బ్రిటీషు వాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగు వేసుకుని వ్యాపారం పేరిట భారతదేశాన్ని కబళించడానికి కలకత్తాలో కాలు పెట్టిన 1757 ప్రాంతానికి గ్రేట్ బ్రిటన్ జనాభా అక్షరాలా అరవై లక్షలు కూడా దాటి ఉండదు అని ఒక అంచనా. కాదు కాదు- ఒకటిన్నర కోటి అని వారు చెప్పుకున్న రికార్డుల మీద కొందరికి అనుమానాలున్నాయి. అప్పటికి భారత్ జనాభా దాదాపు ఇరవై కోట్లు. ఇరవై కోట్ల జనాన్ని అరకోటి జనసమూహం ప్రతినిధులు రెండు పడవల్లో వచ్చి, రెండు వందల ఏళ్లపాటు పట్టి పీడించినందుకు ఇప్పటికీ బ్రిటీషు వారు గర్వంగానే ఫీలవుతుంటారు. వారి భాష గొప్పది, వారి వేషం గొప్పది, వారి నాగరికత గొప్పది, వారి సంస్కృతి గొప్పది- అని వారు అనుకోవడంలో తప్పు లేదు. భారతీయులక్కూడా అలాంటి అభిప్రాయమే కల్గించడంలో మాత్రం వారి గొప్పతనాన్ని ఎవరూ కాదనడానికి వీలులేనిది.
దూరపు కొండలు నునుపు. పొరుగింటి పుల్లకూర రుచి. ఇంగ్లీషు వారి రాకతో మన భాషలు, సంస్కృతులకు మేలు జరిగిందా? కీడు జరిగిందా? అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భారతీయ చరిత్రకు మాత్రం బ్రిటీషు వారు, వారికి వకాల్తా పుచ్చుకున్న ఎడమకంటి మేధావులు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు.
Ads
అనాదిగా మనం నమ్మిన చరిత్రను పుక్కిటి పురాణాలుగా తీసి అవతల పారేశారు. అప్పటికే ఉన్న చరిత్రకు మసి పూశారు. ధ్వంసం చేశారు. కొత్త చరిత్రను లిఖించారు. అందులో కాలాలు, రాజ్యాలు, రాతి లోహ యుగాలు లాంటి పైపైకి కనిపించే లేదా దొరికినంతవరకు ఆధారాలను బట్టి అల్లినది చరిత్ర అయ్యింది. చరిత్ర రచన కూడా ఇలాగే జరగాలని వారు శాసించారు. మనవారు విని అలాగే రాస్తూ వచ్చారు. ఇప్పటికీ రాస్తున్నారు.
కేంద్రంలో బి జె పి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి భారతీయ దృక్పథంతో మళ్లీ చరిత్ర రచన జరగాలి అన్న చర్చ మొదలవుతుంది. భారత్ లో పుట్టి పెరిగి ఇక్కడే కొన ఊపిరి కూడా వదలబోయే కొందరికి భారతీయ దృక్పథంతో చరిత్ర రచన అంటే ఒళ్లు మంట.
ఆర్యులు భారత్ లో కాలు మోపే నాటికి ఇక్కడ అనాగరికంగా చెట్ల ఆకులు బట్టలుగా కట్టుకుని చెట్టుకొకరు పుట్టకొకరుగా తిరుగుతుండిన ద్రావిడులు మాత్రమే ఉండేవారు. ఈ ద్రావిడులంతా రాక్షసరాజు రావణాసురుడికి స్వయానా ముని ముని ముని మనవలు, మనవరాళ్లు. ఆర్యుడయిన రాముడు ద్రవిడ రావణాసురుడిని చంపి- ఆర్య సంస్కృతిని విస్తరింపజేశాడు- ఇలా ఉంటుంది బ్రిటీషువారి చరిత్ర నిర్మాణం. అసలు ఆర్య- ద్రావిడ వివాదమే లేదు. బ్రహ్మ మానసపుత్రుడు పులస్త్యుడు. పులస్త్యుడి కొడుకు విశ్రవసువు. విశ్రవసువు- కైకసి కొడుకు రావణుడు. విశ్రవసువు- ఇలబిల కొడుకు కుబేరుడు. అంటే కుబేరుడు- రావణుడు వరుసకు అన్నదమ్ములు. స్వయానా బ్రహ్మకు ముని మనుమలు. కుబేరుడికోసం బ్రహ్మ విశ్వకర్మ చేత స్వర్ణ లంకను నిర్మించి ఇస్తే- కుబేరుడిని తన్ని తగలేసి ఆ లంకను రావణుడు ఆక్రమించుకున్నాడు. అంటే రావణాసురిడి నేటివ్ ప్లేస్ లంక కానే కాదు. కనీసం సౌత్ ఇండియా అయినా కాదు. రావణాసురుడు ద్రవిడుడు కాదు కాక కాదు. ఇంగ్లీషు వారు చెప్పినది కాక్ అండ్ బుల్ కాకమ్మ కథ అని తెలియక పాపం- ఇప్పటికీ తమిళనాడులో కొందరు రావణాసురుడిని ఆరాధిస్తూ ఉంటారు. రావణాసురుడికి కనీసం పడుకున్నప్పుడయినా పది తలల్లో తొమ్మిది మాయమై, ఒకటే ఉంటుంది. లేకపోతే నిద్రలో దిండు మీద పక్కకు తిరగగానే చచ్చేవాడు- రామబాణం దాకా ఆగకుండా. మనకు పడుకున్నా, లేచినా వెయ్యి తలలు. మన వెర్రి తలలను కొట్టగలిగే బాణం రాముడి అక్షయ బాణ తూణీరంలో కూడా లేదు.
అయోధ్య మన ఉత్తర ప్రదేశ్ లో ఉన్నదే. సరయూ అదే. గంగ అదే. గోదావరీ తీర దండకారణ్యం అదే. కోరి కోరి నారాయణుడు అయోధ్య రాజు దశరథుడికి కొడుకుగా పుడితే- యూరోప్ నుండి సూటు బూటు వేసుకుని, హ్యాట్ పెట్టుకుని పర్షియా మీదుగా ఆఫ్ఘనిస్తాన్ లో ఆగి రొట్టెలు తిని రావడంతో ఆర్యపుత్రా! అంటున్నామట. వీరి ఆర్య- ద్రావిడ సిద్ధాంతం ప్రకారం రావణ సంతతి అయిన మన రాక్షసత్వాన్ని నియంత్రించడానికి ఆర్యులు కట్టగట్టుకుని సముద్రాలు, కొండలు, నదులు దాటి వచ్చారు. వచ్చి మనకు వ్యవసాయం నేర్పారు. బట్టకట్టుకోవడం నేర్పారు. మన బతుకుకు ఒక అర్థం- పరమార్థాన్ని నిర్వచించారు. వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే చెప్పేవాడు బ్రిటీషు చరిత్రకారుడు అవుతాడు.
ఇంకా నయం! ఆర్యరాముడు లండన్ బకింగ్ హామ్ ప్యాలెస్ లో పుట్టి; థేమ్స్ నది మీద లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్…ఫాలింగ్ డౌన్ అని గుహుడు అరవడంతో అర్జంటుగా అతడి నాటుపడవ తీసుకుని; అరేబియా సముద్రం దాటి; బాంబే గేట్ గుండా ఇండియాలోకి వచ్చి; కొంకణ్ మీదుగా గోకర్ణం నుండి దక్షిణ భారతంలోకి చొరబడి; ధనుష్కోటి దగ్గర మరపడవ ఎక్కి; లంకకు చేరి; దుష్ట ద్రావిడరావణుడి పది తలలను నరకడాన్ని చూసి రాసిన షేక్స్ పియర్ పుస్తకాల్లో ఉన్నదే నిజమైన ఇంగ్లాండ్ ఇతిహాసం అని చెప్పడం లేదు! షేక్స్ పియర్ వాల్మీకి కంటే సరిగ్గా ఒక రోజు ముందు స్కాట్లాండ్ గడ్డిమేటల్లో పుడితే ఆవులుకాచుకునే వాళ్లు చూసి గ్రేట్ బ్రిటన్ గ్రేట్ రాణిగారి గ్రేట్ పి ఏ కు చెబితే అప్పుడు పుట్టినవాడే గ్రేట్ చరిత్రకారుడు, అప్పుడు రాసిందే గ్రేట్ చరిత్ర అనలేదు!
మిథిలవాసులు అయోధ్యలో మాట్లాడే ప్రాకృత భాష, యాస-బహుశా అవధిలో హనుమంతుడు సీతమ్మతో లంకలో పక్కవారికి అర్థం కాకుండా మాట్లాడాడు అని వాల్మీకి సుదరకాండలో ఎంత గొప్పగా చెప్పాడో? రాముడు- సీత సంస్కృతంలో మాట్లాడినా రాముడికి అయోధ్య మాండలికం, సీతమ్మకు మిథిల మాండలికం అలాగే ఉన్నాయి అన్నది ఇందులో భాషాశాస్త్రవేత్తలకు దక్కే చరిత్ర. అయోధ్య నగర నిర్మాణం, వీధులు, పార్కులు, చెట్లు, గోపురాలను అయోధ్యకాండలో పూసగుచ్చినట్లు చెప్పాడు వాల్మీకి.
ఇంగ్లీషువారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా మన చరిత్రను మనమే తక్కువ చేసుకున్నాం. వక్రీకరించుకున్నాం. చెరిపేసుకున్నాం. అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడకూడదు. సుభాష్ చంద్రబోస్ గురించి ఎంత వీలయితే అంత అయోమయం సృష్టించాలి. భగత్ సింగ్ గురించి మాట్లాడడం మహా నేరం. ఝాన్సీ లక్ష్మీ భాయ్ గురించి గొప్పగా చెప్పకూడదు.
మొత్తంగా ఇంగ్లీషువారిని ఎదురించిన వారందరూ ఇంగ్లీషువారు వెళ్లిపోయినా మనం బహిరంగంగా ఆరాధించదగ్గవారు కారు. ఒళ్లు పులకించేలా చదువుకోదగ్గ చరిత్ర కాదు. తాజాగా భారతీయ చరిత్ర రచన అంశాలను పరిశీలిస్తున్న పార్లమెంటు కమిటీ ఈ విషయాలపై దృష్టి కేంద్రీకరించింది. వక్రీకరణలను సవరించి భారతీయ కోణంలో చరిత్రను నిర్మించాలని ప్రయత్నిస్తోంది. అన్ని కాలాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు చరిత్రలో మరుగున పడిన భారతీయ ధీర వనితలకు హారతి పట్టాలని భావిస్తోంది. ఈ ప్రయత్నం మీద అప్పుడే పెదవి విరుపులు, నిరసనలు మొదలయ్యాయి. అసలు చరిత్ర చరిత్రగా ఎప్పటికి చరిత్ర పుటల్లోకి ఎక్కుతుందో?………. By…. పమిడికాల్వ మధుసూదన్
Share this Article