కొన్నేళ్ల క్రితం… మా ఇంటికి రోజూ అయిదారు న్యూస్ పేపర్లు తెప్పించుకునేవాళ్లం… Economic Times, Times of India, Mid day, Saamna, Navbaharat times, Mumbai mirror… రోజూ పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ చేస్తూ పేపర్లు తిరగేయడం నాకున్న అలవాటు… చాలాసార్లు ఆ పేపర్ల కోసం అరిచేవాడిని… ఎందుకంటే..? అప్పటికే ఆ పేపర్లు మా బ్రదర్ రూమ్‌లో గానీ, నాన్న మంచం మీద గానీ పడి ఉండేవి… నాకు చాలా కోపం వచ్చేది…
కరోనా… లాక్ డౌన్ వచ్చేసింది… చాలామంది పేపర్లు తెప్పించడమే మానేశారు… సోషల్ మీడియా, టీవీ వార్తలు చూడటంతోనే సరిపోతోంది… పేపర్లలో కొత్త విషయాలేమీ రావడం లేదు… కానీ పేపర్ చదవకపోతే ఆ రోజు మొదలు పెట్టినట్టే ఉండదు… మా ఇంటికి కూడా పేపర్లు బంద్ పెట్టాల్సి వచ్చింది… అసలు పేపర్ బాయ్స్ రావడం లేదు కదా… బయటికి వెళ్లి కొనుక్కునే సీన్ కూడా లేదు…
లాక్ డౌన్ అయిపోయింది… పేపర్ చదవడం అలవాటు తప్పింది… నిజం చెప్పాలంటే పేపర్ చదవడం ద్వారా నాకేమీ కొత్త విషయం తెలియడం లేదు… అవి అప్‌డేట్ కావడం లేదు… కానీ పేపర్ చదువుతూ బ్రేక్ ఫాస్ట్ చేయడం అనే అలవాటు నాకు ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది… దానికోసమే జస్ట్, ఒక్క పేపర్ మాత్రం తెప్పించడం మొదలుపెట్టాం… ఐనా అయిదారు పేపర్లు చదవడానికి ఎవరున్నారని..?
Ads
తమ్ముడు బొంబాయికి షిఫ్ట్ అయిపోయాడు… నాన్నకేమో పేపర్ చదివేందుకు చూపు సరిగ్గా ఆనడం లేదు… చదవలేడు… ఇంట్లో పేపర్ చదివేవాడిని నేనొక్కడినే మిగిలాను… తమ్ముడి రూమ్‌లో నుంచి లేదా నాన్న బెడ్ మీద నుంచి అరిచి తెప్పించుకుని చదవడంలో ఉన్న తృప్తి స్ట్రెయిట్‌గా నేనొక్కడినే చదవడంలో లేదు… అందుకే పేపర్ చదవడం చకచకా ముగిసిపోతోంది… అసంతృప్తిగానూ ఉంది…
ఇప్పుడు పేపర్ చేతిలోకి తీసుకోగానే గతంలో నేను అరిచిన అరుపులు, ఉద్వేగాలు, కోపాలు గుర్తొస్తున్నాయి… మళ్లీ తమ్ముడు ఈ ఇంటికి వచ్చేస్తే బాగుండు… నాన్న చూపు బాగుపడి మళ్లీ పేపర్ చదివితే బాగుండు… కానీ మనం అనుకున్నట్టు జరుగుతాయా..? అవన్నీ దాటిపోయిన సంగతులు… తిరిగి రావు… రావని నాకూ తెలుసు… కానీ మనసులో ఆశ… ఇలాంటి చిన్న చిన్న విషయాలే కదా ఇంటిని సజీవంగా ఉంచేది…
రోజూ ఉదయమే చదవడానికి ఒకే పేపర్ మాత్రమే తెప్పించడం అనేది పెద్ద ఇష్యూ ఏమీ కాదు నాకు… ఆఫీసులో కూడా చదవగలను… కానీ ఇంట్లో మార్నింగ్ కాఫీ తాగుతున్నప్పుడు, టీవీలో ఉదయం వార్తలు చూస్తూ, బ్రేక్ ఫాస్ట్ చేస్తూ పేపర్ చదవడంలో ఉన్న తృప్తి వేరు… కానీ వేరే అంశాలు నా మనసులో పదే పదే మెదులుతున్నాయి…
నేను వెనక్కి వెళ్లి, ఆ పాత అరుపుల్ని డిలిట్ చేసే అవకాశం వస్తే బాగుండు… నా కోపాన్ని, నా అసహనాన్ని తగ్గించుకుంటే ఎంత బాగుండేది… ఒక్క పేపర్ చదవడం కోసం నాన్నపై, తమ్ముడిపై అంతగా అరవాలా నేను..? కానీ గతంగతః ఇప్పుడేం చేయగలను..? కాలం మారుతుంది, జనం మారుతారు, పరిస్థితులు మారతాయి… వ్యక్తుల్ని బట్టి, విషయాల్ని బట్టి, సందర్బాల్ని బట్టి మనం ప్రదర్శించిన అకారణ కోపాల్ని, అనవసర ద్వేషాన్ని ప్రదర్శించానని నేను గ్రహించేసరికి లేటైపోయింది… దిద్దుకునే అవకాశం నన్ను దాటి వెళ్లిపోయింది… నాకిప్పుడు ఎందుకో పొద్దున్నే పేపర్ కూడా చదవబుద్ది కావడం లేదు… పేపర్ బాయ్‌కు ఈ పేపర్ కూడా వద్దని చెప్పేశాను… ఒకప్పుడు ఆరు పేపర్లు తెప్పించుకున్న ఇల్లేనా ఇది అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ బాయ్ మెట్లు దిగి వెళ్లిపోయాడు…! (ఒక ఇంగ్లీష్ పోస్ట్ కు నా తెలుగు అనువాదం)
Share this Article