రాబోయే రోజుల్లో ఇక పత్రికల ప్రింట్ ఎడిషన్లు కనిపించడం అరుదైపోతుంది… విపరీతంగా పెరిగిన ముద్రణవ్యయం, పెరిగిన జీతభత్యాల భారం, రవాణా ఖర్చు, పంపిణీ వ్యయం తడిసి మోపెడవుతోంది… ఏవో రాజకీయ అవసరాలున్నవాళ్లు తప్ప కమర్షియల్ కోణంలో ఎవరూ కొత్తగా ప్రింట్ జోలికి వెళ్లే అవకాశాల్లేవు ఇక… పైగా పేపర్ కొని చదివేవాళ్ల సంఖ్య కూడా వేగంగా పడిపోతోంది…
ప్రతి నిమిషమూ వార్తల్ని అప్‌డేట్ చేసే సైట్లున్నాయి… సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తోంది… ఎప్పటికప్పుడు ముఖ్యమైన వార్తల్ని మొబైల్ ఫోన్‌లో చదువుకోవడం అలవాటైపోతుంది… పాచిపోయిన వార్తల్ని తెల్లారి పత్రిక కొని చదివేవాడు ఎవడుంటాడు ఇక రాను రాను…! పైగా పాత్రికేయంలో నాణ్యత దిగజారిపోయి, ఒక్కటంటే ఒక్కటీ చదివించే వార్తలు ఉండటం లేదు… తెలుగులోనైతే మరీ… మొన్నటి ఏబీసీ సర్క్యులేషన్ లెక్కలు తీస్తే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అన్ని పత్రికలదీ దిగువ చూపే…
ఈనాడు ప్రింట్ కొనసాగింపుకు కిందామీదా పడుతోంది… యాడ్స్ టారిఫ్‌ను కూడా అడ్డగోలుగా తగ్గించేసి జమాఖర్చుల నడుమ తేడాను పూడ్చటానికి విశ్వప్రయత్నం చేస్తోంది… మొత్తం ప్రింటింగ్ యూనిట్లు మూసిపారేసి, జిల్లాల్లో ఆఫీసులు షట్ డౌన్ చేసేసి, కేవలం రామోజీ ఫిలిమ్ సిటీ ఆఫీసు మాత్రమే కొనసాగించి… ఇకపై డిజిటల్ ఎడిషన్స్, ఈటీవీ భారత్ మొబైల్ పై దృష్టి పెట్టాలని ఎప్పటికప్పుడు అనుకుంటోంది… కానీ దానికే అది సాధ్యం కావడం లేదు…
Ads
సాక్షికి, నమస్తే తెలంగాణకు వాటి బాసులు డబ్బులు పెడుతూనే ఉన్నారు… పెట్టక తప్పదు… వాళ్లకు రాజకీయ అవసరాలున్నాయి… ఈ స్థితిలో ఆంధ్రజ్యోతి ప్రింట్ మీద కాన్సంట్రేషన్ తగ్గించి, ఇక డిజిటల్ ఎడిషన్లపై దృష్టి కేంద్రీకరిచాలని భావిస్తోంది… ఆల్‌రెడీ ఈ పత్రికలన్నింటికీ వెబ్‌సైట్లున్నాయి… ఈ పేపర్లున్నాయి…
పలు ఇంగ్లిష్ పత్రికలు ప్రింట్ యూనిట్లను మూసేసి, కేవలం డిజిటల్ ఎడిషన్లే నడిపిస్తున్నాయి… అంటే వెబ్‌సైట్లు ప్లస్ ఈ-పేపర్లు… ఆ డిజిటల్ పేపర్లకు కూడా డబ్బు వసూలు చేస్తున్నాయి… కొన్ని వెబ్‌సైట్లలో ఎక్స్‌క్లూజివ్ వార్తలకు రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి… సో, ఆంధ్రజ్యోతి కూడా అదే బాట పట్టబోతోంది… తొలి దశలో హైదరాబాద్, వరంగల్ ఎడిషన్లకు సంబంధించి ప్రయోగం చేయబోతున్నారు… ఈ దిశలో వరంగల్‌లో ఓ సన్నాహక భేటీ కూడా జరిగింది…
దిశ అనే పత్రిక పూర్తిగా డిజిటల్… దానికీ వెబ్ సైటుంది… ఈ పేపర్ ఉంది… అదనంగా డైనమిక్ ఎడిషన్ పేరిట రోజుకు రెండుమూడుసార్లు అవసరాన్ని బట్టి, వార్తల్ని ఒక పేజీలో పెట్టిస్తున్నారు… ఆంధ్రజ్యోతి కూడా రోజూ రెండుమూడు డైనమిక్ ఎడిషన్స్ రిలీజ్ చేయనుంది… వెబ్‌సైట్ మైనస్ పాయింట్ ఏమిటంటే..? బైక్ డీకొని వ్యక్తి మృతి వార్తను, ఫలానా రాష్ట్రంలో కూలిన ప్రభుత్వం, సిరియాలో 70 వేల మందిని మింగిన భూకంపం అనే వార్తలను కూడా సేమ్ పక్కపక్కనే అవే ప్రాధాన్యంతో చదువుకోవాల్సి వస్తోంది… ఈ-పేపర్ అయితే వార్తను బట్టి ప్రజెంటేషన్, పేజీనేషన్ చూపించవచ్చు… ఇతరత్రా ఆంధ్రజ్యోతి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆ డిజిటల్ ఎడిషన్లు స్టార్టయితే కానీ తెలియవు…!!
Share this Article