Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వ్యాపారి దిల్ రాజు ఎలాగూ చదవడు… బలగం వేణూ, ఇది ఓసారి చదువుతావా…

March 6, 2023 by M S R

బలగం సినిమా కథనం చిక్కగా ఉండి, ప్రేక్షకుడిని కదలనివ్వదు… సున్నిత మనస్కులైతే ఏడిపిస్తుంది… వేణు దర్శకత్వ ప్రతిభ మీద ఎవరికీ డౌట్ లేదు… జబర్దస్త్ వంటి ఓ చెత్త బూతు షోలో ఏళ్ల తరబడీ కామెడీ చేసినా సరే తనలోని క్రియేటర్‌ చచ్చిపోకుండా కాపాడుకున్నాడు వేణు… దర్శకత్వం చాన్స్ వచ్చింది కదాని మరో చెత్తను మన నెత్తిన పారబోయలేదు… భిన్నమైన, సున్నితమైన కథను బలంగా ప్రొజెక్ట్ చేశాడు… అక్కడి వరకు గుడ్… కమర్షియల్ ట్రాష్ జోలికి పోకుండా కాస్త నాణ్యమైన క్రియేటివ్ వర్క్ చూపించాడు, అసలు ఆ కథను ఎన్నుకోవడమే ఓ సాహసం…

ఆ సినిమా ప్రచారంలో దిల్ రాజును చూస్తుంటే… తన గొప్పతనంగా క్లెయిమ్ చేసుకుంటుంటే ఓరకమైన ఎలపరం… తను వేణుకు ఇంకో చాన్స్ ఇవ్వబోతున్నాడు కాబట్టి, ఈరోజు వేణు దిల్‌రాజును నెత్తిన మోస్తున్నాడు… సరే, అది తన అవసరం… ఆ ఫీల్డే అలాంటిది… చౌకగా సినిమా తీయగలడు కాబట్టి ఇంకో చాన్స్ ఇస్తున్నాడు దిల్ రాజులోని వ్యాపారి… అంతేతప్ప తనకు తెలంగాణతనం మీద ప్రేమ ఏమీ కారిపోవడం లేదు… అలాంటి సున్నితమైన ఫీలింగ్స్‌కు అతీతుడు తను…

నేను మా ఇంట్లో జరిగిన ఓ సన్నివేశం చూశాక, ఆరేళ్లు కష్టపడి ఈ కథ రాసుకున్నాను అంటున్నాడు వేణు… మరీ అంత ఓవరాక్షన్ వద్దులే వేణూ… ఈ పిట్ట ముట్టుడు, పెద్ద కర్మ కథలు, దినాలరోజు బాగోతాలు ఎవరికీ తెలియనివి కావు… ఇంతకుముందు కథల్లో, సినిమాల్లో లేనివీ కావు… జర్నలిస్టు గడ్డం సతీష్ రాసిన కథలో బేసిక్ పాయింట్ కూడా ‘పిట్ట ముట్టుడు’… అయితే ఆ పాయింట్ చుట్టూ వేణు వేరే కథ రాసుకోవచ్చు, దాన్ని ఖండించలేం… కానీ ఓ కీలకమైన పాయింట్ మీద ఎవరైనా ఓ కథ రాసినప్పుడు, దాని ఆధారంగానే సినిమా రూపొందినప్పుడు సదరు రచయితకు ఆ క్రెడిట్ దక్కాలిగా…

Ads

balagam

ఓ మిత్రుడి ఫేస్‌బుక్ వాల్ మీద ఓ పోస్టులో కనిపించింది… ‘‘#సావువిందు నుండి దోస్తు గడ్డం సతీష్ #పచ్చికి కథ దాకా చాలా వచ్చాయి… అలాగే కొన్ని సినిమాలు తిథి ( కన్నడ ) ఈ మా యూ ( మలయాళం )… జల్లికట్టు డైరెక్టర్ జల్లికట్టు కంటే ముందు తీసిన సినిమా దీనికి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది… రాం ప్రసాద్ తెర్వి (హిందీ )…’’

tehrvi

రాంప్రసాద్ తెర్వి సినిమాలో ఈ పిట్ట ముట్టుడు పాయింట్ లేకపోవచ్చు… కానీ ఆ సినిమా కూడా పెద్ద కర్మ సందర్భంగా వచ్చే పంచాయితీలే… సీమా పా దర్శకురాలిగా చేసిన తొలిసినిమా… నసీరుద్దీన్ షా ఓ ప్రధాన పాత్రధారి… పిండదాన్ అని సీమా పా ఓ నాటకం రాసుకుంది… దాన్నుంచే ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాసుకుంది… తెర్వి అంటే పదమూడవది, అంటే పదమూడో రోజు, అంటే పెద్ద కర్మ… తెలంగాణలో దినాలు అంటాం… ఆరోజు మృతుడి బంధువులు, కుటుంబసభ్యుల అభద్రతలు, రాజకీయాలు, ఇతర తగాదాలన్నీ బయటకొస్తాయి… తప్పదు, ఆరోజున కాకపోతే ఈరోజుల్లో ఇంకెప్పుడు అందరూ కలుస్తారు..?

thithi

కన్నడంలో వచ్చిన మూవీ తిథి… ఇదీ పదకొండు దినాల రోజు (పెద్ద కర్మ… కొన్నిచోట్ల 11 దినాలకు చేస్తారు, కొందరు 13 రోజులకు చేస్తారు…) ఆ కుటుంబంలో జరిగిన చర్చలు, ఇంటి రాజకీయాలే సినిమా… (శ్రాద్ధం పెట్టే రోజును కూడా తిథి అంటారు కొందరు… తద్దినం, శ్రాద్ధం అనే పదాలు వాడకుండా ఫలానారోజు తిథి అంటుంటారు…) ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది… 2015 రిలీజ్…

ee ma yau

మలయాళంలో 2018లో ఇమాయు సినిమా వచ్చింది… (Eesho Mariyam Yauseppe)… ఇదీ అంత్యక్రియల బాపతు కథే… కాకపోతే ఇది హిందూ కుటుంబాల్లో జరిగే అంత్యక్రియల తంతు కాదు… ఓ లాటిన్ కేథలిక్ కుటుంబానికి సంబంధించిన కథ… ఈ సినిమాకు కూడా చాలా అవార్డులు వచ్చాయి… దీన్నే తెలంగాణీకరిస్తే, ఓ హిందూ కుటుంబానికి వర్తింపజేస్తే అది బలగం మూవీ అవుతుంది… పెద్ద కర్మ విందులు, పిట్ట ముట్టుడు, కుటుంబ మనస్పర్థలు గట్రా చాలా కథల్లో, నవలల్లో, సినిమాల్లో వచ్చినవే… దీనికి ఆరేళ్లు కష్టపడి రాసుకున్నాను వంటి సినిమా బాపతు హిపోక్రటిక్ కథలెందుకు వేణూ..? ఇంకా తవ్వకాలు జరపితే ఈ బేసిక్ పాయింట్ మీద బోలెడు ఉదాహరణలు బయల్పడతాయి..!!

‘చిల్లర వ్యక్తులు’ అంటూ గడ్డం సతీష్ మీద చేసిన విమర్శను జబర్దస్త్ తాలూకు బలుపు అంటారు కదా వేణూ… దిల్ రాజు అండ చూసుకున్న చిల్లరతనం అనేవాళ్లకు నీ దగ్గర జవాబు ఉందా వేణూ… ఒక్క సినిమాతో అంత ఎక్కిపోయిందా అనేవాళ్లూ ఉంటారు సుమా…!! నీ ప్రతిభ ఎంతదయితేనేం… సంస్కారం లేని ప్రతిభ చిల్లిగవ్వకూ కొరగాడు కదా వేణూ… ఇప్పటి నీ బాస్ దిల్ రాజు తన అవసరం తీరాక, పనికిరారు అంటూ వట్టిపోయిన సరుకును బోలెడు వదిలించుకున్నాడు… జాగ్రత్త…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions