ప్రపంచమంతా వర్ణ దురహంకారం
———————-
తెలుపు తెలుపే. నలుపు నలుపే. నలుపును ఎంత నలిపినా తెలుపు కాదు. ఈ విషయం బాగా ఎరుకలో ఉండాలని ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపుగానే ఉందిగానీ- తెలుపు కాలేదని వేమన ప్రయోగ ఉదాహరణతో తేట తెల్లం చేశాడు.
ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. నిజానికి ఆకాశానికి ఏ రంగూ లేదు. సముద్రం కూడా నీలి రంగులో కనిపిస్తుంది. నిజానికి నీటికి కూడా ఏ రంగూ లేదు.
Ads
కాలితే ఏదయినా నల్లటి బొగ్గు కావాలి. కాలి బూడిదే మిగలాలి. అందుకే బూడిద- విభూతి వేదాంత ప్రతీక. బొగ్గులో నుండే రసాయన చర్య ద్వారా వజ్రం పుడుతుంది. వజ్రం మూల ధాతువులో కర్బనం ఉన్న విషయం సైన్సు తెలిసినవారికి చెప్పాల్సిన పనిలేదు.
అణిగి మణిగి వినయంగా ఉండడానికి; సాటి మనిషిని మనిషిగా చూడడానికి సంస్కారం కావాలి కానీ- అహంకరించడానికి- ద్వేషించడానికి కులం, మతం, ప్రాంతం, దేశం, జాతి, పొట్టి, పొడుగు, లావు… ఏదయినా పనికి వస్తుంది.
ఏ రంగుతో, ఏ రూపంతో పుట్టాలి అన్నది సృష్టి నియమం తప్ప, మన ఎంపిక కాదు. కాకూడదు. శీతల, అతి శీతల ప్రాంతాల్లో పుట్టేవారు ఎర్రగా, తెల్లగా ఉంటారు. సూర్యరశ్మి ప్రభావం తక్కువ కావడం దీనికి ప్రధాన కారణం. వారు వివిధ ప్రాంతాలకు విస్తరిస్తే అవే జన్యువుల ప్రభావంతో ఆ రంగు, రూపం కూడా విస్తరిస్తూ ఉంటాయి. ఉష్ణ మండలాల్లో పుట్టేవారు సహజంగా గోధుమ రంగు, నలుపు రంగుతో పుడతారు. ఇంతకు మించి ఇందులో తలబాదుకుని కనుక్కోవాల్సిన శాస్త్రీయత పెద్దగా ఏమీ ఉండదు.
మన ఖర్మ కొద్దీ తెలుపు గొప్పది-అందమయినది-మేలయినది అయి కూర్చుంది. నలుపు తక్కువది- అందవికారమయినది- పనికిరానిది అయ్యింది. పెళ్లి ప్రకటనలు, సబ్బులు, పౌడర్లు, క్రీముల ప్రకటనలు అన్నిట్లో తెలుపు అయితేనే విలువ. నలుపు అయితే నోరు మూసుకుని వెనక వరుసలో కూర్చోవాలి. వర్ణ దురహంకారం, జాతి దురహంకారం అవలక్షణాలు భూగోళమంతా నర నరాన జీర్ణించుకుపోయాయి.
“బ్లాక్ లైవ్స్ మ్యాటర్” నినాదం కారుచీకట్లో కలిసి తెలవెల పోతోంది.
తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ గ్రౌండులో ఫీల్డింగులో ఉన్న భారతీయ క్రీడాకారులనుద్దేశించి కొందరు ఆస్ట్రేలియా ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. వర్ణ దురహంకార దూషణ చేశారు. అనకూడని, పరులు వినకూడని ఆ బూతులేమిటో టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి ఇంగ్లీషు పత్రికలు సూచనగా చెప్పాయి.
———————–
గోధుమ రంగు కుక్కలున్నట్లే- తెల్ల కుక్కలు, తెల్ల పందులు, తెల్ల దున్నపోతులు కూడా ఉంటాయి. ఉండి తీరతాయి. పైన తెలుపు ఉన్నా లోపల మనసులో బొగ్గు ఉంటే-
బొగ్గు పాల కడుగ పోవునా మలినంబు విశ్వదాస్ట్రేలియా చీమ వినుర వేమా!
“కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినురా సుమతీ!”
“హీనుడెన్ని విద్య లిలను నేర్చినగాని
ఘనుడుగాడు హీన జనుడె గాని
పరిమళమును మోయ, గార్దభము గజమౌనె
విశ్వదాభిరామ వినురవేమ !”
చెబితే ఇలాంటి నీతి పద్యాలు కోకొల్లలు.
సప్తపదిలో వేటూరి పాట-
“ఏడు వర్ణాలు కలసి ఇంద్రధనసు అవుతాది
అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటాది
ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు.. ఇన్ని మాటలు!”…….. By…. పమిడికాల్వ మధుసూదన్
Share this Article