పార్ధసారధి పోట్లూరి …….. వేదిక : జర్మనీ లోని మ్యూనిచ్‌లోని హోటల్ బేరిస్చర్ హాఫ్ [Hotel Bayerischer Hof in Munich]… ఫిబ్రవరి 17,శుక్రవారం 2023…. మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ [MSC] పేరుతో ప్రతీ సంవత్సరం మ్యూనిచ్ నగరంలో సమావేశాలు జరుగుతూ ఉంటాయి ! ఈ సమావేశాలకి ప్రపంచం నలుమూలల నుండి [రష్యా, చైనా, ఇరాన్, వెనిజులా తప్ప ] రాజకీయ ప్రముఖులు, మిలటరీ అధికారులు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ రోజు నుండి అంటే శుక్రవారం నుండి ఆదివారం వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ సమావేశం ఉంటుంది.
*******************************
ఎవరు ఈ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ స్థాపించారు ?
Ads
1963 లో ఎవాల్డ్-హెన్రిచ్ వాన్ క్లీస్ట్ [Ewald-Heinrich von Kleist] అనే వ్యక్తి జర్మనీలోని మ్యూనిచ్ నగరం కేంద్రంగా MSC అనే NGO స్థాపించాడు. ప్రస్తుతం ఈ MSC కి ఛైర్మన్ గా క్రిస్టోఫ్ హ్యూస్జెన్ [Christoph Heusgen] వ్యవహరిస్తున్నాడు.
MSC అనే NGO లక్ష్యం ఏమిటీ ?
ఎలాంటి సరిహద్దులు లేని నిర్ణయాలని అమలు చేయడమే ! సరిహద్దులు లేని అంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఎలాంటి కార్యక్రమాన్ని అయినా అడ్డుకోవడం, ఎదుర్కోవడం, నిరసనలు తెలపడం, అవసరం అయితే ఆయా దేశాల సహకారంతో బల ప్రయోగం చేయించడం. ఈ పనులకి ప్రజాస్వామ్య విలువలు కాపాడడం అనే ముద్దు పేరుని వాడుకుంటుంది ! సద్దాం హుస్సేన్ కి వ్యతిరేకంగా ముందు ఇరాక్ ప్రజలలో ద్వేషం పెంచింది. అది క్రమంగా హింసకి దారి తీసేలా రెచ్చగొట్టింది, దానిని సద్దాం హుస్సేన్ అణిచివేయడానికి ప్రయత్నిస్తే, అదిగో చూడండి సద్దాం హుస్సేన్ తన స్వంత ప్రజల మీద కాల్పులు జరిపిస్తున్నాడు అంటూ మరింత విద్వేషాన్ని రెచ్చగొట్టింది.., ప్రజలలో ఎవరయితే సద్దాం హుస్సేన్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి డబ్బు, ఆయుధాలు సరఫరా చేసి సద్దాం హుస్సేన్ కి పక్కలో బల్లెం తయారుచేశారు.
ఇదంతా MSC తో పాటు జార్జ్ సోరోస్ కి చెందిన పలు NGO లు కలిసి పనిచేశాయి. సద్దాం హుస్సేన్ ని చంపడానికి ముందస్తు రంగం వీళ్ళు సిద్ధం చేస్తే, తరువాత నాటో దేశాలతో పాటు అమెరికా ఇరాక్ మీద దాడి చేసింది. అంతిమంగా తమ లక్ష్యం నెరవేర్చుకున్నాయి. మొదటి నుండి బిబిసితో పాటు వెస్ట్రన్ మీడియా కూడా సద్దాం హుస్సేన్ కి వ్యతిరేకంగా పనిచేశాయి ! దుష్టుడు చచ్చాడు అనే విధంగా సద్దాం హుస్సేన్ ని ఉరి తీసిన తరువాత హెడ్ లైన్స్ పెట్టి మరీ దుష్ప్రచారం చేశాయి.
ప్రపంచానికి ప్రమాదకరమయిన ‘మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్‘ ని సద్దాం నిల్వ చేశాడానే ప్రచారాన్ని బాగా చేసి, సద్దాంని ఉరి తీసిన తరువాత అవేవీ లేవని చేతులు దులుపుకున్నాయి నాటో అమెరికా దేశాలు ! ఇదంతా మనకి తెలిసిన చరిత్రే ! వీళ్ళ అబద్ధాలకి ఆలంబనగా హాలీవుడ్ సినిమాలు తీసి, అందులో సద్దాం హుస్సేన్ ని విలన్ గా చూపెట్టడం కూడా జరిగింది !
**********************************
ఇంతకీ సద్దాం చేసిన తప్పు ఏమిటీ ?
అమెరికన్ పెట్రో డాలర్ ఆధిపత్యాన్ని ఎదిరించాడు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు కలిసి ఒక ఉమ్మడి కరెన్సీ ని సృష్టించి, ఏ దేశం అయినా క్రూడ్ కొనాలి అంటే డాలర్లకి బదులుగా కొత్త కరెన్సీతో కొనాలనే ప్రతిపాదన చేశాడు బలంగా ! దీనికి లిబియా అధ్యక్షుడు మహమ్మద్ గడ్డాఫీ కూడా బలంగా మద్దతు తెలిపాడు ! మొదట సద్దాం హుస్సేన్, ఆ తరువాత 2011 లో మహమ్మద్ గడ్డాఫీని కూడా ప్రజల చేతే చంపించాయి నాటో అమెరికన్ దేశాలు. పనిలో పనిగా తమ ఆయుధాల పని తీరుని కూడా పరీక్షించుకొని, వాటిని ఇతర దేశాలకి అమ్ముకున్నాయి నాటో అమెరికన్ దేశాలు… నిజానికి రాఫెల్ పని తీరు ఎలాంటిదో 2011 లో లిబియా మీద మొదట దాడి మొదలు పెట్టి తమ సత్తా చాటాయి… కనుకనే మన దేశంతో పాటు ఈజిప్ట్, ఒమన్, ఖతార్ దేశాలు రాఫెల్ ని కొన్నాయి.
నిజానికి సద్దాం హుస్సేన్, మహమ్మద్ గడ్డాఫీ దీర్ఘకాలంగా ఇరాక్, లిబియాలకి అధ్యక్షులుగా ఉన్నారు కానీ నాటో,అమెరికా లు ప్రచారం చేసినంత క్రూరులు కాదు. సద్దాం హుస్సేన్ హయాంలో ప్రజలు బాగానే ఉన్నారు. మహమ్మద్ గడ్డాఫీ హయాంలో లిబియా కూడా బాగుంది. అన్ని దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఎలా అయితే తమ తమ దేశాలలో ఉండే ఉగ్రవాదాన్ని ఎలా అణిచివేస్తారో సద్దాం హుస్సేన్, మహమ్మద్ గడ్డాఫీలు కూడా అదే పని చేశారు. కానీ వీళ్ళు ఇద్దరూ కూడా అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించిన వాళ్ళే ! ఇరాక్ లో కానీ లిబియాలో కానీ అశాంతిని కలగ చేయడం వెనుక ఉన్నది MSC, జార్జ్ సోరోస్ లు, వీళ్ళ NGO లు ! పశ్చిమ దేశాల ప్రయోజనాలకి భంగం కలిగించే ఎలాంటి దేశాన్ని అయినా వీళ్ళు ఇలానే నాశనం చేస్తారు అన్నది గమనార్హం !
********************************
ఈ రోజు మ్యూనిచ్ లో మొదలయిన MSC ఉద్దేశ్యం ప్రధానంగా దేని కోసం ?
ఉక్రెయిన్ కి అధునాతన యుద్ధ విమానాలని ఇవ్వాలి అనే అజెండాతో ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు ఉక్రెయిన్ కి ఇచ్చిన జర్మనీ, అమెరికా ఆర్టీలరీ వేపన్స్ వల్ల ఆశించిన ప్రయోజనం చేకూరలేదు ! రష్యా వీటిని ఎదుర్కుంటూనే వస్తున్నది. అలా అని రష్యా నష్టపోలేదు అన్నది కూడా నిజం కాదు. రష్యా నష్టపోతూనే ఉన్నది కానీ ప్రతిష్టకి పోయి కొనసాగిస్తూ ఉన్నది.
రష్యన్ Mig -29 లు ఇటు రష్యాతో పాటు అటు ఉక్రెయిన్ లో కూడా ఉన్నాయి కానీ రష్యా పోయిన సంవత్సరం కంటే గత రెండు నెలలుగా తన Mig -29 లని అప్ గ్రేడ్ చేస్తూ రావడం వలన ఉక్రేనియన్ MiG-29 లని నాశనం చేస్తూ వచ్చింది. ఇక సుఖోయ్ Su-27 జెట్ ఫైటర్స్ కూడా రెండు దేశాల దగ్గర ఉన్నా రష్యా తన Su-27 ల ని కూడా అప్ గ్రేడ్ చేయడంతో గత రెండు నెలల నుండి పై చేయి సాధిస్తూ వచ్చింది. ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్నది ఉక్రెయిన్…
సోవియట్ విచ్ఛిన్నం జరిగినప్పుడు Mig -29 లు,S u -27 లు భాగ పంపిణీ లో భాగంగా ఉక్రెయిన్ కి ఇవ్వడం జరిగింది, కానీ తరువాత వీటిని అప్ గ్రేడ్ చేయడం ఉక్రెయిన్ వల్ల కాలేదు. కానీ రష్యా మాత్రం Mig -35, Su-30, Su -35 లని డెవలప్ చేసుకుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ దగ్గర Su-30, Su -35 లని ఎదుర్కొనే జెట్ ఫైటర్స్ లేవు. గత మూడు నెలలుగా జెలెన్స్కీ తమకి అమెరికన్ ఫ్రాన్స్ దేశాల అధునాతన జెట్ ఫైటర్స్ ఇవ్వమని అడుతున్నాడు. అమెరికన్ F-16 లేదా F-15 లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు జెలెన్స్కీ. అయితే ఫ్రాన్స్ మాత్రం తన రాఫెల్ లని ఇవ్వడానికి నిరాకరించింది. గత కొంత కాలంగా జో బిడెన్ మంత్రాంగం ఉక్రెయిన్ కి F-16 లు ఇవ్వాలా వద్దా అనే మీమాంసలో ఉంది కానీ అది నేరుగా రష్యాని మరింత రెచ్చగొట్టే చర్యకి తావిచ్చినట్లుగా ఉంటుందని సందేహిస్తున్నది !…
******************************
MSC, జార్జ్ సోరోస్ లు ఈ రోజు జరిగిన సమావేశపు అజెండాలో భాగంగా… ఉక్రెయిన్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం నాటో దేశాలతో పాటు అమెరికా కూడా అధునాతన జెట్ ఫైటర్స్ ని ఉక్రెయిన్ కి ఇవ్వాల్సిందే అని పట్టుపడుతున్నాయి. మరి జార్జ్ సోరోస్ మోడీ మీద విమర్శలు ఎందుకు చేశాడు నేరుగా ? దీని గురించి తెలుసుకోవాలి అంటే ఒక వారం వెనక్కి వెళ్ళి తీరాలి ! భారత్ మీద అమెరికా ఆర్ధిక ఆంక్షలు విధించాలి అని జెలెన్స్కీ డిమాండ్ చేశాడు ! రష్యాతో యుద్ధం వలన పూర్తిగా దివాళా తీసిన ఉక్రెయిన్ కి నామ మాత్రపు అధ్యక్షుడిగా ఉన్న జెలెన్స్కీ భారత్ మీద ఆంక్షలు విధించాలి అనే డిమాండ్ ఎలా చేయగలుగుతాడు? సరిగా ఈ రోజు మొదలయిన MSC కి కంటే వారం క్రితం జెలెన్స్కీ చేత వ్యూహాత్మకంగా ప్రకటన చేయించాడు జార్జ్ సోరోస్ !
******************************
భారత్ మీద ఎందుకు అమెరికా ఆర్ధిక ఆంక్షలు విధించాలి ?
రష్యా నుండి మన దేశం ముడి చమురుని తక్కువ ధరకి కొని, దానిని శుద్ధి చేసి, డీజిల్,పెట్రోల్ మరియు ఇతర పెట్రోలియం ఉత్పత్తులని యూరోపుతో పాటు అమెరికాకి కూడా సరఫరా చేస్తున్నది. ఇదంతా మోడీయే చేస్తున్నాడు అనేది అభియోగం ! పుతిన్, మోడీ కలిసి కుట్ర పన్నుతున్నారు అని జెలెన్స్కీ చేత ప్రకటన చేయించారు. ఇది ప్రారంభం ! ఈ తరహాలోనే ముందు ఇరాక్ మరియు తరువాత లిబియాలో కూడా చేశారు.
*********************************
పాకిస్థాన్ కి పుతిన్ తీవ్ర స్వరంతో హెచ్చరిక చేశాడు!
1990 లో ఉక్రెయిన్ పాకిస్థాన్ కి T-80 UD యుద్ధ టాంకులని అమ్మింది. తరువాతి కాలంలో విడి భాగాలకి సంబంధించి కొన్ని టెక్నాలజీలని ఇచ్చింది ఉక్రెయిన్. పాకిస్థాన్ తమ T-80 UD టాంక్ లకి విడిభాగాలు మరియు దానిలో వాడే షెల్ల్స్ ని కూడా తయారుచేస్తున్నది. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ లో యుద్ధo జరుగుతున్నందు వల్ల షెల్ల్స్ తో పాటు విడిభాగాలు ఉక్రెయిన్ కి సరఫరా చేస్తూ, బదులుగా ఉక్రెయిన్ నుండి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నది.
పుతిన్ ఆల్రెడీ ఉక్రెయిన్ లో ఉన్న యుద్ధ టాంకులు తయారుచేసే ఫాక్టరీలని ధ్వంసం చేశాడు కానీ పాకిస్థాన్ సరఫరా చేస్తున్న విడి భాగాలతో పాటు షెల్స్ ని వాడి మరీ రష్యా మీద ఎదురు దాడికి దిగుతున్నది. దాంతో పుతిన్ పాకిస్థాన్ ని ఉద్దేశించి తీవ్ర హెచ్చరిక చేశాడు. మరో వైపు రష్యా నుండి చవకగా చమురు దిగుమతి చేసుకోవడానికి ఇమ్రాన్ ఉన్నప్పుడే ఒప్పందం జరిగినా అది ఇంకా కార్య రూపం దాల్చలేదు. ఇప్పటికీ పాకిస్థాన్ అడుగుతూనే ఉన్నది తమకి చమురు సరఫరా చేయమని… కానీ ఇంకో వైపు ఉక్రెయిన్ కి T-80 విడి భాగాలు సప్లై చేస్తూనే ఉన్నది. పుతిన్ హెచ్చరిక చేసి వారం రోజులు అవుతున్నది ! అవసరం అనిపిస్తే పుతిన్ పాకిస్థాన్ మీద కూడా దాడి చేయగల మొండి వాడు అన్న సంగతి తెలిసిందే ! (జార్జి సోరోస్ యూరప్ కి చెందిన పెట్టుబడిదారుడు, వితరణశీలిగా పేరు…)
Share this Article