Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీవీ9 దేవీ, ఈ ముచ్చట వింటివా..? మీ ‘‘గెటౌట్ హీరో’’ ప్లేసులో మోహన్‌లాల్…

March 1, 2023 by M S R

మీకు గుర్తుంది కదా… ఆమధ్య చెప్పుకున్నాం… విష్వక్సేన్ అనే వర్ధమాన హీరో గురించి… అసలు హీరోస్వామ్యం కదా ఇండస్ట్రీ… టీ సప్లయ్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్, హీరోయిన్ దాకా హీరోయే ఎంపిక చేస్తాడు… నిర్మాత ఎవరుండాలో కూడా తనే డిసైడ్ చేస్తాడు… కథ, కథనం, డైలాగ్స్, సంగీతం అన్నీ తనకు ఇష్టమున్నట్టే నడవాలి… తన లుక్కు, తన బిల్డప్పు, తన ఇమేజీ తనే ప్లాన్ చేస్తాడు… చివరకు డబ్బులు పెట్టుబడి పెట్టి, ఏరియా హక్కులు కూడా తీసేసుకుంటాడు…

మరి నిర్మాత, దర్శకుడు, మిగతా వాళ్లు ఏం చేయాలి..? హీరో షూటింగుకు రాగానే ఓసారి కాళ్లు మొక్కాలి… కీర్తనలు అందుకోవాలి… సినిమా రిలీజయ్యేంతవరకు హీరోకు కోపం రావద్దు అని దేవుడికి మొక్కుకోవాలి… తెలుగులో చిన్న హీరోలకు ఇదే మిడిసిపాటు… విష్వక్సేన్ మొదటి నుంచీ అదో టైపు… ఇష్టారాజ్యం మాటలు, దూకుడు… అసలు డౌన్ టు ఎర్త్ అనే మాటకు అర్థమే తెలియదు… ఆమధ్య ఓ పిచ్చి ప్రమోషన్ చేయించి, టీవీ9 ఆఫీసులో దేవి చేత గేటు చూపించుకున్న కేరక్టర్… మారతాడా..? మారడు… మారలేదు… చివరకు హీరో అర్జున్‌నే ఫోఫోవోయ్ అనేంతవరకూ వచ్చింది యవ్వారం…

అర్జున్ ఏ వివాదంలోకి రాడు… సినిమా కుటుంబం… ఎవ్వరూ కంట్రవర్సీల్లోకి రారు… అందరినీ గౌరవిస్తారు, తమ పని తాము చేసుకుంటూ పోతారు… అర్జున్ అన్నిరకాల పాత్రలు చేశాడు… యాక్షన్‌కు, స్టెప్పులకు అప్పట్లోనే, 1985 నుంచే కొత్త దిశను చూపించినవాడు… రాణీరాణమ్మా అనే పాట దగ్గర నుంచి భజే మంజునాథం పాట వరకు అర్జున్ అనగానే బోలెడు పాత్రలు కళ్ల ముందు చకచకా కదులుతాయి… తన అనుభవం ముందు విష్వక్సేన్ ఒక పిపీలికం…

Ads

అర్జున్ తన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా ఓ తెలుగు సినిమా ప్లాన్ చేశాడు… తనే నిర్మాత, తనే దర్శకుడు… అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు, చంద్రబోస్ గీతరచయిత, సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ హీరో గారికి నచ్చలేదట… (నిర్మాతకు కదా నచ్చాల్సింది…) దాంతో సినిమా టీంతో విభేదాలు ఏర్పడి, కంటిన్యూ అవుతున్నయ్… అర్జున్ సాధారణంగా ప్రెస్ ముందుకు వచ్చి, ఎవరినీ నిందించడు… కానీ విష్వక్సేన్ వైఖరితో షాక్ తిన్నాడు… నష్టమైనా సరే, తన పరపతి దెబ్బతిని, ఇజ్జత్ పోవడంతో… ఇక విష్వక్సేన్‌తో సినిమా చేయకూడదని నిర్ణయించాడు, హీరోను తీసిపారేశాడు… అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బుల సంగతి తెలియదు… ఒక ఏరియా హక్కులు తీసేసుకున్నాడట… (టాలీవుడ్‌లో ఓ సాధారణ దృశ్యం)…

అసలు అర్జున్‌కే ఈ పరిస్థితి ఎదురైతే, ఇక అనామక దర్శకులు, నిర్మాతలు అయితే పరిస్థితి ఏమిటి..? రేప్పొద్దున విష్వక్సేన్‌తో సినిమాలు తీసే సాహసులు ఎవరు..? ‘‘42 ఏళ్ల కెరీర్‌లో ఎవరి గురించీ చెడ్డగా మాట్లాడలేదు నేను… కీలక షెడ్యూల్‌కు అంతా సిద్ధం చేశాం, హీరో ఓ మెసేజ్ పెట్టి సారీ, షూటింగ్ కేన్సిల్ అనేశాడు… హీరోకు ఓ మేనేజర్ ఉన్నాడు, నేను తరువాత మాట్లాడతాను మీతో అని ఫోన్ పెట్టేశాడు… నాకు జీర్ఖం కాలేదు, మరీ ఇంత అన్‌ప్రొఫెషనలిజమా..?

‘‘ఒక ప్రొడ్యూసర్‌కు, ఒక డైరెక్టర్‌కు మర్యాద లేదా..? సినిమా ఫంక్షన్లకు రావాలని ఆహ్వానిస్తే బాలకృష్ణ, అల్లు అర్జున్, జగపతిబాబు, వెంకటేష్, చిరంజీవి… ఎంత డబ్బున్నా, పరపతి ఉన్నా, స్టేటస్ ఉన్నా తోటి నటుల పట్ల పద్దతిగా వ్యవహరిస్తుంటారు… పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఓ ప్రొడక్షన్ బాయ్‌ను కూడా నిర్మాత సొంతంగా పెట్టుకోలేడు… ఇబ్బంది పెట్టాలని కాదు, ఇతరులకు ఇదే స్థితి రాకూడదని ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు చెబుతాను… ఎస్, వేరే హీరోతో అదే కథతో, ఆ టెక్నిషియన్లతోనే సినిమాను మొదటి నుంచీ ప్రారంభిస్తాను… ఇదొక చేదు అనుభవం…’’ ఇంత చెబుతూ ఒక్కమాట తూలలేదు, ఎక్కడా సంస్కారాన్ని కోల్పోలేదు… దటీజ్ అర్జున్…

arjun

విష్వక్సేన్ ప్లేసులో శర్వానంద్‌ను తీసుకుంటాడు అని వార్తలొచ్చినయ్… కానీ అర్జున్ ఎవరినీ తీసుకోలేదు… మొత్తం తెలుగు సినిమా నిర్మాణం నుంచే జంప్ అయిపోయాడు… తనకు మర్యాద ఇచ్చే పెద్ద హీరోలు బోలెడుమంది, అసలు తనే ఓ పెద్ద హీరో… మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను అడిగాడు… ఆయన రైట్ రైట్ అన్నాడు… దాంతో ఓ పాన్ ఇండియా సినిమాను ఇప్పుడు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు…

మోహన్‌లాల్‌తో ఓ సౌలభ్యం ఉంది… హీరోను అనే ఫోజులు, డిమాండ్లు తక్కువ… సెట్స్‌లో డౌన్ టు ఎర్త్ ఉంటాడంటారు మరి… అయిదారు నెలలు చాలు తను సినిమా కంప్లీట్ చేయడానికి… సినిమా మధ్యలో కొర్రీలు పెట్టడు… ఒకసారి దర్శకుడికి డేట్లు ఇచ్చాడంటే ఆ సినిమా పూర్తికావడానికి కొంత బాధ్యత ఫీలవుతాడు… రాబోయే యాక్షన్ ఎంటర్‌టెయినర్ మీద అర్జున్ పూర్తగా దృష్టి కేంద్రీకరిస్తున్నాడు ఇక… !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పోక్సో కేసులో లంచంగా ఆరు సమోసాలు… పోలీసుల ఇజ్జత్ తీసేశాడు…
  • మేజిక్ + హిప్నాటిజం + రచన + బోధన+ సైకాలజీ + కౌన్సెలింగ్… వాట్ నాట్..?
  • ఓ ప్రియురాలి పాదయాత్ర..! ప్రేమ + భక్తి + విశ్వాసం + వ్యక్తీకరణ…
  • సినిమాల క్లైమాక్స్ గొడవలు… ఎటూ తేలక, తేల్చలేక మథనాలు…
  • విలన్‌పై పగ తీరాలంటే విలన్ బిడ్డను పడేయాలా..? సినిమా నీతి అదే..!!
  • ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?
  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions