మహేష్… ఆ పేరులోనే ఓ వైబ్రేషన్… ఓ జోష్… సుబ్బు అంటే ఏముంది, బాబ్బాబు అన్నట్టుగా…… అదేదో సినిమాలో ఓ హీరోయిన్ ఈ డైలాగులు వదులుతూ తెగవయ్యారాలు పోతుంది… అసహజమే అయినా ఆ పాయింట్ కాస్త సరదాగా అందరికీ నచ్చింది… నిజమే… నేములోనేముందీ అని కొందరు లైట్‌గా తీసుకుంటారు గానీ… నేమ్, సర్నేమ్ చాలా ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో… శ్రీ వెంకటేశ్వర వైన్స్, శ్రీ భద్రకాళి బార్, శ్రీ ఆంజనేయ రెస్టారెంట్, శ్రీ రామ మెన్స్ వేర్ వంటివి ఇప్పుడు పెద్దగా ట్రెండ్ కావు…
అడ్డా పేరుకు ఓ అట్రాక్షన్ ఉండాలె… అందరికీ యాదికుండాలె… అంటే పేరు గమ్మత్తుండాలె… ఏక్ ధమ్, హిలాయించాలె… అంటే ఆకట్టుకునేలా ఉండాలి… అలా ఉండాలంటే కొత్త కొత్త పేర్లు వెతకాలి… పోరగాళ్లు పుడితే, వాళ్లకు పేర్లు పెట్టడానికి ఎంతగనం ఆలోచిస్తమో తెలుసు కదా… అంతకు పది రెట్లు ఎక్కువ కష్టపడాలె… ఈ వార్త ఓసారి చదవండి…
Ads
కరీంనగర్లో ఒకాయన మెన్స్ వేర్ షాపుకు ‘ఊకో కాక’ అని పేరు పెట్టిండు… అంటే, ఊరుకో బాబాయ్ అని అర్థం… దానికి బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ వచ్చి రిబ్బన్ కట్ చేసిండు… అరె, మామా, మస్తు పేరు పెట్టినవ్రా అని ఓనర్‌ను దోస్తులు తారిఫ్ చేస్తున్నరట కూడా… సరే, ఈ ట్రెండ్ ఇంకా పెరుగుతుంది… వుమెన్స్ వేర్ షాపులకు… అత్తా, మస్త్… వదినా, ఆల్ రైట్… వచ్చిపో చెల్లే… వంటి పేర్లు కనిపించే సూచనలున్నట్టే లెక్క… గజం బద్ద, గుండీలు, దోమీటర్ పన్నా వంటి కొత్త కొత్త పేర్లు కూడా రావాలని ఆశపడదాం…
నిజానికి ఎప్పట్నుంచో ఈ విశిష్ట నామకరణాల కల్చర్ ఉన్నదే… హైదరాబాదులో పాన్ షాపులను పరిశీలిస్తే… రియాజ్ పాన్ షాప్, అబ్బాస్ పాన్ షాప్, త్రీస్టార్ పాన్ షాప్, జాన్ పాన్ సెంటర్, ముదిరాజ్ పాన్ గుట్కా, రాంయాదవ్ పాన్ షాప్ అంటూ కనిపించేవి మాత్రమే కాదు… పాన్ దాన్, ఇలాచీ, ఛాలియా వంటి పేర్లూ పెట్టుకున్నారు కొందరు… మరికొందరు కిళ్లీ, తాంబూలం, తమలపాకు, లవంగం, ఆకూవక్క వంటి పేర్లు పెట్టేవాళ్లేమో గానీ… అవి హైదరాబాదులో పెద్దగా వర్కవుట్ కావు…
కాకపోతే… కొన్ని హోటళ్లకు మాత్రం లవంగం, అరిటాకు వంటివి పెట్టుకున్నారు… కొన్నిచోట్ల రా-తినిపో వంటి కొత్త కొత్త పేర్లు పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో కనిపిస్తుంటయ్ పోస్టులు, ఫోటోలు… రాబోయే రోజుల్లో తప్పనిసరిగా విస్తరి, ఇస్తరాకు, భుక్తాయాసం, అన్నం బుట్ట, తినేవాడిదే పొట్ట వంటి భిన్నమైన పేర్లను మనం ఆశించవచ్చు… అరెరె, మరిచేపోయాం… వైన్స్, బార్లకు కూడా ఈ ట్రెండ్ విస్తరించాల్సిందే… మామా ఏక్ పెగ్‌లా బార్ తరహాలో… బావా, ఓ ఫుల్ ప్లీజ్ వైన్స్… చిచ్చా, ఔరేక్ పెగ్… మామా, కుమ్మెయ్ రెస్టారెంట్… పక్క-కిక్కు హోటల్… వంటి నామకరణాలనూ చూస్తామేమో…!!
Share this Article