రైతులకు వస్తుందా సంక్రాంతి?
———————-
సంక్రాంతి అర్థం, పరమార్థం ప్రవచనాకారులకు వదిలేద్దాం. ఏ భక్తి టీ వీ పెట్టినా టీ వీ తెర మొత్తం సంక్రాంతి ముగ్గులే. గొబ్బెమ్మలే. మకర సంక్రమణ భాష్యాలే. నిజానికి ఒక సంవత్సర కాలంగా అన్ని పండగలకు ముందు విశేషణ పూర్వపద ఖర్మ ధారయ కరోనా తోడయ్యింది. కరోనా దసరా, కరోనా దీపావళి… తాజాగా కరోనా సంక్రాంతి. అయితే ఈ సమాసాన్ని పాజిటివ్ గా తీసుకుందామంటే- కరోనా వేళ నెగటివ్ మంచిది కానీ- పాజిటివ్ మహా ప్రమాదం అని లోకం భయపడుతుంది. కరోనా సంక్రాంతి అన్నప్పుడు కరోనా తెచ్చిన సంక్రాంతి అని పాజిటివ్ గా కాకుండా, సంక్రాంతిని ముంచిన కరోనా అని నెగటివ్ గా తీసుకోవడమే ఉత్తమం.
———————
సంక్రాంతి రైతుల పండుగ. పొలాల పండుగ. ఆరుగాలం దుక్కి దున్నే ఎద్దుల పండగ. పండిన పంటను మూటకట్టి మూపున మోసి బండ్ల మీద ఇండ్లకు చేర్చే ధనధాన్యాల పండుగ. ముత్యాల ముగ్గులు, రతనాల రంగులు చల్లుకుని వీధులు హొయలుపోయే పల్లె పండుగ. పొలం నడిచివచ్చి ఊళ్లో పరవశించి పాడే పండుగ. పట్నం కాంక్రీటు జనారణ్యం వదిలి పతంగమై టోల్ గేట్ల మీదుగా పల్లెను వెతుక్కుంటూ వెళ్లే పండుగ. కోర్టులు వద్దంటున్నా కోళ్లు కాళ్లకు కత్తులు కట్టుకుని కుత్తుకలు తెంచుకునే చంపుడు పందెం పండుగ. కొత్త అల్లుళ్లు అత్తారింటి మర్యాదలు లెక్కపెట్టుకోవడానికి బయలుదేరే పండుగ. చలి పులికి భోగి మంట పెట్టి పొమ్మనకుండానే పొగబెట్టే పండుగ.
———————-
Ads
నగరాల్లో శిల్పారామాల్లో డూ డూ బసవణ్ణలు, గంగిరెద్దులు ప్రదర్శనగా మారిన పండుగ. అపార్ట్ మెంట్ల పాలరాతి నునుపైన ఫ్లోర్ మీద స్టిక్కర్లుగా ముగ్గులు అతుక్కుని పెయింటులో పెయింటుగా మిగిలిన పండుగ. ‘ స్వగృహ స్వీట్ షాపుల్లో నుండి తెచ్చుకున్న మేలయిన మిఠాయిలు నోరు తీపి చేసే పండుగ. హై రైజ్ అపార్ట్ మెంట్ల మీద పతంగులు ఎగరలేక ఎగరలేక కరెంటు వైర్లలో చిక్కుకుని తలదించుకునే పండుగ. టీ వీ ఛానెళ్లలో అదే ద్వంద్వార్థ పాచి ప్రోగ్రాములు బూతుకు అర్థం చెప్పే ప్రత్యేక పండుగ.
———————-
దేశమంతా రైతులు దిగులుగా ఉన్నప్పుడు వచ్చిన పండుగ. రైతులు రోడ్డెక్కినప్పుడు వచ్చిన పండుగ. పంటకు ప్రతిఫలం కన్నీళ్లేనా? అని నీళ్లింకిన కళ్లతో రైతులు ప్రశ్నిస్తున్నప్పుడు వచ్చిన పండుగ. వ్యవసాయంలో వ్యయం తప్ప సాయం ఉండదని ఏలికలు మొండిగా ఉన్న వేళ సర్వోన్నత న్యాయం సంప్రదింపులకు దిగకతప్పని వేళ వచ్చిన పండుగ. రైతు వెన్నెముకలో సందేహాల గునపాలు గుచ్చుకున్న వేళ వచ్చిన పండుగ. కార్పొరేట్ శక్తుల డేగ కళ్లు పచ్చటి పొలాలమీద పడ్డవేళ వచ్చిన పండుగ. పండే గింజ గిజగిజలాడుతున్న వేళ వచ్చిన పండుగ. పండిన పంటకు వెల ఎవరు నిర్ణయిస్తారో తెలియక పంట గుండెలో మంటలు రేగినవేళ వచ్చిన పండుగ.
————————
కలకాలం ఉండవులే కష్టాలు- కన్నీళ్లు. చీకటి తొలగి ఉత్తరాయణ సూర్యుడు రైతులకు మేలు చేయకపోడు. సంక్రాంతి ఆ కాంతులను అందరికీ పంచాలని కోరుకుంటూ…………… – పమిడికాల్వ మధుసూదన్
Share this Article