బలగం సినిమా రిలీజ్ కావల్సి ఉంది… జబర్దస్త్ షో ద్వారా మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న వేణు దీనికి దర్శకుడు… దిల్ రాజు నిర్మాత… నిన్న సిరిసిల్లలో బహిరంగసభ పెట్టి, కేటీయార్ ముఖ్య అతిథిగా ప్రిరిలీజ్ ఫంక్షన్ చేశారు… ఈ ఫంక్షన్ నిర్వహణ, కేటీయార్ ముఖ్య అతిథి అనే ఆలోచన వెనుక దిల్ రాజుకు ఏవో ప్రయోజనాలు ఉండి ఉంటాయి… లేకపోతే రూపాయి కూడా ఖర్చు పెట్టని సినిమా వ్యాపారి తను…
ఆల్రెడీ పెయిడ్ రివ్యూలు స్టార్టయిపోయాయి… సినిమా ఆహా ఓహో అంటూ… వోకే, సినిమా బాగానే ఉంటే చాలా మంచిది… తెలంగాణ ఆత్మను ఆవిష్కరింపజేసే సినిమాకు హిట్ గౌరవం దక్కితే సంతోషమే… కాకపోతే దిల్ రాజుకు తెలంగాణతనం గుర్తురావడమే అతి పెద్ద సంభ్రమాశ్చర్యం… అందులో కాసర్ల శ్యాం రాసి, భీమ్స్ కంపోజ్ చేసిన పాటల ‘తెలంగాణతనం’ గురించి ముచ్చట కూడా ఇప్పటికే కథనాలు వెలువరించింది… అభినందించింది…. అయితే ఈ సినిమా కథ నేను గతంలో రాసిన ఓ కథకు కాపీ అని గడ్డం సతీష్ ఆరోపిస్తున్నాడు…
సినిమా కథ లైన్‌లో ప్రధానమైంది… కాకి పిండం ముట్టకపోవడం… మరణించిన వాళ్ల కోరికలు తీరకపోతే ఒక్క కాకీ రాదు, పిండం ముట్టదు… సినిమా కథ లైన్ కూడా దాని చుట్టే రాసుకోబడింది… గడ్డం సతీష్ రాసిన కథ కూడా అచ్చమైన తెలంగాణా మాండలికంలో ఉంటుంది… అందులో మెయిన్ ప్లాట్ కూడా పిండాన్ని కాకి ముట్టకపోవడమే… సిమిలర్ లైన్స్… ఆ లైన్ చుట్టూ అల్లుకున్న కథ మాత్రం వేరు…
Ads
తన ఒరిజినల్ కథలోని ఆ లైన్ తీసుకున్నందుకు సతీష్‌ను అడిగితే బాగుండేది… అక్కడ దిల్ రాజు అహం అడ్డం వచ్చిందేమో మరి… లేదా తెలియకపోవచ్చు కూడా… లేదా అసలు కథంతా వేరే కదా అని దర్శకుడు వేణు అనుకోవచ్చు… కానీ ఒక కథలోని మెయిన్ లైన్ వాడుకుంటున్నప్పుడు అడగడం, అనుమతి తీసుకోవడం, ఏమైనా చెల్లించడం మర్యాద… బలగం టీమ్ దాన్ని ఉల్లంఘించింది… కాకి పిండం ముట్టడం అనేది సహజమైన లోకనానుడే కదా, ఎవరికి ఏం పేటెంట్ ఉంటుందీ అనడం కూడా తప్పే… ఆ పాయింట్ మీద కథ రాశాడు కాబట్టి గడ్డం సతీష్‌కు ఈ కథపై కొన్ని అనిర్వచనీయ హక్కులున్నాయనే అనుకోవాలి మనం…
Sathish Gaddam ఫేస్‌బుక్ వాల్ మీద రాసుకున్న పోస్టు… దాని కిందే ఒరిజినల్ కథ…
రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ భాషనే అస్త్రంగా జేసుకొని కథల రూపంలో నా నిరసన తెలిపిన. అందులో భాగంగనే 2011లో రాసిన కథ ‘పచ్చికి’. ఆ కథ 2014లో డిసెంబర్ 14న అచ్చయింది. 2014 నాటి “పచ్చికే”… నేటి “బలగం”… కాపీ కొట్టినా తెలంగాణ ఆత్మ మరోసారి తెరపై కనవడ్డందుకు సంబురంగున్నది. సినిమా పేరు మార్చి కొంచెం కొత్త కోణం యాడ్ జేస్తే అయిపాయె..
==========
==========
ఆయిటి మూనింది. నల్లటి మబ్బులతో మొగులు మొత్తం చిమ్మ చీకటైంది. గొంతెండిపోయిన భూతల్లి నీటిసుక్క కోసం గోస గోసోలె సూత్తంది. ఎవుసందారులు నొసలుకు చేతిమట్ట అడ్డంపెట్టి మొగులు దిక్కు సూడవట్టి వారం దాటింది. ఇన్ని రోజులకు కొద్దిగంత మొగులు నల్లగయ్యేసరికి పోయిన పానం లేసచ్చినట్టయింది ఒక్కొక్కలికి.
* * *
మల్లయ్య కాలం చేసి సరిగ్గా మూడు దినాలైంది. అవ్వల్లో… ఏ ఊకోర్రి. పోయినోడు లేసత్తడా…? వాడేమన్న పసివోరడా, ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టిండు. సూడాల్సినయన్ని సూసిండు. చేయాల్సినయన్ని చేసిండు, ఇంతకుమించి ఇంకేం కావాలి. ఓ దిక్కు రాత్రంత ఇసిరిసిరి సంపి ఎగిలివారంగనే గెరువిచ్చింది వాన. లెవ్వుర్రి లెవ్వురి జెప్పన కాట్నం కాడికి పొయ్ రావాలె, మల్ల వానందుకునే అందాద గొడ్తంది.తిరుగువారం దాటింది మక్కిత్తులేసి. ఒక డల్లు వాన వడంగనే మక్కసేను సుట్టే తిరుగుతుంది రాజయ్య పానం. ఆయిల్లటి వానకన్న మక్కలు మొలకెత్తినయో లేదో… మొలకెత్తనయి ఏమన్న ఉంటే కాలి బొటనేలుతోని పెకిలిచ్చి సూడాలె అని మనసులనుకున్నడు రాజయ్య.
అరేయ్ భూమా… నువ్వు లెవ్‌రా. వాళ్లు గట్లనే ఏడ్సుకుంట ఉంటరు. వాన పాడుగాను మల్ల పడేటట్టే ఉంది. పద్దుమ మక్కకున్నెలు, గ్యాస్‌నూనె, ఇన్ని ఏరు గున్నెలు అన్ని కలిపి ఒక బేసిన్‌తట్టల ఎయ్యిర్రి. ఇగ ముసలోడు ఏమేం బామకొద్ది తింటుండెనో అన్ని ఒక తట్టలేసి ఒగల్నెక ఒగలు వాగ్గడ్డ్డకు నడువుర్రి. ఒక్కపారి ఇంటిమొకాన పొయ్యత్త అన్నడు రాజయ్య.
అవ్వా పొద్దు గూకేసరికి ఇంత చింతపండు నాన వెట్టుంచె, ఇన్ని గుర్జెపిల్లల్దెత్త.
ఓ పోడా… గీ సుట్టుముట్టుడుల శాపలెందుకురా, ఎవడన్న సూత్తె నవ్వనోడాల్ల నవ్వుతడు.
నీ అవ్వా… ఆయిల్ల ఇసిరిసిరి సంపిన వానకు చెర్ల శాపలన్ని శెంగలిత్తయె. తిరిగి తిరిగి నెరివడి ఉట్టిగనే సేతికి చిక్కుతయ్.
చెర్లకు కొత్త నీరచ్చిందిరా, ఇంకా మైసవ్వతల్లికి యాటనన్న తెంపలె. వద్దుబిడ్డ చెరువు మొకాన వోకురా, అటువోతె మైసమ్మ మింగుతదిరా.
మైసమ్మ లేద్ పోచమ్మ లేద్. ఎటూచేసి ఇయ్యాల్ల చెర్లకు పోవాలె, గుర్జపిల్లల్దేవాలె. అనుకుంట గడపదాటిండు రాజుగాడు. రాజుగాడిప్పుడు నాల్గో తరగతి పుస్తకాలు సదువుతండు.
ఏన్నన్నవోరా… నీ దినాల్‌గాను, నీ వారాల్‌గాను, నిన్ను మైసమ్మ మింగ, నీ మొల్దారం దెంప. నేన్జెప్పుతే నువ్వింటవా అని కోపంగా తిడుతంది దేవవ్వ.
ఏందే పొద్దుగాల్ల పొద్దుగాల్ల నోరు లగాంచి లేత్తంది. ఎట్లవడ్తె అట్లనే తిడుతున్నవ్ పోరన్ని. బుజాన ఉన్న తువ్వాల మూలకున్న బల్లమీదికి ఇసిరికొట్టి గోలెంలున్న నీళ్లతోని కాళ్లు కడుక్కుంటండు రాజయ్య. అగో ఇప్పటిదాంక లేకపాయే గీ మనిషి ఎప్పుడచ్చే అనుకుంట కడప మొకాన సూసింది దేవవ్వ. రాజయ్య కనవడంగనే ఆయిల్ల కుండాపోత వోసింది వాన. ఆ మక్కశేనుకాడికి పొయ్యన్న అందాం, మక్క ఉందో పోయిందోనన్న సోయి ఉందా నీకేమన్న. ఓ… ఎగిలివారంగనే లేసురికినవ్ ఓటల్ కాడికి. ఎత్తిపాయె, పడిపాయె అన్నట్టు. దేవవ్వ తిట్ల దండకం రాజయ్య మీదికి మర్రింది.
ఇగో ఒర్రుడు బంద్‌జేత్తవా… లేదా? దేవవ్వను సూసుకుంట గుడ్లురిమిండు రాజయ్య. కొంక వట్టుకొని నువ్ కట్టమీదికెల్లి సేనుకాడికి నడువ్. నేను సిన్నాయిన కాట్నం కాడికి వొయి పచ్చికి వెట్టి ఆనంగల అటే అస్తా అన్ని దేవవ్వకు సెప్పిండు రాజయ్య.
ఆ… మా అస్తవ్ తియ్, నిన్న రాలేదా, మొన్న రాలేదా, ఇయ్యాల్ల గూడ అస్తవ్. నీ అచ్చుడు కగ్గితల్గ. చేసిచేసి నా రెక్కలన్ని దగ్గరవడ్డయ్. నువ్వు ఇయ్యాలగిట్ల రాలేదన్కో పెద్దలచ్మి నల్లేర రమ్మన్నది. ఇగ గా నల్లేరనే వోత. నువ్వు, నీ మక్కసేను గంగల కల్వనీ… గోదాట్ల కల్వనీ… అంటూ రాజయ్య దిక్కు నాల్క మర్రేసి సూసింది దేవవ్వ.
దేవా నోర్ముయ్యే, నీ అచ్చుడు పాడుగాను. మా అత్తగని ఊకే ఒర్రకే. ఒర్రీ, ఒర్రీ నోరు బొంగురు వోతలేదే నీకు దేవవ్వేమో అగ్గిమీద గుగ్గిలమైతంది. రాజయ్యనేమో ముద్దుగ దేవా. అని చెప్పుకుంట బల్లమీదున్న తువ్వాల మల్ల బుజం మీదేసి శంకర్ బీడీ ముట్టించి బయటవడ్డడు.
అగో ఇదేందిరో… ఓ దిక్కు ముల్లేమో ఏడు మీద కూసుంది, మీరేమో నడివాకిట్ల కూసున్నరు. నడువుర్రి నడువుర్రి పొద్దువోతంది. అంటూ వాడకట్టు మొత్తం ఇనవడేటట్టు కేకేసిండు రాజయ్య.
మల్లయ్య పాలొల్లందరూ గుంపుగా ఒక్కచోట చేరిర్రు. తల్లికి తొలిసూరు కొడుకెట్లనో మాకు నువ్వట్ల. నువ్వు లేంది మేమెట్ల వోతం అని గుంపులకెల్లి ఎవ్వలో సిన్నగన్నరు. ఓ… మా సింగారమే తియ్. అంటూ మల్ల కీసలకెల్లి శంకర్ బీడీ తీసి ముట్టిచ్చిండు రాజయ్య.
అరేయ్ భూమా నువ్ ముందు నడువ్‌రా అని రాజయ్య అనంగనే తడిసిన బనీను, లుంగి కట్టుకొని ఎడమ బుజం మీద బేసిన్‌తట్ట వెట్టుకొని గజగజ వణుక్కుంట ఇంట్లకెల్లి బయటికచ్చిండు భూమయ్య.
భూమయ్యను వట్టుకొని ముందు నడుస్తండు రాజయ్య. వీళ్లెంబడి పాలొల్లు చీమల దారోలె నడుస్తుర్రు. వీళ్ల తొవ్వ వాగ్గడ్డకు సాగుతంది.
ఓ పోడా మూడు రౌతులు సక్కటియి ఏరుకరాపోరా అక్కడున్న రాజుగానికి పనిచెప్పిండు రాజయ్య. ఏ తియ్యే రాజన్న మా సాలుగని, గీ కాటికాడి పన్జెప్తావె గా పసివోరనికి పక్కనే ఉన్న రైస్‌మిల్లు పనికివొయి అప్పుడే అచ్చిన ఆదిరెడ్డి అక్కడక్కన్నే తిరిగి మూడు రౌతులు సంపాయించిండు. రాజన్న ఈ రౌతులేడవెట్టాన్నే దీర్గాలు తీసుకుంట రాజయ్యనడిగిండు ఆదిరెడ్డి.
ఇగో గీడ… ఈ జపాన్‌చెట్టు ఒచ్చోరకు వెట్ర. గాడుపు దువారం వచ్చినా ఏంగాదు. అని రాజయ్య చెప్పంగనే జపాన్ చెట్టుకింద మూడు రౌతులు మంచిగ పొందిచ్చిండు యాదిరెడ్డి.
మొగోళ్లేమో వాళ్ల పని వాళ్లు చేసుకుంటర్రు. ఆడోళ్లేమో అందరొక్కదగ్గర మర్రిచెట్టు కింద కూసోని ముచ్చటవెడ్తుర్రు. ఓ బావ, జెల్ది గానియ్యిర్రి, జెల్దిగానియ్యిర్రి. వరుసకు మర్దలయ్యేటామె ఆ గుంపులకెల్లి రాజయ్యను ఎగిర్తవెడ్తంది.
ఇంటికాడ అన్ని సౌలత్ ఉంటే అండినట్టుగాదు, ఈడ అండుతే తెలుస్తది బాదేందో. మర్దలు తోటి పరాష్కం ఆడుతండు రాజయ్య.
ఆదిరెడ్డిని ఆ మిల్లు పక్కనున్న ఉనుక తెమ్మను. ఉనుకవోసి దానిమీద పొయిరాళ్లు వెడితే మంచిగంటుకుంటది. తనకు దోసింది రాజయ్యకు చెప్పింది.
ఇక్కడున్నోళ్లంత మల్లయ్యకు పాలొల్లు. సుట్టుముట్టుడుతోని పది దినాలుండేటొళ్లు.
అరేయ్ భూమ… బేసిన్ తట్టలకెళ్లి ఒక చిన్నగంజు తీస్కొని దాంట్ల పిరికెడన్ని బియ్యం పొయ్‌రా అన్నడు రాజయ్య. బియ్యం కడ్గి గంజు పొయ్యిమీద పెట్టిండు భూమయ్య.
ఇవ్వారకు పొయ్యెట్లుంటదో తెల్వది భూమయ్యకు. కని అగ్గివట్టినోడే గీ పొయ్యిమీద అన్నం కూరండాలి. ఈ పొయ్యిని గానీ, భూమయ్యను గానీ ఎవ్వలు ముట్టుకోవద్దు. సచ్చిపోయినానె ఆత్మ శాంతించాలంటే భూమయ్యనే వండి కాట్నం కాడ తలాపుకు పిట్టల కోసం వెట్టాలె. ఇట్ల ఎనకటికెళ్లి వీళ్ల పెద్దలు నడుస్తుర్రు. వాళ్లెనక వీళ్లుకూడా అదే తొవ్వన నడుస్తుర్రు.
అలవాటు లేని పానం పొయ్యికాడ కూసునేసరికి కండ్లళ్ల పొగసూరి నీళ్లు వలవల అడుస్తున్నయ్ భూమయ్యకు. ఓ పిల్లగా, తపుకుతోని పొయ్యి సురు, మంచిగ మండుతది. అని భూమయ్యకు వరుసకు వదినయ్యేటామె చెప్పింది.
తపుకుతోని పొయ్యిసిరిండు భూమయ్య. పొగ బందైంది. పొయ్యికింద మంట ఎగేసుకుంట మండుతంది. అన్నం తుకతుక ఉడుకుతంది.
ఇక్కన్నే తొమ్మిది గొట్టవట్టె కైకిలి పొయ్యేసరికి ఏ పదకొండైతదో, ఏ పన్నెండైతదో… దీర్గాల్దీత్తంది ఆదిరెడ్డి పెళ్లాం పెంటవ్వ.
నీ కైకిలి పాడుగాను ఇయ్యాళ్లొక్కరోజు పోకుంటే ఏమైతదే, ముసలోని కన్న ఎక్కువనా నీ కైకిలి పెంటవ్వకు వరుసకు వదినయ్యేటామె డొక్కల వొడుసుకుంట గునుగుతంది.
రాజుగాడేమో చెర్ల శాపలు ఎక్కడ దెంకపోతయోనని రందివడ్తండు. దేవవ్వ ఏడ తిట్టి సాపిత్తందోనని రాజయ్య మనసుల మసులుకుంటండు.
అన్నమైందే రాజన్న నోట్లెకెళ్లి గూత వణుక్కుంట అత్తంది భూమయ్యకు. ఎటో బీరిపోయి ఆలోచిస్తున్న రాజయ్య ఆ..ఆ.. అన్నమైందా? ఐతే కిందికి దించి కూరకంచుడు పొయ్యిమీద వెట్రా అని భూమయ్యకు చెప్పిండు.
మసికంత పేగు కోసం అటూఇటూ చూసిండు భూమయ్య. నా మతిమండ మసికంత పేగు బేసిన్ తట్టలేసుడు మర్సిపోయిన అని నెత్తిమీది నుంచి ఒక్కటి సర్సుకుంది పద్దుమ.
వాగ్గడ్డకు ఏం, దొర్కయి. మర్సిపోకుంట అన్నెయ్యిర్రి అన్జెప్పిన. నా మాటింటె కదా! రాజయ్య మందికినవడేటట్టు ఒర్రుతండు.
ఈ బడాయి రాజయ్య బావకు సందు దొర్కుడు పాపం. పదిమందిల ఇజ్జతి, మానం దీత్తడు లోలోపల గునుక్కుంట మోత్కాకులు తెంపుకచ్చి పెనిమిటికిచ్చింది పద్దుమ. మోత్కాకులతో అన్నం గంజు దించి పక్కకు వెట్టిండు భూమయ్య.
కూరో, నారో ఏమన్న తెచ్చిర్రానె అంటూ పద్దుమ మొకం చూసిండు రాజయ్య. బేసిన్ తట్టల వెట్టిన నల్లవరుకు పెనిమిటి చేతికిచ్చింది పద్దుమ.
ఓ… బాగనే తెచ్చిర్రుగదా కూర. అది గంజుల వడ్తాదె, ముసలోడు బతికున్నప్పుడన్న ఇంతగనం కూర తిన్నడో, లేదో… నల్ల వరుకులున్న కొంచెం కూరను చూసుకుంట పద్దుమతోని కారడ్డమాడుతండు రాజయ్య. మర్రిచెట్టు కిందున్న ఆడోళ్లు మూతులకు చీరకొంగులడ్డం పెట్టుకొని ముసిముసిగ నవ్వుతుండ్రు. పైకి అట్ల కనవడుతున్న లోలోపల రాజయ్యను కడిగిపారేస్తంది పద్దుమ.
ఉప్పుకారం దగ్గట్టెయ్రిర్రి. ముసలోడు ఉప్పుకారం తక్కువుంటే బుక్క గూడ నోట్లె వెట్టకపోతుండే ఆదిరెడ్డి పెళ్లాం మర్రిచెట్టు కింది నుంచి కేకలేస్తంది.
ఎయ్‌రా భూమ ఎయ్, అన్ని దగ్గట్టెయి. భూమయ్యకు పక్కకుండి కూరల ఉప్పుకారం, మసాలలు కలుపుడు చెప్తండు రాజయ్య.
కూరగంచుడు పొయ్యి మీద పెట్టి కూరను నూనెల తుకతుక ఉడికిచ్చిండు భూమయ్య.
అరేయ్ ఆదిరెడ్డి ఆరేడు మోత్కాకులు తేపోరా రాజయ్య చెప్పంగనే మోత్కాకులు తెచ్చి ఇస్తారి కుట్టనే కుట్టిండు యాదిరెడ్డి.
ఓ దిక్కు అన్నం, ఇంకోదిక్కు కూర, డబ్బల్‌రొట్టె, ఓ గిలాసల ఇంత చాయబొట్టు, ఇంకో గిలాసల ఇంత కల్లుబొట్టు పెట్టి భూమయ్యతోని ఇస్తారి మొత్తం నింపిచ్చిండు రాజయ్య.
మొట్టమొదలు భూమయ్య పెళ్లాం పద్దుమను, ఇద్దరు పోరగాండ్లను వట్టుకొని అయ్యా నీ బాంఛెన్, ఏమన్న తప్పుంటే క్షమించు. ఉన్నకాడికి మంచిగ తృప్తి చేసుకో అని కళ్లు మూస్కోని రెండు చేతుల దణ్ణంపెట్టి మల్లయ్యకు మొక్కిండు.
వీళ్లెన్క ఒగల్నెకొగలు పాలోల్లందరూ ఇత్తారికడ్డం వేలుపొంట కల్లుబొట్టు జారిడిసి రెండుచేతుల దణ్ణం బెట్టుకుంట అందరూ మర్రిచెట్టు కిందికి చేరిండ్రు.
ఈ కాకులకు గత్తర్రాను, ఉట్టప్పుడు మీద వడ్డట్టే తిరుగుతయ్ గీ ఎగిర్తానికి ఒక్కటన్న ఇటు మొకాన అస్తలేద్ మనసుల గునుక్కుంటంది పెంటవ్వ. ఇంకా ఆల్ష్యమయితే కైకిలికి రానిత్తరో రానియ్యరోనని పెంటవ్వ బాధ. అప్పటికే టైం పది గొడ్తంది.
రాజుగాని పానమంత చెర్ల చాపలమీదికి కొట్టుకుంటంది.
ఎప్పుడు కాకచ్చి ఇత్తారి ముడతదో అప్పుడు మల్లయ్య ఆత్మకు తృప్తి అయిందనుకొని వీళ్లందరు ఇక్కడికెళ్లి ఇంటికి వోతరు.
దగ్గరదగ్గర గంటైతంది మల్లయ్య కాట్నం తలాపుకు ఇస్తారి వెట్టి, ఒక్క కాకి కూడా ఇటు మొకాన అత్తలేదు, ఏమన్న మర్సిపోయినమా అని ఆలోచన్ల వడ్డడు రాజయ్య.
ముసలోనికి శంకర్ బీడీలంటే బాగ ఇష్టం. అవ్వి గిట్ల పెట్టలేదని ముసలోడు అలిగిండో మన్నో అక్కడున్న ఆదిరెడ్డి బీడీల ముచ్చట గుర్తుచేసిండు. అవునేమొరా యాదిగా… అస్సలియే మర్సిపోయినం. అని జేబులకెళ్లి రెండు శంకర్‌బీడీలు తీసి భూమయ్యకిచ్చి ఇత్తార్ల పెట్టిరాపోరా అని పంపిండు రాజయ్య.
రాజయ్యేమో ఇత్తారిమొకాన సూత్తండు. అందరేమో మొగులు దిక్కు, చెట్లమీదికి సూత్తర్రు. ఎక్కడ గూడ ఒక్క కాకి కనవడ్తలేదు.
ముసలోడు తినేటియి ఏమన్న మర్సిపోయినామె పద్దుమ. పద్దుమనడిగిండు రాజయ్య. మామ ఇంకేం బామ కొద్ది తింటుండెనోనని ఆలోచన్ల వడ్డది పద్మ.
ఇంట్లకెళ్లి తెచ్చిన బత్తాయికాయ ఇత్తార్ల వెట్టుడు మర్సిపోయింది పద్దుమ. బత్తాయికాయ బామకొద్ది తింటుండే మామ, నేనది తెచ్చినగని ఇత్తార్ల వెట్టుడు మర్సిపోయిన అని రాజయ్యకు చెప్పింది పద్దుమ.
ఇగొ గిదే తెలివితక్కువ పనంటే. తే తే జల్దితే గా బత్తాయికాయ జల్దియి అని పద్దుమ మొకం గుర్కాయించి సూత్తండు రాజయ్య.
అందుకే కావచ్చు కనుమేర గూడ కనవడ్తలేవు కాకులు. అరేయ్ భూమ ఇగొ గీ బత్తాయికాయ తీస్కొని ఇత్తార్ల వెట్టి తప్పైందే నాయినా అని చెంప దెబ్బలేస్కొని, రెండు గుంజీలు తీసిరాపో అని భూమయ్యను మల్ల ఇత్తారికాడికి తోలిండు రాజయ్య.
బత్తాయికాయ పెట్టి అద్దగంటాయే.. అయినా, ఒక్క కాకి గూడ ఇటు మొకాన అస్తలేదు. రాత్రి మిల్లుపనికి పొయ్యచ్చిన ఆదిరెడ్డికేమో కునుకు మీద కునుకొస్తంది. నిలుసున్న కాన్నే సొలుగుతండు ఆదిరెడ్డి.
పెంటవ్వేమో కైకిలేడ లాస్ అయితనో అని లోలోపల గుణుక్కుంటంది. రాజుగాని మనసేమో చెర్ల శాపల కాడ కొట్టుకుంటంది.
ముసల్ది కాటికాడికి రాలేదని గిట్ల అలిగిండా? ఏంది ముసలోడు మనసులున్న మాట బయటవెట్టింది పెంటవ్వ.
ముసల్ది ఏడచ్చేటట్టుందే, ముసలోనికి తెల్వదా ఆ ముచ్చట. మంచాలకెళ్లి లేత్తనే లేకపాయె. ఈ ముసురుకు అది ఇక్కడికస్తే అదిగూడ కాటికి దగ్గరవడ్తది పెంటవ్వకు కొంచెం కసురుకుంట సమాధానం చెప్పిండు రాజయ్య.
ఎందుకైన మంచిదేరా, భూమ, అవ్వను ఐదొద్దులల్ల కాటికాడికి తీసుకత్తగని ఇయ్యాైల్లెతే పచ్చి ముట్టని మొక్కిరాపో అని భూమయ్యను మళ్ల ఇత్తారి కాడికి తోలిచ్చిండు రాజయ్య.
ఇత్తారి పచ్చి ముట్టేదాంక ఎవ్వల్‌గూడ ఇక్కడికెళ్లి పోవద్దాయే. అందరు బీరిపోయి ఇత్తారిమొకాన్నే సూత్తర్రు. కాకి అచ్చుడు లేదు, ఇత్తారి ముట్టుడు లేదు. అందరు ఒక్కసారి మనసుల మొక్కుకున్నరు మల్లయ్యకు. ఊహూ… కాకుల జాడ లేదు, పత్తాలేద్.
ముసలోనికి పైసలంటే బాగ తీపుండే. ఒక ఐదు రూపాల నోటు ఇత్తారి పక్కకు పెట్టియ్యే రాజన్న, అప్పుడన్న కాకులు ఇటు మొకాన వస్తయ్ కావొచ్చు అని రాజయ్యకు చెప్పిండు ఆదిరెడ్డి.
అరేయ్ ఒక్కపారి వొయి ఈ నోటు ఇత్తారి పక్కకు వెట్టిరాపోరా అని జేబులకెళ్లి పదిరూపాల నోటు తీసిచ్చిండు రాజయ్య. సరేనని పదిరూపాల నోటు తీస్కవొయి ఇత్తారి పక్కకువెట్టి మల్లోసారి నాయినకు మంచిగ మొక్కి వచ్చిండు భూమయ్య.
శ్మశానం మొత్తం సడీ సప్పుడు లేకుండుంది. అడుగు తీసి అడుగేస్తే మర్రాకుల సప్పుడు పలపలమని ఇనిపిస్తది.
మొత్తమ్మంది మనసువెట్టి ఇత్తారాకు మొకాన్నే సూత్తండ్రు.
తన సుట్టూరా ఉన్న అందరి మొకాలు ఒక్కసారి చూసిండు రాజుగాడు. అందరు ఇత్తారి మొకాన్నే సూత్తండ్రు గుడ్లప్పగించి.
నిలుసుండి నిలుసుండి యాట్టకచ్చిన రాజుగాడు అక్కడికెళ్లి బైటవడాలనుకున్నడు. అనుకున్నట్టే ఎవ్వరు సూడ ముందు సైకిల్ వట్టుకొని మెల్లగ ఆవలవడ్డడు.
ఓరి పోడా, కాకులచ్చి పచ్చి ముట్టేదాంక ఎటు కదులొద్దురా సైకిల్ మీద పొయ్యే రాజుగాన్ని సూసుకుంట కేకేసిండు రాజయ్య. ఏ తియ్యే రాజన్న, ఆ పసివోరనికి పట్టింపులెక్కడియె అన్నడు ఆదిరెడ్డి.
ముల్లుగంట పదకొండు మీద గొడ్తంది కాకుల ఊసేలేదు. ఇగ నేనన్న ఒక్కపారి సిన్నాయినకు మొక్కన్న అస్తా అని మనుసులనుకున్నడు రాజయ్య.
కాట్నం కాడ తలాపుకున్న ఇత్తారి ముందు నిలవడి మల్లొక్కసారి రెండేళ్లతో కల్లుబొట్టు జారిడిసిండు రాజయ్య. సిన్నాయిన, నీ కంటే సిన్న పోరగాండ్లం. తెలిసో తెల్వకనో చిన్నచిన్న తప్పులు చేసినం కావచ్చు. పెద్దమనసు చేసుకొని మమ్మల్నందర్ని క్షమించి పచ్చి ముట్టే. జర నీ దయుంటది అని రెండు చేతుల దణ్నం పెట్టి మనసుల మొక్కుకున్నడు రాజయ్య.
మర్రిచెట్టు ఎన్కకెళ్లి సైకిల్ గంట ఒక్కటే మొకాన రికాం లేకుండ ఇనవడ్తంది. ఈ సప్పుడేందిరా మర్రిచెట్టు కింద ఉన్నోళ్లు ఎన్కకు తిరిగి చూసిర్రు. ఆ సైకిల్ మీద రాజుగాడు యీరో లెక్క అస్తండు. ఆ సైకిల్ హ్యాండిల్‌కు తలిగేసుంది పక్షుల బోను.
కాలుస్యం వల్ల ఎగిరే పక్షులు, పిట్టలు సచ్చిపోతయని, వాటిని మనం కాపాడుకోకుంటే ముందు ముందు పుట్టే పోరగాండ్లకు పక్షులు, పిట్టలంటే ఏంటియో కూడా తెల్వకుండ వోతదని మా సామాన్య టీచర్ చెప్పింది.
నెలకింద నేన్ సైకిల్ మీద ఈనంగల పొలంకాడికి వొయిన. నేను పోతాఉంటే ఒక్కపారి నా మీద ఈ కాకిపిల్ల వడ్డది. ఇది ఎక్కన్నుంచి వడ్డదో సమజ్ గాలె. సైకిల్ స్టాండేసి కాకిపిల్లను చేతవట్టుకొని సుట్టు తిరిగి సూసిన. నాకు మొత్తం రైస్‌మిల్లులు కనవడ్డయ్. అన్లకెళ్లి వచ్చే పొగతోని నాకే కళ్లు బైర్లు కమ్మినయ్. ఇగ అన్లకెళ్లి వచ్చే సప్పుడుకైతె మనసున వట్టలేదనుకో. నాకు మా సామాన్య టీచర్ యాదికొచ్చింది. ఈ కాకిపిల్లను తీస్కవొయి ఎవ్వరికి తెల్వకుండ పొలంకాడ పెంచి, పెద్దచేసిన. నాల్గు గంటల నుంచి ఒక్కకాకి గూడ ఇటుమొకాన రాకపోయేసరికి ఇక్కడున్న కాకులు, పిట్టలు సచ్చిపోయినయని అర్థమైంది. ఒక్కపారి నేను పెంచుకున్న కాకి గుర్తుకొచ్చింది. అదుకే పొలంకాడికి వొయి ఈ కాకిని తీస్కచ్చిన.
రాజుగాడు చెప్పిన మాటలకు అందరు సంబురవడ్డరు. ఇంకా సూత్తవేందె రాజన్న ఆ కాకిని బోన్లకెళ్లి తియ్యే అని రాజయ్యకు చెప్పిండు ఆదిరెడ్డి. రాజుగాని బోన్లకెళ్లి కాకిని తీస్కవొయి కాట్నం తలాపున ఇడిసిపెట్టిండు రాజయ్య.
మర్రిచెట్టు కిందినుంచి అందరూ కాకి దిక్కే సూత్తర్రు. కాకి కాట్నం కాన్నే అటూ ఇటూ తిరుగుతంది కానీ ఇత్తారి ముడుతలేదు.
రాజుగానికేమో శాపల్ గుర్తుకొస్తున్నయ్, రాజయ్యకేమో దేవవ్వ యాదికొస్తంది. పెంటవ్వకేమో కైకిలి గుర్తుకొస్తంది.
సిన్నాయినా, నీ బాంఛెన్, ఏమన్న తప్పుంటే సూసి సూడనట్టు వోయే అని మనుసుల మల్లొక్కసారి మంచిగ మొక్కుకున్నడు రాజయ్య.
కాకి సర్రాసున వొయి డబ్బల్‌రొట్టె అందుకొని తుర్రుమని ఎగిరిపోయింది.
డబ్బల్‌రొట్టె అంటే ముసలోనికి ఎంతో బాముండె అని ఎవ్వలో ఎన్కకెళ్లి అన్నరు. అక్కడున్నోల్లందరూ పళ్లిగిలిచ్చి పకపక నవ్విర్రు…
https://en.wikipedia.org/wiki/Thithi_(film)
2015లో వచ్చిన తిథి అనే కన్నడ సినిమా కూడా సేమ్ టు సేమ్ బలగం లైన్ మీదనే ఉంటది…. ఇంకొన్ని కూడా ఉన్నయ్…
.
Share this Article