ఇంత త్వరగా పోవాల్సినవాడు మాత్రం కాదు… నందమూరి తారకరత్న ఆ కుటుంబంలోని వారికి భిన్నం… వయస్సు కూడా నలభైకి చేరలేదు… మనసులో ఏం వేదన రగిలి మనిషిని కాల్చేసిందో, పీల్చేసిందో గానీ బయటికి మాత్రం అందరితో బాగా ఉండేవాడు… సినిమా రంగంలో ఒకవైపు జూనియర్ గానీ, ఈమధ్య కల్యాణరామ్ గానీ హిట్టవుతూ, తను మాత్రం ఎక్కడేసిన గొంగళి అన్నట్టుగానే ఉండటం ఏమైనా పీడించిందా తనను..?
బాలయ్య తరువాత తరంలో తనను ఎన్టీయార్ నటవారసుడిని చేయాలని ఆ కుటుంబం మొత్తం విశ్వప్రయత్నం చేసింది… ఒకేరోజున 9 సినిమాలను ప్రారంభింపజేశారు… జూనియర్ ఎదగకూడదనే తలంపు అది… తమ పరిచయాలన్నీ ఉపయోగించి అన్ని సినిమాల్ని ఒకేరోజున ప్రారంభింపజేయడం నిజంగా రికార్డే… ప్రపంచంలో ఏ హీరోకూ ఈ రికార్డు లేదు, ఇకపై రాదు…
కానీ వాటిల్లో రెండోమూడో వచ్చినట్టున్నాయి… కొన్ని స్టార్టే కాలేదు… ఐనా తారకరత్న ఎప్పుడూ దానిపై డిప్రెస్ అయినట్టు కనిపించలేదు… తరువాత హీరోగా కూడా పెద్దగా చాన్సులు రాలేదు… బాధపడలేదు… హీరోయేతర పాత్రలూ చేశాడు… ఏదో సినిమాకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు కూడా తీసుకున్నాడు… హీరోయేతర ట్రాక్ మళ్లినందుకు కూడా ఫీలైంది లేదు… 20 సంవత్సరాల పీరియడ్‌లో తను చేసింది కేవలం 22 సినిమాలు… ప్రేక్షకులు ఎందుకో తనను యాక్సెప్ట్ చేయలేదు… ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు, ఏదో వెబ్ సీరీస్ కూడా చేశాడు…
Ads
తను ప్రేమికుడు, పెద్దల అభీష్టానికి, ఆంక్షలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నాడు… భార్య అలేఖ్యారెడ్డి రాజకీయ కుటుంబానికి చెందిన మహిళ… ఒక కూతురు, పేరు నిష్క… తను ఎన్టీయార్ కొడుకు మోహనకృష్ణ కొడుకు… పెద్దగా కెరీర్ గురించి సీరియస్‌గా ఆలోచించి బాధపడ్డట్టు అనిపించలేదు కానీ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఆలోచన మాత్రం కొత్తగా తనలో స్టార్టయిందట…
అందుకే లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున కుప్పంలో తనతోపాటు పాల్గొన్నాడు… అక్కడే కుప్పకూలాడు… నిజానికి అక్కడే తన పరిస్థితి విషమించి, ఇక కోలుకోలేని స్థితికి చేరుకున్నాడు… అప్పుడే ప్రకటిస్తే లోకేష్ పాదయాత్రకు అపశకునం అనే భావనతో ఇన్నాళ్లూ చెప్పలేదనే ప్రచారం కూడా జరిగింది… తనకు గోల్డెన్ అవర్‌లో గనుక మంచి చికిత్స జరిగి ఉంటే ఫలితం ఉండేదేమో… అప్పటికే బ్రెయిన్ దెబ్బతినడంతో ఇన్నాళ్లూ ఎక్మో మీద ఉంచారు తనను…
ఈ ఎక్మో బాలసుబ్రహ్మణ్యాన్ని ఎలా బలిగొన్నదో చూశాం కదా… ఒక లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్‌గా వాడుతున్నారు దాన్ని… జరగాల్సిన డ్యామేజీ బాగా జరిగాక బెంగుళూరులో హృదయాలయకు తరలించారు… విదేశాల నుంచి వైద్యులను రప్పించారు… కానీ మొదటి రోజు నుంచే డాక్టర్లు తన పరిస్థితి ఏమాత్రం బాగాలేదనీ, విషమమనీ చెబుతున్నారు… కుటుంబసభ్యులు ఏం చెబుతున్నా సరే, డాక్టర్లు క్రిటికలేనని చెప్పారు…
చికిత్సకు తన అవయవాలు సహకరిస్తున్నాయని కుటుంబసభ్యులు చెప్పినా సరే, కీలకమైన బ్రెయిన్ దెబ్బతినడంతో ఇక లాభం లేకుండా పోయింది… నందమూరి కుటుంబంలో మరో విషాదం..!! (తన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ జారీ చేస్తూ కష్టమేననే భావనను వ్యక్తీకరించారు. ‘ముచ్చట’ అదే రాసింది… కాసేపటికే డాక్టర్లు లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తీసేశారు… తారకరత్న ఆయుష్షు ఆగిపోయింది…) తను నాస్తికుడో ఆస్తికుడో తెలియదు గానీ మహాశివరాత్రి రోజున శివైక్యం పొందాడు… సద్గతి ప్రాప్తిరస్తు మిస్టర్ తారక్…!
Share this Article