తెలుగునాట హాస్యప్రియులు ఏది మిస్సయినా సరే… కేఏపాల్, సబ్బం హరి, చంద్రబాబు, ఆంధ్రప్రభ పత్రికను అస్సలు ఇగ్నోర్ చేయలేరు… బీపీని తగ్గించి, ఒత్తిడి ద్వారా వచ్చే అనారోగ్యాల నుంచి కాపాడే పాజిటివ్ పేర్లు ఇవన్నీ…! అబ్బే, ఆంధ్రప్రభ చాలారోజులుగా మనల్ని నిరాశపరుస్తోంది అనుకుంటామో లేదో ఓ అరివీర భజన వార్తో, ఓ అనూహ్యమైన నమ్మలేని కథనమో అచ్చేసి వదులుతుంది… ఈరోజు ఓ వార్త చదవండి… అది ప్రకటనో, వార్తో, స్పెషల్ కథనమో, చరిత్రో, భజనో ఎంతటి ఘనుడైన పాత్రికేయుడు కూడా చెప్పలేడు… దటీజ్ ఆంధ్రప్రభ… సూపర్…
ఆ కథనం ఏమిటయ్యా అంటే..? శీర్షిక పేరు… జీతెలుగు సంక్రాంతి సంబరాలు… గుడ్, కోట్లాది మందికి ఈ సంక్రాంతి పండుగపూట అందుబాటులో ఉన్న వినోదసౌలభ్యం టీవీయే కాబట్టి… బయటికి వెళ్లి సంబరాలు చేసుకునే రోజులు కావు కాబట్టి… టీవీల్లో వచ్చే సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాలు పబ్లిష్ చేస్తే మంచిదే… చేయాలి కూడా… కానీ ఒక్క జీతెలుగు మాత్రమే ప్రసారం చేయడం లేదు కదా… ఫాఫం, ప్రతి పండక్కి ఈటీవీ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటయ్… ఈమధ్య మాటీవీ కూడా స్టార్ట్ చేసింది… ఒకటీరెండు చేసి జెమినికి దమ్మొచ్చి ఆగిపోయింది కానీ పాపం, దానికీ చేయాలనే ఉంది…
Ads
సరేర భయ్, జీతెలుగుతో ఏం ఒప్పందం ఉండి ఏడ్చిందో… ఆ ఒక్క టీవీ ప్రోగ్రామ్ గురించే కిలోమీటర్ లెంతున్న స్టోరీ అచ్చేసి వదిలింది… ష్, ఏమాటకామాట… సాక్షాత్తూ జీతెలుగు వాడు సొంతంగా ఓ పత్రిక పెట్టుకున్నా సరే, వాడు కూడా ఇంత బాగా రాసుకోలేడు… నిజం…
అద్భుతం, ఫేవరెట్, అలరించడం, కనీవినీ ఎరుగని రీతిలో… వంటి పదాల్ని యథేచ్ఛగా వాడుతూ… ఆహోఓహో డప్పు కొట్టీ కొట్టీ… చివరకు జీ ప్రైమ్ ప్యాక్ ఎంచుకోవాలని కూడా పత్రిక పిలుపునిచ్చింది… కెమెరామెన్, ఎడిటర్ల పేర్లు తప్ప… ఆ స్పెషల్ ప్రోగ్రాంలో పాల్గొన్న యాంకర్లు, వీజేలు, డాన్సర్లు, సింగర్లు, గెస్టులు గట్రా అందరి పేర్లూ రాసి… ఈ స్పెషల్ ప్రోగ్రాం చూడకపోతే పుట్టగతులు ఉండవు సుమా అన్నంత ఇదిగా గీకిపారేశారు… హహహ… అసలు నవ్వొచ్చే విషయం ఏమిటంటే..? ఏదో నాలుగు డబ్బుల కక్కుర్తితో ఏదో ఓ ప్రోగ్రాం గురించి డప్పు కొట్టారు సరే…
ప్రభుత్వాలకు కొట్టడం లేదా..? పాలసీలకు కొట్టడం లేదా..? ఇదీ అంతే అనుకుని, కాసింత వైరాగ్యం కలగలిపి ఓసారి నవ్వుకుంటాం… కానీ ఇది మరీ హైలైట్… జీతెలుగు ఓనర్ కంపెనీ ఏమిటి..? అదెప్పుడు లాంచ్ అయ్యింది..? దగ్గర నుంచి… ఇప్పుడు జీ5 అనబడే వాళ్ల సొంత ఓటీటీలో కూడా ఈ టీవీ ప్రసారాలు లభ్యమవుతున్నాయనే సంగతి దాకా ఓ చరిత్ర రాసిపారేసింది… మరీ ఇచ్చింత్రం ఏమిటంటే..? ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో టాప్ జీఈసీ చానెల్ అని కూడా పత్రిక సర్టిఫికెట్ ఇచ్చేసింది… పాపం, ఎక్కువ బార్క్ రేటింగ్స్ ఉన్న మాటీవీ ఏమైపోవాలి మరి..? సార్, ఈ వార్త కింద ఏడీవీటీ అని రాయడం మరిచిపోయారా..? లేక పెయిడ్ ఆర్టికల్ తరహాలో… ఈ వార్తల కేరక్టరే ఇలాంటిదా..?!
Share this Article