Bharadwaja Rangavajhala ….. ఆత్రేయ సినిమా పాటల రచనలో ప్రజాస్వామ్య దృక్పధం కనిపిస్తుంది. అది తెలుగులో ఇంకే సినిమా కవిలోనూ కనిపించదు. చాలా స్పష్టంగా … ఏ మనిషి కూడా మరో మనిషి ఏరియాలోకి పోయి ప్రవర్తించకూడదు అంటాడాయన. ఇందుకు ఉదాహరణలు అనేకం చెప్పుకోవచ్చు ….
నీ మనసునీదిరా
ఇచ్చుకో దాచుకో ఏమైనా చేసుకో
కానీ
ఎదుటి వారి మనసిమ్మని అడిగేందుకు నువ్వెవరు? అంటాడు …
అంతే కాదు …
నీలో నువ్వే అనుకున్నావ్ …
నీదే అనీ కలగన్నావ్ …
కలలొకరివి కళ్లొకరివి
ఎలా కుదుర్దుందిరా అంటాడు …
ప్రేమ మార్గం ఎప్పుడూ ఒకే వైపు దారి కాదు
నువ్వు నీ తలుపును తెరిస్తే
ఎదుటి తలుపు తెరుచుకోదంటాడు …
ఇంత క్లియర్ గా ఇదే విషయాన్ని అనేక పాటల్లో చెప్తాడు …
వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా?
మనసిచ్చినదే నిజమైతే …
మన్నించుటయే రుజువు కదా అనడం ఆయనకే సాధ్యం.
మనసు ఇచ్చాను… నువ్వు ఇవ్వకపోతే చంపేస్తా అనడం లాంటి దారుణ ఆలోచన చూసినప్పుడు భయం వేస్తుంది…
అలాగే …
మనసే మందిరం సినిమాలో …
నీ పతి ప్రాణం కాపాడమని నాపై భారం మోపావే …
ఎంతదమ్మ నీ నమ్మకమమమ్మా ఎవ్వరివ్వగల వరమమ్మా అంటాడు …
ఆమె ఒకప్పుడు తను ప్రేమించిన అమ్మాయే … అయినా సరే …
ఒక మనసు మీద మరో మనసు ఏ పద్దతిలో అజమాయిషీ చేసినా ఆత్రేయ క్షమించడు ..
శ్రీశ్రీ కూడా పాత్ర పరిధి, కధ, సందర్భం తనకు ఇచ్చిన అవకాశం మేరకే అనుకునేవాడు.
ఆ పరిధిలోనే రాసేవాడు తప్ప తన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయడు…
కానీ ఆత్రేయ చాలా స్పష్టంగా పదే పదే తన ప్రజాస్వామిక ఆలోచనా విధానాన్ని సినిమా పాటల ద్వారా వెల్లడిస్తూనే ఉంటాడు …
కొన్ని సందర్భాల్లో ఆయన ఆలోచనా విధానం వల్ల కూడా ఆ పాటలు అద్భుతం అనిపిస్తాయి…
అక్కడ కథలోగానీ పాత్రలోనేగానీ ఏమీ లేకపోయినప్పటికిన్నీ …
ఓ హృదయం లేని ప్రియురాలా పాటలో …
నీ మనసుకు తెలుసూ నా మనసు …
నీ వయసుకు తెలియదు నీ మనసు అనడం సామాన్యమైన విషయమా …
ఎప్పుడు తల్చుకున్నా ఆశ్చర్యం వేస్తుంది.
నీ వయసు నీ మనసును నీకు తెలియకుండా చేస్తోంది అనడం …
అబ్బ, ఆ మాటన్నవాడు మామూలోడు కాదనిపిస్తుంది …
పక్కవారి స్పేస్ ను వారికి ఇచ్చినప్పుడు మాత్రమే వారితో నిజమైన స్నేహం చేయగలవు అనేది కంటిన్యూస్ గా చెప్పాల్సిన పాఠం …
తల్లిదండ్రులు వారిలో వారూ పిల్లలతో వారూ … అలా వ్యవహరించడం ద్వారా సమాజంలో మిగిలిన వారి పట్ల అలా వ్యవహరించే కల్చర్ పిల్లలకు నేర్పాల్సి ఉంటుంది.
ఆత్రేయ సమాజం మొత్తంగా తన పిల్లలు అనుకోవడం వల్ల ఇలా కంటిన్యూగా చెప్పగలిగాడేమో అనిపిస్తుంది నాకు …
బుద్దికి హృదయం లేకా …
హృదయానికి బుద్దే రాకా…
నరుడే ఈ నరలోకం నరకం చేశాడూ అని అనగలగడం కూడా ఆయనకి మాత్రమే సాధ్యం.
కోకిలమ్మ సినిమాలో …
ఓ పాట గురించి డైరక్టర్ బాలచందర్ కీ ఆత్రేయకీ చర్చ సాగుతోంది …
పల్లవించవా నా గొంతులో
పల్లవి కావా నా పాటలో
ఇదే పల్లవి నీకేమైనా అభ్యంతరమా? అన్నాడు ఆత్రేయ …
వాటే పల్లవి వాటే పల్లవి అని పొంగిపోయారు బాలచందర్ …
అది పక్కన పెట్టేస్తే …
నేను ..ఆత్రేయ రచనల్లో బాగా ఇష్టం పడే పాట కోకిలమ్మ సిన్మా లో పోనీ పోతే పోనీ .
ఈ పాట దాదాపు రోజూ వింటాను…
ఇది మన మ్యానిఫెస్టో సాంగ్ అన్నమాట…
డెమోక్రటిక్ గా ఉండడం ఎలా అనేది నేర్పింది ఆ ఆత్రేయ పాటే…
ఆ పాట టెక్స్టు కింద ఇస్తున్నాను…
మనసిచ్చినది నిజమైతే మన్నించుటయే రుజువు కదా…. లాగానే ఈ పాట కూడా….
పోనీ పోతే పోనీ
మనసు మారిపోనీ
మమత మాసిపోనీ
గురుతు చెరిగిపోనీ
గుండె రగిలిపోనీ…
అడిగేందుకు నీకున్నది మమకారం
విడిపోయేందుకు తనకున్నది అధికారం
ప్రేమించుటేనాడు కాదమ్మ నేరం
అది నిన్ను కాకుంటే ఏలమ్మ ఖేదం
ప్రేమించి ఓడావు నీ తప్పు కాదు
అది జీవితానికి తుదిమొదలు కాదు
ప్రేమించగల నిండు మనసున్న చాలు
అది పంచియిచ్చేందుకు ఎందరో కలరు
పోనీ పోతే పోనీ….
ఈ మధ్య పైడిపాల వేసిన ఆత్రేయ పాటల సంకలనంలో ఈ పాట తప్పుల తడకగా అచ్చు వేయడం బాధ కలిగించింది…
Share this Article
Ads