ఏమో… కొన్నిసార్లు జగన్ శిబిరంలో ఎవరేం మాట్లాడతారో అర్థం కాదు… వారిలో లక్ష్మిపార్వతి కూడా ఉంటుంది… అసలు ఆమెను జగన్ ఎందుకు ఎంటర్‌టెయిన్ చేస్తున్నాడో అర్థం కాదు… ఆమెతో నిజానికి పార్టీకి ఏ ఫాయిదా లేదు… ఎన్టీయార్ పేరు చెప్పి చంద్రబాబును తిట్టడం వరకూ వోకే… ఆ విమర్శల్లోనైనా పంచ్ ఉంటుందా అంటే అదీ ఉండదు… ఇప్పటి తరానికైతే అసలు ఆ విమర్శలే పట్టవు…
ఆమె కాలంతోపాటు అప్‌డేట్ కావడం లేదు… ఇక కాలేదు కూడా… ఏదో మాట్లాడుతూ ఉంటుంది… ప్రత్యేకించి ఆమెకు ఏ పాలనపరమైన, వర్తమానంలోని సబ్జెక్టులు తెలియవు… నందమూరి ఫ్యామిలీని, చంద్రబాబును తిట్టేందుకు మాత్రం ఏవేవో పాత విషయాలన్నీ తవ్వుతూ ఏదో మాట్లాడుతుంది… ఇప్పుడు తాజాగా బాలయ్యను ఉద్దేశించి నీ ‘అన్‌స్టాపబుల్ షో’కు పిలుస్తావా అని సవాల్ చేసింది…
అబ్బ, భలే సవాల్ విసిరింది అంటూ కొన్ని సైట్లు మురిపెంగా రాసుకున్నాయి… *బాలయ్యకు లక్ష్మీ పార్వతి సవాల్..* అని శీర్షికలూ పెట్టుకున్నయ్… షాకింగ్, సంచలన వ్యాఖ్యలు అంటూ తెలుగు వెబ్ భాషను కుమ్మేసుకున్నాయి… పోనీ, బాలయ్య నిజంగానే పిలిచాడు అనుకుందాం… పోయి, ఏం మాట్లాడుతుంది ఆమె… పాతబడిన సంగతులే, పదే పదే చెప్పిన ముచ్చట్లే తప్ప కొత్తగా ఇంకేం చెబుతుంది..? వెన్నుపోటు, బాబు ద్రోహం, నందమూరి కుటుంబసభ్యుల మౌనం అన్నీ వినీ వినీ అరిగిపోయాయి…
Ads
ఒకవేళ బాలయ్య పిలిస్తే వెళ్లి కూర్చుని… ఏవేవో విమర్శలు చేయవచ్చు అనుకుంటుందేమో… అలా మాట్లాడనిస్తాడా బాలయ్య… పైగా అది లైవ్ కాదు, పక్కాగా ఎడిటింగ్ జరిగాకే బయటికి ప్రసారం చేస్తారు… అంతేకాదు, అన్‌స్టాపబుల్ అనేది పక్కాగా స్క్రిప్టెడ్… అంటే బాలయ్య ఏం అడగాలో, ఏ గెస్టును ఎలా డీల్ చేయాలో, ఏం ఆడించాలో కూడా ముందే ఖరారవుతుంది… అది కూడా ఓ సినిమా టైపు… చాలా వర్క్ జరుగుతుంది షోకు ముందు… గెస్టులు కూడా పర్‌ఫామ్ చేయాలి, నటించాలి…
ఈ స్థితిలో ఒకవేళ లక్ష్మిపార్వతిని మాట్లాడనిచ్చేదీ ఉండదు, మాట్లాడినా అది ప్రసారమయ్యేదీ ఉండదు… మరి ఆమెకు అన్‌స్టాపబుల్ షో గురించి ఏం తెలుసో మనకు తెలియదు… ‘‘నందమూరి తారకరత్న మరణించడం చాలా బాధాకరం. ఆయన మరణం నన్ను చాలా కలిచివేసింది’’ అంటూ ఓ యూట్యూబ్ చానెల్‌లో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘‘నా భర్తను ఆ చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచాడో నాకు తెలుసు. ఆ సమయంలో తన కొడుకులు కూడా నా భర్తకు సపోర్టుగా లేరు, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత తన ఆస్తి మొత్తాన్ని తన కొడుకులు, కూతుర్ల పేరు మీదే రాశారు. అప్పటి ప్రతి విషయం నాకు తెలుసు, నేనే సాక్ష్యం, ధైర్యం ఉంటే బాలకృష్ణను నన్ను ఒక్కసారి అన్ స్టాపబుల్ షోకి పిలవమనండి’’ అనడిగిందామె…
ప్రతిదీ పాత విషయమే… జనం ఎప్పుడో మరిచిపోయారు… లక్ష్మిపార్వతి ఎంత తవ్వినా పొలిటికల్‌గా జగన్‌కు వచ్చే ఫాయిదా ఏమీ లేదు… నందమూరి కుటుంబానికి కొత్తగా జరిగే నష్టం కూడా ఏమీ లేదు… ఇంతకు మించి ఏదైనా కొత్త ఆసక్తికర విషయాలు మాట్లాడటం ఆమెకూ తెలియదు… హేమిటో…!! ఇంకా హరికథలు చెప్పుకునే ఆ కాలంలోనే ఉండిపోతే ఎలాగమ్మా…!!
అన్‌స్టాపబుల్ షో రెండు సీజన్లు అయిపోయింది… మూడో సీజన్ సందేహంలో పడింది… అసలు రెండో సీజనే గాడితప్పి ఎటెటో పోయింది… చంద్రబాబు, ప్రభాస్, పవన్ కల్యాణ్ ఎపిసోడ్లను రెండే భాగాలుగా ప్రసారం చేశారు… పవన్ కల్యాణ్ ఎపిసోడే రెండో సీజన్‌కు ఫినాలే… మూడో సీజన్ వస్తుందో రాదో, వస్తే ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేరు… అసలు పవన్ కల్యాణ్‌తోనే అన్‌స్టాపబుల్‌ను అమీర్‌ఖాన్ ‘సత్యమేవ జయతే’ టైపులో చేయిస్తే ఎలా ఉంటుందని అల్లు అరవింద్ ఆలోచిస్తున్నాడట… సో, లక్ష్మిపార్వతి అడగడం, అది ఆగిపోవడం భలే కాకతాళీయం…!!
Share this Article