అప్పట్లో పెళ్లిచూపులు అనేది ఓ పెద్ద తతంగం… పెళ్లికి అది పీఠిక వంటిదన్నమాట… అబ్బాయి తరఫు ఓ పటాలం అమ్మాయి ఇంట్లో దిగేది… సంప్రదాయికమైన పరిచయాలు జరిగేవి ముందుగా… ఓ స్టాండర్డ్ టిఫిన్ మెనూ మరియు కాఫీ… కేసరి, వంకాయ బజ్జీ ఎక్కువగా ఉండేవి… లేదంటే ఇంకేదో స్వీటు, చేగోడీలు… (ఆ బజ్జీల నుంచి ఒకరిద్దరు పిల్లలు నూనె కూడా పిండేస్తూ కనిపిస్తారు…)
తరువాత అమ్మాయికి లిట్మస్ పరీక్ష ఉండేది… తండ్రి పిలవగానే వచ్చి కూర్చునేది… అందరి కళ్లూ ఆమెపైకి తిరుగుతాయి… ఆమె అబ్బాయి వంక దొంగ చూపులు చూస్తుంటుంది… తననే చూస్తున్న అబ్బాయి కళ్లతో కలుస్తాయి… వస్తే ఓపాట పాడుతుంది… పాడటం కూడా ఓ సంప్రదాయమే… అదెలా ఉన్నా సరే… కాబోయే అత్తగారి నుంచి ఒకటీరెండు ప్రశ్నలు వస్తాయి… నేను కాసేపు ప్రైవేటుగా మాట్లాడతాను అనే ధైర్యం అప్పట్లో అబ్బాయిలకు ఉండేది కాదు, అదడిగితే అందరూ వింతగా చూసేవాళ్లు కూడా…
ఈ మొత్తం ప్రహసనంలో అమ్మాయి ఇష్టాయిష్టాలు లెక్కలోకి వచ్చేవి కావు… కుటుంబాల నేపథ్యాలు, స్టేటస్ ఈ డీల్‌లో ప్రధానం… అబ్బాయి పొడుగా, పొట్టా, నలుపా, తెలుపా, గుడ్డా, చెవిటా వంటివి పరిగణనలోకి తీసుకోబడవు… అనగా అమ్మాయి తన అదృష్టాన్ని విధికి అప్పగించేస్తుంది… అప్పట్లో అమ్మాయిల పేర్లు కూడా కామన్‌గా ఉండేవి..
Ads
1963… మా ఊరికే చెందిన రఘు ఎగ్మూరులో బోట్ మెయిల్ ఎక్కాడు… అప్పట్లో సీట్ రిజర్వేషన్లు ఉండేవి కావు… రఘు త్వరగా వచ్చాడు కాబట్టి ఓ కంఫర్టబుల్ విండో సీట్ దొరికింది… హమ్మయ్య అనుకున్నాడు… తరువాత మరో కుర్రాడు బోగీ ఎక్కాడు… తన పేరు త్యాగు… రఘు కొంత అడ్జస్ట్ చేసి, తన పక్కన స్పేస్ చూపించాడు త్యాగుకు… థాంక్సండీ అని చెప్పి కూర్చున్నాడు… మాటల్లో పడ్డారు…
రఘు తిరువరూరు వెళ్లాలి… త్యాగు మాయావరం వెళ్లాలి… రైలు గమ్యం చేరగానే ఇద్దరూ మాయావరంలో దిగిపోయారు… అక్కడ త్యాగు తల్లిదండ్రులు ఉంటారు… రఘు తిరువరూరు వెళ్లడానికి మరో కనెక్టింగ్ రైలు పట్టుకున్నాడు… తన గ్రామం కక్కాలని చేరుకున్నాడు తెల్లవారుజామున… ఆరోజే తన చెల్లెలిని చూడటానికి ఓ పెళ్లికొడుకు పటాలం మాయావరం నుంచి రావల్సి ఉంది… దానికోసమే వచ్చాడు తను…
మధ్యాహ్నం భోజనవేళలు దాటాక మూడు గంటల ప్రాంతంలో గ్రామంలో నిశ్శబ్దం ఒక్కసారిగా బ్రేకయిపోయింది… పెద్దటి నల్ల డాడ్జ్ లిమోసిన్ ఊళ్లోకి అడుగుపెట్టింది… దుమ్ము రేగుతోంది… చక్కగా వచ్చి రఘు ఇంటి ముందు ఆగింది అది.. కారు డోర్లు తెరుచుకున్నాయి… రఘు ఆశ్చర్యపోయాడు… అందులో నుంచి త్యాగు తన చెల్లెలు, తల్లిదండ్రులతో దిగుతున్నాడు… ఒకరినొకరు చూసుకుని పలకరించుకున్నారు… ఆలింగనం చేసుకున్నారు… ఓహో, మీకు ఇంతకుముందే పరిచయం ఉందా అని ఇరుకుటుంబాల వాళ్లూ ఆశ్చర్యపోయారు…
ఓ తంతు ముగిసింది… త్యాగు రఘు వాళ్ల చెల్లెల్ని నచ్చాడు… ఆ జంట చూడముచ్చటగా ఉంది కూడా… పెద్దలు కూడా సంతోషపడ్డారు… అబ్బాయి తండ్రి తన కూతురు లతను అందరికీ పరిచయం చేసి, ఆమెకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పాడు… అదేసమయంలో రఘు ఆంటీ తన తల్లితో కలిసి కిచెన్ వైపు వెళ్లడం రఘు గమనించాడు.. తరువాత వాళ్లు రఘు తండ్రిని కూడా లోపలికి పిలిచారు…
నిజానికి అంతకుముందే రఘు త్యాగు చెల్లెలు లతను చూసి, అక్కడికక్కడే ఇష్టపడిపోయాడు… లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట… రఘు పేరెంట్స్ కిచెన్ నుంచి బయటికి వచ్చారు… రఘు తండ్రి త్యాగు తల్లిదండ్రులను ఉద్దేశించి… మీకు ఇష్టమైతే మీ లతను మా రఘుకు ఇచ్చి పెళ్లిచేద్దాం అని ప్రతిపాదించాడు…
వాళ్లు వోకే అనేశారు.. వాళ్లు వీళ్లకు ఇచ్చే కట్నం లేదు… వీళ్లు వాళ్లకు ఇచ్చేదేమీ లేదు… ఇరుపక్షాలు పెళ్లి ఖర్చులను చెరిసగం భరించాలి… వారంలో ఆ రెండు పెళ్లిళ్లూ అయిపోయాయి… ఆ రోజుల్లో ఇవ్వడం, పుచ్చుకోవడం సహజంగా జరిగిపోయేది… కుండమార్పిడి సంబంధాలు… ఉమ్మడి కుటుంబాల్లో కొంచెం ఎక్కువగా కనిపించేవి… గొడవలు తక్కువగా జరిగేవి… ఆ ఇంట్లో మా అమ్మాయి ఉందనే భయం, క్రమశిక్షణ వల్ల ఇరు కుటుంబాలూ గొడవపడేవి కావు… అబ్బే, ఇప్పుడు ఇలాంటి కుండమార్పిళ్లు చాలా చాలా తక్కువ… సినిమాల్లో అప్పుడప్పుడూ చూస్తుంటాం… ఆమధ్య వచ్చిన గీతగోవిందం సినిమాలో ఓ కుండమార్పిడి పెళ్లి కనిపించింది..!!
(Face Book లో కనిపించిన ఓ ఇంగ్లిష్ పోస్టుకు నా స్వేచ్ఛానువాదం ఇది…) ఇంతకీ ఈ కుండమార్పిడి ఎందుకు గుర్తొచ్చిందంటారా..? ఈ తాజా వార్త చదువుతుంటే, దీన్ని కూడా కుండమార్పిడి అనొచ్చా అనే పిచ్చి సందేహం ఒకటి తలెత్తి, ఆ కథ కూడా యాదికొచ్చింది… ఈ వార్త సారాంశం ఏమిటంటే… పెళ్లయిన 14 ఏళ్లకు ఓ మహిళ తన ప్రియుడితో లేచిపోయింది… సదరు మహిళ భర్త ఆ ప్రియుడి పెళ్లాన్ని లేపుకుపోయి పెళ్లిచేసుకున్నాడు…!!
Share this Article