్రారంభించారు. తన పిల్లలను కూడా ఆ స్కూలులోనే చదివించారు. నిల్ డెస్పరాండం అంటే ఫ్రెంచి భాషలో నిరాశ పడద్దు అని అర్థం. ఈ పాఠశాలను ఇప్పటికీ ఒంగోలులో టి. కృష్ణ స్నేహితులు నిర్వహిస్తున్నారు.
25. నటుడు మాదాల రంగారావు తన కెరీర్‌లో మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవశంఖం, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి లాంటి విప్లవ చిత్రాలలో నటించారు. ఆయన తన ప్రతీ సినిమా మీద వచ్చే లాభంలో కొంత స్థానిక కమ్యూనిస్టు కార్యాలయానికి విరాళంగా అందించేవారు.
26. నటుడు రాజేంద్రప్రసాద్ తాను సినిమాలలోకి రాకముందు సిరామిక్ ఇంజనీరింగులో డిప్లమో చేశారు. కొన్నాళ్లు ఆ రంగంలో పనిచేశారు కూడా.
27. హాస్యనటుడు ఏవీయస్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు, అనేక నాటకాలలో నటించారు. తానే స్వయంగా ఓ నాటక సంస్థను స్థాపించారు. దాని పేరు రసమయి. ఈ సంస్థ తరఫున అనేకసార్లు నవరస ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు.
28. విప్లవ సినిమాలతో పాపులర్ అయిన దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తన నిర్మాణ సంస్థకు స్నేహచిత్ర అని పేరు పెట్టడానికి కారణమేమిటో తెలుసా? భారత-రష్యా మైత్రి పటిష్టమవ్వడానికి కమ్యూనిస్టు భావజాలం ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తూ ఆయన ఆ పేరును ఎంచుకున్నారు. భారత-రష్యా స్నేహ కరచాలనమే ఈ బ్యానర్ పై చిహ్నంగా ఉంటుంది.
29. కేరళలో అల్లు అర్జున్‌కి రికార్డు స్థాయిలో ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. ఆయన తెలుగులో నటించిన ప్రతి సినిమా మలయాళంలో కూడా డబ్ అవుతుంది. అక్కడి అభిమానులు ఆయనను మల్లు అర్జున్ పేరుతో పిలుస్తుంటారు.
30. రామ్ పోతినేని అనే నటుడు జగడం, కందిరీగ, ఇస్మార్ట్ శంకర్ లాంటి చిత్రాల ద్వారా పాపులర్ అయ్యాడు. కానీ ఆయన సినీ రంగానికి రాకముందు ఆడయాళం అనే తమిళ షార్టు ఫిల్ములో డ్రగ్స్‌కు బానిసైన యువకుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అవార్డను కూడా పొందింది.
31. నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానించే సాహితీవేత్తలలో గుంటూరు శేషేంద్ర శర్మ ఒకరు. శేషేంద్ర రచించిన ఆధునిక మహాభారతం రీ ప్రింట్‌కు పవన్ ఆర్థిక సహాయం కూడా అందించారు. పవన్ తనను ఈ పుస్తకం ఎంతలా ప్రభావితం చేసిందో కూడా ఈ రీ ప్రింట్ వెర్షనులో తెలిపారు.
31. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం తెలుగు సినిమా కాదు. ఓ హిందీ చిత్రం. అవును.. సీనియర్ ఎన్టీఆర్ తన మనవడిని తొలిసారిగా బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్ ద్వారా బాలనటునిగా ఆ చిత్రసీమకు పరిచయం చేశాడు.
32. మహేష్ బాబు కాలేజీలో చదువుతున్న రోజులలో తనకు అదే కాలేజీకి చెందిన మరో నటుడు విజయ్‌తో క్లోజ్ ఫ్రెండ్‌షిప్ ఉండేది. విజయ్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అనేది మనకు తెలియంది కాదు. అలాగే మహేష్ చెన్నైలోని సెయింట్ బీడే ఆంగ్లో ఇండియన్ స్కూలులో విద్యార్థిగా ఉండేటప్పుడు, నటుడు కార్తి తనకు స్కూల్ మేట్.
33. నటుడు ప్రభాస్ ఖాజీపల్లి రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలోని 1650 ఎకరాల స్థలాన్ని దత్తత తీసుకున్నారు. ఇక్కడి పర్యావరణాన్ని, వన్య మృగాలను సంరక్షించడానికి అయ్యే ఖర్చును తాను భరించనున్నట్లు తెలిపారు. అందుకోసం ప్రభుత్వానికి రూ. 2 కోట్లను అందజేశారు.
34. నటుడు విజయ్ దేవరకొండ సినిమాలలోకి రాకముందే థియేటర్ ఆర్టిస్టుగా రాణించారు. హైదరాబాద్ థియేటర్ సర్క్యూట్ నిర్వహించిన ఎన్నో డ్రామాలలో పాత్రలు పోషించారు. సూత్రధార్ అనే నాటక సమాజం నిర్వహించే వర్క్ షాపులలో కూడా పాల్గొనేవారు.
35. హృదయ కాలేయం అనే స్ఫూప్ కామెడీ చిత్రంతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన సంపూర్ణేశ్ బాబు, తాను ఈ రంగంలోకి రాకముందు తన పల్లెటూరులో స్వర్ణకారుడిగా పనిచేశారు. ముడి బంగారాన్ని సేకరించి తన షాపులో ఆభరణాలు తయారుచేసేవారు…
Share this Article