పాన్ ఇండియా సినిమాలు… ప్రతి సినిమాకు ఓటీటీ, ఓవర్సీస్, శాటిలైట్ హక్కుల పేరిట థియేటర్ ఆదాయానికి అదనంగా బోలెడంత డబ్బు వరదలా వచ్చిపడుతోంది… థియేటర్లలో ఫెయిలైన సినిమా కూడా ఎంతోకొంత లాభంతో బయటపడుతోంది ఈ అదనపు ఆదాయంతో..! కాస్త హిట్టయినా సరే ఇక డబ్బే డబ్బు… (హిందీ సినిమాలు దీనికి భిన్నం… మరీ ఘోరంగా ఫ్లాపయి చేతులు మూతులు కాలిన నిర్మాతలు ఎందరో…)
ఈ డబ్బుతో హీరోల రెమ్యునరేషన్లు ఆకాశాన్ని అంటుతుండగా, ఇక హీరోయిన్ల రెమ్యునరేషన్లు కూడా ఊహించనంత పెరిగిపోయాయి… ప్రాజెక్టు కె సినిమా కోసం దీపిక పడుకోన్‌కు 10 కోట్లు ఇస్తున్నారట… ఊహించనంత డబ్బు… ఆ ప్రాజెక్టు ఖర్చు కూడా భారీగా ఉండబోతోంది కాబట్టి వాళ్లకు 10 కోట్లు బాలీవుడ్ హీరోయిన్‌కు ఇవ్వడం అనేది చిన్న విషయంగానే ఉండవచ్చు బహుశా…
Ads
దీపిక పడుకోన్ మాత్రమే కాదు… బాలీవుడ్ నుంచి ఏ స్టార్ హీరోయిన్‌ను తెలుగు సినిమా కోసం తీసుకొచ్చినా కనీసం 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారుట… అంతెందుకు… శ్రీదేవి బిడ్డ తెలుగులో నటించబోతోందహో అని ఎంతోకాలంగా ప్రచారం జరుగుతోంది కదా… ఇప్పుడు అది కార్యరూపం ధరించింది… కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ నటించబోయే, ఇంకా పేరు పెట్టని సినిమాలో నటిస్తున్నట్టు జాన్వీ స్వయంగా ప్రకటించింది… ఇక డౌట్లు లేవు, ఊహాగానాలు అసలే లేవు… ఆమే షేర్ చేసుకున్న పోస్టర్ కూడా బాగుంది… ‘‘నా ఫేవరెట్ జూనియర్ ఎన్టీయార్‌తో కలిసి నటిస్తున్నందుకు మస్తు హేపీగా ఉందని చెబుతోంది…
ఒక్కసారి ఆమె జూనియర్ 30 సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాక, రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు అస్సలు ఆలోచించలేదు… ఎంతైనా సరే చెల్లించడానికి సిద్ధపడ్డారు… ఆమె పాత్ర, ఆమె ఉనికి ఖచ్చితంగా సినిమాకు అదనపు ప్లస్ పాయింట్ అవుతుంది… శ్రీదేవి రాజ్యమేలిన సౌత్ సినిమాలోకి తొలిసారిగా జాన్వీ ఇలా ఎంట్రీ ఇవ్వబోతోందన్నమాట… ఆమెకు 5 కోట్లు చెల్లించబోతున్నట్టు ముంబై ఫిలిమ్ ట్రేడ్ సర్కిళ్ల సమాచారం… జూనియర్ సినిమాలో హీరోయిన్‌కు 5 కోట్లు ఇవ్వడం అనేది ఇప్పటి టాలీవుడ్ మార్కెట్ రేట్ల ప్రకారం పెద్ద విషయమేమీ కాదు…
చిన్నాచితకా తారలే కోటి రెండుకోట్లు డిమాండ్ చేస్తుంటే… ఇక దీపిక, జాన్వీ వంటి పాపులర్ తారలు 5 కోట్లు దాటి అడగడంలో వింతేం ఉందని అంటున్నాయి ఫిలిమ్ ట్రేడ్ సర్కిళ్లు… దర్శకుడు శంకర్ నేతృత్వంలో వచ్చే రాంచరణ్ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీకి 4 కోట్లు ప్లస్ జీఎస్టీ ఇస్తున్నారట… సో, సౌత్ ప్రేక్షకుల్లో శ్రీదేవి బిడ్డ పట్ల కనిపిస్తున్న ఆసక్తిని బట్టి చూస్తే 5 కోట్లు ఎక్కువేమీ కాదు… సాధారణంగా టాలీవుడ్ తారలు 1 నుంచి 3 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారట ఇప్పుడు… ఇస్తున్నారు కూడా… ‘‘పాన్ ఇండియా సినిమాలు ఎక్కువైపోయాయి, హిందీ మార్కెట్ సౌత్ సినిమాల్ని బలంగా ఆకర్షిస్తోంది… హిందీ సినిమా అనిపించేందుకు నిర్మాతలు హిందీ హీరోయిన్లను తెర మీదకు దింపుతున్నారు… అలా డిమాండ్ పెరిగిపోయింది’’ అంటున్నారు విశ్లేషకులు…!!
Share this Article