చాలామంది నమ్మరు మా ప్రేమకథను… అసాధారణ కాలహరణం… ఏళ్ల తరబడీ జాప్యం… నిరీక్షణకు మేం పర్యాయపదాలం… హమారా నబ్బే వాలా ప్యార్ థా… అంటే నైన్టీస్ నాటి ప్రేమ కథ… అప్పట్లో డైరెక్ట్ మెసేజుల్లేవు… వాట్సపుల్లేవు… ఆన్ లైన్ చాటింగుల్లేవు… కానీ ఒకరి పేరు వినిపించగానే మరొకరి హార్ట్ స్కిప్పయ్యే ప్రేమ మాది…
అప్పుడు నాకు 18 ఏళ్లు అనుకుంటా నేను సంజయ్ గారిని తొలిసారి కలిసింది... తను నా బ్రదర్ స్నేహితుడు… కలిసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నా చూపుల్ని దొంగిలిస్తున్నాడు, నేను చూడగానే చూపు మళ్లిస్తున్నాడు… నచ్చాడు… పర్ ముఝేలగా వన్ సైడెడ్ హై… అంతా నావైపు నుంచి ఏకపక్షమే…
కొన్నేళ్లు అలా గడిచిపోయాయి… ఓసారి నా ఎదుట అంగీకరించాడు… వ్యక్తీకరించాడు… ముఝే ఆప్ అచ్చీ లగ్‌తీ హో… నాకు మీరు బాగా నచ్చారు… ఐసా లగా కోయి సప్నా హో… కానీ మేం మా బంధాన్ని చాన్నాళ్లు రహస్యంగానే ఉంచాం… అప్పుడప్పుడూ బయటికి వచ్చేదాన్ని, గుడి దగ్గర ఇద్దరమూ కలుసుకునేవాళ్లం…
Ads
మరికొన్నేళ్లు ఇలాగే గడిచిపోయాయి… నాకు ముప్ఫయ్ ఏళ్లు వచ్చినయ్… నాన్నకు మా సంగతి చెప్పాను… తొలుత ఆశ్చర్యపోయాడు… కాసేపు ఆలోచించి తాపీగా ‘ఉస్సే ఘర్ ఖరీద్‌నే బోలో, ఫిర్ సోచేంగే..’ అన్నాడు… ముందు ఓ ఇల్లు కొనుక్కోమను, ఆలోచిద్దాం… నాకు తెలుసు, ఆయన ఒప్పుకోడని… సంజయ్ వేరే కులానికి చెందినవాడు కదా… పెళ్లి వద్దనడానికి ఇదొక సాకు…
కానీ మేం ముందే అనుకున్నాం… పెద్దలను ఎదిరించి పెళ్లి వద్దు… ఒప్పించి, అంగీకరించాకే చేసుకుందాం… అందుకే డబ్బు సంపాదించే పనిలో పడ్డాడు సంజయ్… ఇల్లు కొనాలి, మా నాన్నకు చూపించాలి… ఏళ్లు గడుస్తున్నాయి… మేం అప్పుడప్పుడూ కలుస్తూనే ఉన్నాం… ‘మా’ గురించే మాట్లాడుకుంటాం… నా ఫ్యూచర్ ఏమిటో నాకే అర్థం కావడం లేదు…
ఇప్పుడు సంజయ్ డబ్బున్నవాడు… మంచిగా సంపాదించాడు… నాన్నతో చెబుతున్నప్పుడల్లా టాపిక్ మార్చేసేవాడు… వేరే వాళ్లను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈమధ్య… సంబంధాలు చూస్తున్నాడు… నేను తిరస్కరిస్తూనే ఉన్నాను… ఎప్పుడైతే నాన్న ఆరోగ్యం దెబ్బతిన్నదో నా మనసు, మైండ్‌పై ఒత్తిడి పెరగసాగింది… ఔర్ సచ్ కహూ తో… నిజం చెప్పాలంటే సంజయ్‌ను అందరి ఆమోదంతో పెళ్లి చేసుకోగలననే నమ్మకం పోతోంది…
అదే చెప్పాను తనతో… ఇంకెవరినైనా పెళ్లి చేసుకో సంజూ అన్నాను… అంటున్నప్పుడు కన్నీళ్లు నా మాటవినలేదు… చెంపల మీదకు జారిపోతూనే ఉన్నాయి… ప్రేమంటే ఇంత నొప్పా..? కానీ సంజూ అన్నాడు… ‘‘పెళ్లి చేసుకుంటే అది నిన్నే…’’ ఇంకేం మాట్లాడను… ఎన్నేళ్లయినా ఎదురుచూద్దాం అంటున్నాడు… అంతటి మంచి ప్రేమను పొందడం అదృష్టమే, కానీ ఎన్నాళ్లిలా…?
నాకు నేనే చెప్పుకున్నాను… ‘‘ఎంత కాలమైనా కానివ్వు, తన కోసం ఎదురుచూస్తాను’’… అలా ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి… నేను పెళ్లి సంబంధాల్ని రిజెక్ట్ చేస్తూనే ఉన్నాను… సంజూ కూడా పెళ్లి చేసుకోలేదు ఎవరినీ… నాన్న మొండి… కానీ ఆరోగ్యం మరింత దెబ్బతిన్నది… మనిషి పంతం సడలింది… 2020లో… నాన్న ఓరోజు దగ్గరకు పిలిచి… ‘‘అతన్నే పెళ్లిచేసుకో బిడ్డా’’ అన్నాడు… అప్పుడు నా వయస్సు 45 ఏళ్లు… 22 ఏళ్లపాటు నిరీక్షణ… మామూలు విషయమా…? చెవుల్లో ఆనందపు హోరు… కళ్లల్లో కట్టలు తెగిన నీళ్లు…
తనకు ఏమైనా జరగకముందే నా పెళ్లి చూడాలనుకున్నాడు నాన్న… 2022లో తను చనిపోయాడు… అప్పటికి మా పెళ్లి ఇంకా జరగనే లేదు… తను వెళ్లిపోయాక ఇక ఆ ఇంట్లో ఉండబుద్ది కాలేదు… కొన్నాళ్లు అన్న ఇంట్లో ఉన్నాను, కానీ నేనంటే ఎందుకో పడదు, మాట్లాడేవాడు కూడా కాదు… నేను, సంజూ ఇక తప్పనిసరై మేమిద్దరమే వెళ్లి పెళ్లిచేసుకున్నాం… నా కళ్లు ఏడుస్తున్నయ్, నవ్వుతున్నయ్… నా ప్రేమకథ నాకే విచిత్రంగా ఉంది… నాన్న లేడు… అడ్డుకునేవాళ్లు లేరు… ఎక్కడో పైనుంచి ఆశీర్వదిస్తూనే ఉండి ఉంటాడు, ఇన్నేళ్లు నా పెళ్లిని ఆపినందుకు పశ్చాత్తాపపడుతూ ఉంటాడు బహుశా…
సంజూ నన్నే చూస్తున్నాడు నవ్వుతూ… మురిపెంగా… ఎన్నేళ్లు, ఎన్ని పుష్కరాలు, ఒకతరం గడిచిపోయింది… ఎలాగైతేనేం… నాకూ ఓ ఇల్లు ఉంది ఇప్పుడు… అంటే నాకూ ఓ సంసారం ఉంది… నా ప్రియుడితో ముడిపడిందే… !!
Share this Article