పెళ్లిళ్లకు పేరంటాలకు వెళ్లినప్పుడు చీరెలో, జాకెట్ ముక్కలో, ఇతర కానుకలో గిఫ్టులుగా ఇస్తుంటారు… వాటిని ఏం చేస్తారంటే, అలాగే భద్రంగా ఉంచి, పేరంటాలకు తమ ఇంటికి వచ్చే మహిళలకు పెట్టేస్తుంటారు… వాళ్లు ఇంకెవరికో గిఫ్టులుగా ఇస్తుంటారు… ఇదొక సైకిల్… కరెన్సీ టైపు… ఎవరూ వాడరు, కానీ సర్క్యులేషన్‌లో ఉంటాయి అవి… పెట్టావా, ఎస్ పెట్టాం… అంతే, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటి వాయినం…
పాకిస్థాన్ ధోరణి చూస్తే మొదట నవ్వొచ్చింది… తరువాతే జాలేసింది… ఆనక ఈ పేరంటాల గిఫ్టులు గుర్తొచ్చాయి… అప్పట్లో పాకిస్థాన్‌ను వరదలు ముంచెత్తాయి తెలుసు కదా, వేల మంది మరణించారు… లక్షల మందిని తరలించారు… వేల కోట్ల నష్టం… అసలే ఆర్థికంగా దివాలా దశలో ఉండి మూలుగుతున్న పాకిస్థాన్ మీద ఈ వరదలతో తాటిపండు పడ్డట్టయింది… పాపం అని జాలిపడి, మన ముస్లిం కంట్రీయే కదా అని తుర్కియా తనకు చేతనైనంత సాయాన్ని పాకిస్థాన్‌కు పంపించింది…
పాకిస్థాన్ వాడు దాన్ని వాడుకోలేదు, ఆ సామగ్రి మొత్తం అలా పడి ఉంది నిరుపయోగంగా… ఈలోపు తుర్కియాలో భారీ భూకంపం వచ్చింది… అధికారికంగానే 60 వేల మంది మరణించగా, అనధికారిక లెక్కల ప్రకారం కనీసం లక్ష మంది మరణించి ఉంటారనీ, ఇక చాలా శవాల్ని శిథిలాల నుంచి తీయలేని దుస్థితి ఉందని అంటున్నారు… ఇప్పట్లో తుర్కియా కోలుకోదు… అందరికన్నా ముందే ఇండియా స్పందించింది, రెస్క్యూ సామగ్రిని, దళాల్ని హుటాహుటిన పంపించింది…
Ads
శిథిలాల తొలగింపు, శవాల వెలికితీతతోపాటు అప్పటికప్పుడు వైద్యసాయానికి క్యాంపులు ఏర్పాటు చేసి, వైద్యం చేస్తున్నారు… ఇన్నాళ్లూ ఇండియా పట్ల విపరీతమైన విద్వేషంతో వ్యవహరించిన తుర్కియాకు ఆపదలో ఆదుకునేవాడెవడో అర్థమైంది… పశ్చాత్తాపపడుతున్నట్టుగా వెంటనే థాంక్స్ చెప్పింది… కానీ పాకిస్థాన్ ఏం చేసింది..?
గతంలో తనకు తుర్కియా పంపించిన విపత్తు సాయం సామగ్రినే మళ్లీ ప్యాక్ చేసి పంపించింది… కానీ అది కూడా ఓ కళ… తాము కొత్త సాయం పంపించినట్టుగా కలరింగ్ ఇవ్వాలి… పాకిస్థాన్‌కు అదీ చేతకాలేదు… తుర్కియా నుంచి ‘‘పాకిస్థాన్ వరద బాధితులకు సాయం’’ అని రాసి ఉన్న అక్షరాల్ని, ప్యాకుల్ని అలాగే ఉంచి, పైన కొత్త ప్యాకింగు చేసి, ‘‘తుర్కియా భూకంప బాధితులకు పాకిస్థాన్ సాయం’’ అని రాసి పంపించింది… అవి చూసిన తుర్కియా అధికారులకు, నాయకులకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు… సో, పుచ్చుకుంటి వాయినం, వాపస్ ఇస్తినమ్మ వాయినం…!! విపత్తు సాయం వాయినంలా మారడమే పెద్ద విపత్తు…!!
Share this Article