ఒక పత్రిక, ఒక టీవీ చానెల్ వోట్లు సంపాదించి పెట్టగలదా..? ప్రొఫెషనల్‌గా నడిపిస్తూనే, ఒక రాజకీయ పార్టీ వైపు మొగ్గుజూపితే ఏమో గానీ, పూర్తిగా పార్టీ రంగు పూసి, జనంలోకి వదిలితే, డంప్ చేస్తే ఆ పార్టీ పట్ల సానుకూలత పెరుగుతుందా..? పోనీ, ప్రత్యర్థుల దుష్ప్రచారానికి కౌంటర్ సమర్థంగా ఇవ్వగలరా..? కేవలం ఓ పార్టీ వాయిస్‌గా మిగిలిపోతుందా..?
నమస్తే తెలంగాణకు పత్రికకు అనుబంధంగా బీఆర్ఎస్ పార్టీ, అనగా కేసీయార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ పేరిట ఓ దినపత్రికను స్టార్ట్ చేయబోతున్నాడు….. ఇదీ వార్త… అంతకుముందు నమస్తే ఢిల్లీ, నమస్తే ముంబై పేరిట పత్రికలు తీసుకురాబోతున్నాడు అనే వార్తలు కూడా ఎక్కడో చదివినట్టు గుర్తు… ఇక్కడ కొన్ని అంశాలు చెప్పుకోవాలి…
బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీ కదా… అన్ని రాష్ట్రాలోనూ శాఖలు ఏర్పాటు చేస్తారు కదా… మొన్న మహారాష్ట్రలో మీటింగు పెట్టినట్టు ఇతర రాష్ట్రాల్లోనూ పెడతారు కదా… ఏకంగా ప్రధాని కుర్చీనే టార్గెట్ చేసుకున్నాడు కదా కేసీయార్… మరి ప్రతి భాషలోనూ నమస్తే ఒడిశా, నమస్తే బీహార్, నమస్తే కర్నాటక, నమస్తే తమిళనాడు వంటి ఎన్ని పత్రికలు పెట్టాలి..? సాధ్యమేనా..?
Ads
టీవీ చానెళ్లు అంటే సరే… అప్పట్లో ఈటీవీ ఒకేసారి ఏడెనిమిది చానెళ్లను స్టార్ట్ చేసింది, తరువాత రిలయెన్స్‌కు అమ్మేసింది… టీవీ చానెళ్ల వరకూ ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదు… పైగా సాధనసంపత్తిలో కేసీయార్‌ను తలదన్నే లీడర్ ఎవరున్నారు ఇప్పుడు..? సో, పత్రికల్ని కూడా పెడితే పెడతాడేమో… కానీ ఈ పత్రికలకు వచ్చే రీచ్ ఎంత..? అరకొర రీచ్‌తో సిద్ధించే ప్రయోజనాలేపాటి..?
అసలు నమస్తే తెలంగాణ పత్రికే ఫ్లాప్… ఆ పార్టీ వాళ్లే పెద్దగా అందులో వచ్చే వార్తల్ని పట్టించుకోరు… ఇప్పుడైతే ఏబీసీ కూడా లేదు దానికి… ఒక ఉద్యమపత్రికగా తెలంగాణలో ఒకనాడు ప్రభ వెలిగింది… ఇప్పుడు జస్ట్, ఓ భజన పత్రిక అది… పోనీ, ఇతర భాషల్లో పత్రికలు పెట్టినా సరే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార పార్టీల పోకడలకు వ్యతిరేకంగా రాసేది ఏమీ ఉండదు…
మన భారతదేశం, మన వనరులు, మస్తు చేసుకోవచ్చు, ఈ జాతీయ పార్టీలకు చేతకావడం లేదు… అనే పాటలే..! ఇక్కడ అధికారంలో ఉండి, బీఆర్ఎస్ నేతలకు టార్గెట్లు పెట్టి కొనిపిస్తేనే అది ఇతర పెద్ద పత్రికలతో పోలిస్తే ఎంతో దూరంలో ఉండిపోయింది… ఇక నామమాత్రం ఉనికి ఉండే రాష్ట్రాల్లో నమస్తే నమస్తే అని పత్రికలు పెడితే వాటి సక్సెస్ రేటు ఎంత ఉంటుంది..? అసలే పత్రికల వ్యయం తడిసి మోపెడవుతోంది… పెద్ద పెద్ద పత్రికలే మూసుకుంటున్నాయి… మరి ఈ నమస్తేల మనుగడ ఎంత కాలం..? ఎన్నికల వరకేనా..?
అలాంటిది ఎన్ని భాషల్లో స్టార్ట్ చేసి, ఎన్ని కాపీలను అమ్మగలరు..? దాంతో వచ్చే ఫాయిదా ఏమిటనేదే పెద్ద చిక్కు ప్రశ్న… ఇవన్నీ సరే, నమస్తే ఆంధ్రప్రదేశ్ పత్రిక పోలవరం ఎత్తుపై, పోతిరెడ్డిపాడు సామర్థ్యంపై, రాయలసీమ లిఫ్టుపై, కరెంటు బకాయిలపై, కృష్ణాజలాల వాడకంపై ఏమంటుందో..? శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్‌ను కర్నాటకకు ఇచ్చేయాలి, అప్పర్ భద్రపై మాట్లాడొద్దు, బాబ్లీ మంచి ప్రాజెక్టు అనే పాటల్ని పాడతారా ఆయా భాషల పత్రికల్లో… ఫాఫం, ఒకప్పటి ఉద్యమనేత కేసీయార్, ఇప్పుడెలా మారిపోయాడు..?! అన్నట్టు ఎడిటర్ పోస్టు కావాలనుకునేవాళ్లు సంప్రదించండి, తోట చంద్రశేఖర్…!!! నమస్తే తెలంగాణ ఎడిటర్ ఆంధ్రా పత్రికకు అక్కరకు రాడు…!!
Share this Article