BT Govinda Reddy…. నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి విషాదకర వార్త వినాల్సి రావచ్చు. కోమాలో ఉన్న ఆయనకు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. మొదటి రోజు నుంచి ఇప్పటి నుంచి ఎటువంటి ఇంప్రూవ్ మెంట్ లేకపోగా ఇన్ ఫెక్షన్ల సమస్య పెరిగినట్టు సమాచారం. సొంతంగా శ్వాస తీసుకోలేని స్థితిలో ఆయనకు ECMO లైఫ్ సపోర్టింగ్ సిస్టంపై చికిత్స అందిస్తున్నారు. ఆర్గాన్ ఫెయిల్యూర్, గుండె కండరాలు పనిచేయపోవడం వల్ల ఎక్మో ద్వారా రక్త ప్రసరణ జరుగుతోంది. డయాలిసిస్ కొనసాగిస్తున్నారు.
బ్రెయిన్ డెడ్ అవడంతో విదేశాల నుంచి రప్పించిన వైద్యులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించడంలేదు. కోలుకునే (రివైవల్) అవకాశాలు లేవని వైద్యులు భావించడంతో లైఫ్ సపోర్టింగ్ సిస్టం తొలగించే విషయమై కుటుంబ సభ్యులతో రేపు 19 నాడు హాస్పిటల్ మేనేజ్ మెంట్ చర్చించనుందని అంటున్నారు. మంచి ఘడియలు చూసి ఎక్మో తొలగిస్తారని సమాచారం. అది లేదా సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లైఫ్ సపోర్టింగ్ వ్యవస్థలు కొనసాగిస్తూ హైదరాబాద్ తరలిస్తారని ఆయన కుటుంబ సభ్యుల్లోని కొందరు అంటున్నా నారాయణ హృదయాలయ ఇవ్వలేని చికిత్స ఇక్కడ దొరుకుతుందని ఆశించలేం.
Ads
కొన్నాళ్లుగా డిప్రెషన్లో ఉన్నాడు తను… నటుడిగా కొనసాగాలనే కోరిక ఉన్నా సినిమా అవకాశాలు లేకపోవడంతో తారకరత్న తీవ్ర డిప్రెషన్లోకి జారిపోయారని ఆయన సన్నిహిత మిత్రులు చెబ్తున్నారు. తీసిన సినిమాలు నడవక పోవడం లాంటివి కూడా మానసికంగా కుంగిపోవడానికి కారణమయ్యాయి. ఆహార నియమాలు నిర్లక్ష్యం చేయడం, వ్యాయామం లాంటివి లేకపోవడంతో బరువు పెరుగడం, చిన్న వయసులో డయాబెటిస్ రావడం, గుండెకు ముప్పు తెచ్చింది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా కుప్పం వెళ్లిన ఆయన అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటు రావడంతో కుప్పకూలారు.
హృదయ స్పందన నిల్చి పోయిన స్థితిలో ఆసుపత్రికి తరలించగా రక్త సరఫరా నిల్చిపోవడం వల్ల మెదడు దెబ్బతిన్నది. మిగిలిన అవయవాల పైనా ప్రభావం పడింది. మొదటి గంటలో (గోల్డెన్ అవర్లో) మెరుగైన చికిత్స అంది ఉంటే ఆలస్యంగా నైనా కోలుకునేవారు. కుప్పం ప్రాంతంలో కార్డియాలజీకి సంబంధించి కార్పోరేట్ వైద్యశాలలు లేకపోవడం దురదృష్టం వెంటాడినట్టయింది. తన ఆరోగ్య స్థితిపై జారీచేసిన హెల్త్ బులెటిన్‌లో కూడా తను చికిత్సకు స్పందించడం లేదనీ, ఇంకా కోమాలోనే ఉన్నాడని డాక్టర్లు చెప్పడం గమనార్హం… అంతా బాగుంటే పిబ్రవరి 22న తారకరత్న 40 వ బర్తడే జరుపుకునేవారు. ఆయనకు తండ్రి మోహనకృష్ణ, తల్లి శాంతి ఉన్నారు. భార్య అలేఖ్యరెడ్డి ప్రఖ్యాత డ్రైస్ డిజైనర్. కూతురు పేరు నిష్క… తాజా అప్‌డేట్ :: తారకరత్న ఈ లోకం నుంచి నిష్క్రమించాడు
Share this Article