సరమా… రామాయణంలో ఓ విశిష్ట పాత్ర… రావణుడు ఎత్తుకొచ్చి, అశోకవనంలో బందీగా ఉంచిన సీత పట్ల, రావణుడిని ఖాతరు చేయకుండా తమ అభిమానాన్ని చాటినవాళ్లు ఇద్దరు… ఒకరు సరమా, రెండు ఆమె బిడ్డ త్రిజట… సరమా ఎవరో కాదు, విభీషణుడి భార్య… ఆమె రాక్షస మహిళ కాదు, మానస సరపరం ప్రాంతాల్లో జన్మించిన ఓ గంధర్వ జాతి బిడ్డ… తన తమ్ముడి కోసం రావణుడే ఆమెను ఎత్తుకొచ్చి పెళ్లి చేస్తాడు…
రావణుడంటే ఆమెకు కోపం… కానీ విభీషణుడితో బాగానే ఉంటుంది… సీతను ఎత్తుకువచ్చాక, అక్కడ రావణుడు తమ మహిళా సైన్యంలో కీలక సభ్యురాలు త్రిజటను కాపలా పెడతాడు… ఆమె తల్లికి సీత గురించి చెబుతుంది… తల్లి సరమా మాత్రం సీతను పీడించవద్దని, వేధించవద్దని సలహా ఇస్తుంది… తను అశోకవనానికి వెళ్లి సీతను ఊరిస్తుంది… తనెవరో పరిచయం చేసుకుంటుంది… అప్పటికే త్రిజట గుణం తెలిసిన సీత సరమాను కూడా నమ్ముతుంది…
ఓసారి రావణుడు ఓ ఫేక్ తలను తీసుకొచ్చి సీత ముందు పడేస్తాడు… రాముడి తల నరికేశానని, ఇక నువ్వు వచ్చి నా అంతఃపురంలో చేరాల్సిందేనని హూంకరిస్తాడు… సీత నిర్ఘాంతపోతుంది మొదట… కానీ చెట్టు చాటు నుంచి సరమా ‘నమ్మాల్సిన పనిలేదు’ అన్నట్టుగా సైగ చేస్తుంది… రావణుడు వెళ్లిపోగానే సరమా వెళ్లి సీతను ఊరడిస్తుంది… రావణుడి మాయోపాయం గురించి వివరిస్తుంది…
Ads
హనుమంతుడు వచ్చినప్పుడు కూడా సీత తనతో చెబుతుంది… తన పట్ల త్రిజట, విభీషణుడి భార్య ఆదరంగా ఉంటున్నారని..! లంకాదహనం జరిగాక, హనుమంతుడే కాలబెట్టి పోయాడని సీతకు చెప్పేది సరమాయే… సుగ్రీవుడి సైన్యంతో కలిసి రాముడు రావణుడి మీదకు యుద్ధానికి వస్తున్న సంగతులు కూడా ఎప్పటికప్పుడు సీతకు చెబుతూ ధైర్యాన్ని నింపుతూ ఉంటుంది… తన భర్తను రాముడి శిబిరానికి మారాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చింది కూడా సరమాయే…
‘‘రాముడు లంకకు వచ్చాడు, నేను నా కళ్లతో స్వయంగా చూశాను… యుద్ధానికి మొత్తం రంగం సిద్ధమైంది’’ అని సీతకు చెబుతుంది… యుద్ధానంతరం విభీషణుడు రాజవుతాడు… సరమా పట్టమహిషి అవుతుంది… త్రిజటను తన వెంట రావల్సిందిగా సీత కోరుతుంది… కానీ సరమా వారిస్తుంది… ఇదీ స్థూలంగా రామాయణంలోని సరమా కథ… ఇదీ ఒరిజినల్ రామాయణంలో కనిపించదు… కానీ కొన్ని రామాయణాల్లో ఉంటుంది…
ఉత్తరాదికి చెందిన రామాయణాల్లో సరమా సీతకు చెప్పిన సంగతులను వివరించే అధ్యాయాన్ని ‘సరమ వాక్యం’ అంటారు… రాముడి వెంట పుష్పక విమానంలో అయోధ్యకు విభీషణుడితోపాటు వెళ్లి సరమా, త్రిజట పట్టాభిషేకం వీక్షించి, తిరిగి లంకకు వచ్చేస్తారు…
( ఇవి శ్రీలంకలోని ఫేమస్ ‘లంకతిలక విహార’ గుళ్లో కొలువైన విభీషణుడు, తన భార్య సరమా ప్రతిమలు)….
Share this Article