సౌత్ సినిమాల దెబ్బకు… కరోనా దెబ్బకు… తాము తీసే నాసిరకం సినిమాల దెబ్బకు… బాలీవుడ్ కుదేలైపోయింది… అందరమూ చెప్పుకున్నదే… కానీ పఠాన్, దృశ్యం-2 సినిమాలతో బాలీవుడ్ మళ్లీ పట్టాలకు ఎక్కిందని అందరూ అనుకున్నారు… కానీ కరెక్టు కాదు… ఆ రెండు సినిమాలే… అందులో పఠాన్ వసూళ్ల అంకెలు సందేహాస్పదమే, 1000 కోట్లు రాకపోవచ్చుగాక, ఆ నాసిరకం సినిమా మాత్రం హిట్టే… నిజంగా హిట్టయింది దృశ్యం-2… మరి మిగతా సినిమాలు… సేమ్, ఢమాల్ ఢమాల్…
అన్నింటికీ మించి అక్షయ్‌కుమార్ సినిమా సెల్ఫీ ఘోరమైన ఫ్లాప్ ఇప్పుడు… బహుశా ఈ రేంజులో అక్షయ్ కుమార్ సినిమా తనను నిరాశపరిచి ఉండదు… 1987… అప్పట్నుంచీ తనది సినిమా ప్రపంచమే… రెండు నెలలకో సినిమా అలవోకగా తీసిపారేస్తాడు… అంత ఎనర్జీ… కానీ తన సినిమా కూడా ఢమాల్… ఫస్ట్ డే వసూళ్ల తీరు తెలుసా..? ఫిలిమ్ ట్రేడ్ అనలిస్టు లెక్కల ప్రకారం… పీవీఆర్ 64 లక్షలు, సినీపోలిస్ 23 లక్షలు, ఐనాక్స్ 43 లక్షలు… మొత్తగా 1.3 కోట్లు మాత్రమే…
అసలు ఈ సినిమా మీద ముందు నుంచీ నెగెటివ్ కామెంట్సే వస్తున్నాయి… సక్‌నిల్క్ సైటు ఇంకాస్త అధికంగా 3 కోట్ల మేరకు ఫస్ట్ డే వసూళ్లు ఉండవచ్చునని అంచనా వేసింది… అది కూడా ఈ రేంజ్ తక్కువ ఫిగర్స్ అంచనా వేయలేదు… అరె, ఒక సినిమా ఫ్లాప్, ఒక సినిమా హిట్… కామన్ కదా అన్నట్టుగా ఉండే అక్షయ్ కుమార్ కూడా సెల్ఫీ రిజల్ట్ చూసి పరేషాన్‌లో పడిపోయాడు… ఎందుకంటే..? వరుసగా ఇది తనకు ఆరో ఫ్లాప్ సినిమా…
Ads
సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షాబంధన్, రామసేతు, బచ్చన్ పాండే, కట్ పుతిల్… ఇప్పుడు సెల్ఫీ… అంతకుముందు కూడా చాన్నాళ్లుగా తన సినిమాలు పెద్దగా క్లిక్ కావడం లేదు… అయితే మరీ ఇంత ఘోరమైన వసూళ్లు ఇదే తొలిసారి… ఈ సెల్ఫీ సినిమా మీద కంగనా రనౌత్ కూడా వ్యంగ్య వ్యాఖ్యానాలకు దిగింది…
ఇది మలయాళం సినిమా డ్రైవింగ్ లైసెన్సుకు అధికారిక రీమేక్… అందులో పృథ్వీరాజ్, సూరజ్ తదితరులు నటించారు… సినిమా కథాకమామిషు జోలికి పోకుండా ఆలోచిస్తే… పుష్ప, ఆర్ఆర్ఆర్, కాంతార, కేజీఎఫ్, విక్రమ్ తదితర సినిమాలన్నీ సౌత్ లాంగ్వేజీ నుంచి నేరుగా హిందీలోకి డబ్ అయిపోయి అద్భుతంగా వసూళ్లను సాధించినవే కదా… నిజంగానే డ్రైవింగ్ లైసెన్స్ సినిమా బాగుంటే డబ్ చేసేస్తే సరిపోయేది… తక్కువ ఖర్చు, ఫెయిలైనా పెద్ద ఫరక్ పడదు… ఓటీటీ, శాటిలైట్ టీవీ రైట్స్‌తో బయటపడొచ్చు…
కానీ రీమేక్ అనగానే మళ్లీ హిందీ తారాగణం, 24 క్రాఫ్ట్స్, ఖర్చు తడిసిమోపెడు… ఇలా ఫెయిలైతే నెత్తి మీదికి ఎర్రతువ్వాల… ఒకప్పుడు సౌత్ హీరోలకు పెద్దగా హిందీ బెల్టులో యాక్సెప్టెన్సీ ఉండేది కాదు… కానీ ఇప్పుడు అలా కాదుగా… పుష్ప సినిమా హిట్ ఎవరూ ఊహించనంత రేంజ్… టీవీల్లో, ప్రోగ్రాముల్లో, ఫంక్షన్లలో అవే పాటలు, అవే స్పూఫులు, అవే డైలాగులు… సో, రీమేకులు వేస్ట్, డబ్బింగ్ సేఫ్… డబ్బు ఖర్చు పెట్టగలిగితే సొంత స్టోరీ రాయించుకోవడం బెటర్…!!
Share this Article